Friday, May 3, 2024

Big story | చంద్రయాన్‌-3 వెనుక నవ నాయకులు!

చంద్రుడి దక్షిణ ధ్రువంమీద అడుగుడిన తొలి దేశంగా భారత్‌ ఖ్యాతిని సగర్వంగా సాధించుకుంది. చంద్రయాన్‌ -3 ఈ ఘనతను సాకారం చేసింది. విశ్వవ్యాప్తంగా కోట్లాదిమంది కళ్లప్పగించి చూస్తుండగా మన విక్రముడు వినమ్రంగా చంద్రుడిపైకి అడుగుపెట్టాడు. శాస్త్రవేత్తల మోముల్లో ఆనందం వెల్లివరిసింది. ఆ క్షణాన భరతమాత తలఎత్తుకు నిలిచింది. ప్రపంచం మనవైపు తేరిపార చూసింది.

అలా మనవైపు చూసేలా చేసిన చంద్రయాన్‌ వెనుక ప్రధానంగా తొమ్మిదిమంది శాస్రవేత్తల బృందం పనిచేసింది. వీరిలో ఆరుగురు అత్యంత కీలక పాత్ర వహించారు. వేయిమంది యువ ఇంజనీర్లు, 53మంది మహిళా శాస్త్రవేత్తలు చేయందించారు. నాసా, యూరోపియన్‌ యూనియన్‌ స్పేస్‌ ఏజెన్సీ నుంచి స్టార్టప్‌ల వరకు ఈ విజయంలో పాలుపంచుకున్నాయి. దాదాపు రూ. 700 కోట్ల ఈ ప్రాజెక్టులో ఎవరేమి చేశారో చూద్దాం.

టీమ్‌ చంద్రయాన్‌

1 ఎస్‌.సోమనాథ్‌ (ఇస్రో చైర్మన్‌)

- Advertisement -

చంద్రయాన్‌ 3లో ఉపయోగించిన వ్యోమనౌక మార్క్‌ 3. దీనిని బాహుబలి రాకెట్‌గా అభివర్ణిస్తారు. చంద్రుని కక్ష్యలోకి ల్యాండర్‌ను మోసుకెళ్లిన బాహుబలి రాకెట్‌ను డిజైన్‌ చేసింది ఏరోస్పేస్‌ ఇంజనీర్‌ ఎస్‌.సోమనాథ్‌. ఆయన పేరు సోమనాథ్‌. చంద్రుడిని సోముడు అని కూడా పిలుస్తారు. ఆయన పేరులోనే చంద్రుడి పేరుండటం కాకతాళీయం. చంద్రయాన్‌ 3 ప్రాజెక్టుకు ఆయన బాధ్యత వహించడం విశేషం. ఆయన బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో విద్య అభ్యసించారు. సంస్కృతంలో మాట్లాడగల నేర్పు ఆయన సొంతం. యానమ్‌ అనే శీర్షికతో వచ్చిన చిత్రంలో ఆయన నటించారు కూడా. ఈసారి చంద్రుడి దక్షిణధ్రువంమీద అడుగుపెట్టాల్సిందేనన్న పట్టుదలతో టీమ్‌ను అనుక్షణం ప్రోత్సహిస్తూ వచ్చారు.

2 ఉన్నికృష్ణన్‌ నాయర్‌ ఎస్‌ (డైరక్టర్‌, విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌, తిరువనంతపురం)

భారత అంతరిక్ష పరిశోధనల్లో కీలకమైన రాకెట్‌ వ్యవస్థల అభివృద్ధిలో కీలక వ్యక్తి.. శక్తి. ఏరోస్పేస్‌ ఇంజనీర్‌ అయిన నాయర్‌ భవిష్యత్‌లో భారత వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపాలన్నది ఆయన లక్ష్యం. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ మాజీ విద్యార్థి. హ్యామన్‌ స్పేస్‌ ఫ్లయిట్‌ సెంటర్‌కు ఆయన మొట్టమొదటి డైరక్టర్‌. గగన్‌యాన్‌ కార్యక్రమానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. మార్క్‌ -3 వ్యోమనౌక 100 శాతం విజయవంతం అవడంలో ఆయన నాయకత్వం కీలకం. ఆయన మంచి రచయిత. ప్రత్యేకించి చిన్నచిన్న కథలు రాయడంలో నేర్పరి.

3 వీరముత్తువేల్‌.పి. (ప్రాజెక్ట్‌ డైరక్టర్‌, చంద్రయాన్‌ 3, యూఆర్‌రావు శాటిలైట్‌ సెంటర్‌, బెంగళూరు)

చంద్రయాన్‌ 3 ప్రాజెక్టులో అత్యంత కీలక వ్యక్తి. నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్టులో భాగస్వామి. చంద్రయాన్‌ 2, మంగళయాన్‌ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. చంద్రయాన్‌ 2 (2019) నుంచి లాండర్‌ విక్రమ్‌ చరిత్ర తెలిసిన వ్యక్తి. చంద్రయాన్‌ 3లో ఎటువంటి వైఫల్యాలు తలెత్తకుండా విక్రమ్‌ను మరింత సమర్థంగా తీర్చిదిద్దడంలో కృషి చేశారు. చెన్నయ్‌లో మాస్టర్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ పూర్తి చేసిన ఆయన నాలుగేళ్లుగా మరే అంశాల జోలికి వెళ్లలేదు.

4 కల్పన. కె. (డిప్యూటీ ప్రాజెక్ట్‌ డైరక్టర్‌, చంద్రయాన్‌ 3, యూఆర్‌ రావ్‌ శాటిలైట్‌ సెంటర్‌, బెంగళూరు)

కోవిడ్‌ కఠిన పరిస్థితులనుంచి పోరాడుతూ చంద్రయాన్‌ 3 బృందం నిరంతరం ఆత్మవిశ్వాసంతో పనిచేసేలా చేయడంలో అవిరళ కృషి చేశారు. భారత అంతరిక్ష పరిశోధనల్లో కీలకం. కృత్రిమ ఉపగ్రహాల తయారీలో అందెవేసిన చేయి. ఇంజనీర్‌గా ఆమె తన జీవితాన్ని ఇందుకోసమే అంకితం చేశారు. చంద్రయాన్‌-2, మంగళయాన్‌ మిషన్‌లలో ఆమె భాగస్వామి

5 వనిత ఎం. (డిప్యూటీ డైరక్టర్‌, యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌, బెంగళూరు)

చంద్రయాన్‌ -2 మిషన్‌కు ఆమె డైరక్టర్‌గా వ్యవహరించారు. ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌ ఇంజనీర్‌ అయిన ఆమె లూనార్‌ మిషన్‌కు నాయకత్వం వహించిన తొలి మహిళ. చంద్రయాన్‌ 2లో ఆమె అనుభవం చంద్రయాన్‌ 3కి ఎంతో అక్కరకొచ్చింది. చంద్రయాన్‌ 2లో వైఫల్యాల నేపథ్యంలో పాఠాలు నేర్చుకుని చంద్రయాన్‌ 3ని రూపొందించడంలో ఆమె ఎంతో సహకరించారు. గార్డెనింగ్‌ ఆమెకు ఇష్టమైన వ్యాపకం.

6 ఎం.శంకరన్‌, డైరక్టర్‌, యూఆర్‌ రావ్‌ శాటిలైట్‌ సెంటర్‌, బెంగళూరు

ఇస్రో పవర్‌హౌస్‌గా ఖ్యాతిపొందిన శంకరన్‌ శక్తివంతమైన శాటిలైట్‌ల డిజైన్‌, తయారీలో కీలక వ్యక్తి. వాటిలో పవర్‌ సిస్టమ్స్‌, సౌర విభాగాల డిజైన్‌లలో ఆయన కృషి ఉంది. చంద్రయాన్‌ 1, మంగళ్‌యాన్‌, చంద్రయాన్‌ 2 ఉగ్రహాల తయారీలో ఆయన ఉన్నారు. చంద్రయాన్‌ 3లో ఉపయోగించిన మార్క్‌ 3 వ్యోమనౌక అత్యధిక ఉష్ణోగ్రతలను, అత్యంత శీతల పరిస్థితులను తట్టుకునేలా రూపొందించడంలో కీలకపాత్ర వహించారు. చంద్రుడి ఉపరితలం నమూనాను భూమిపై తయారు చేసి అందులో మార్క్‌ 3కి ఈ విధమైన పరీక్షలు నిర్వహించారు. భౌతికశాస్త్రంలో ఆయన మాస్టర్స్‌ డిగ్రీ చేశారు.

7 వి.నారాయణన్‌, డైరక్టర్‌, లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌, తిరువనంతపురం

క్రయెజనిక్‌ ఇంజిన్స్‌, లిక్విడ్‌ ప్రొపల్షన్‌ ఇంజిన్స్‌ విభాగంలో స్పెషలిస్ట్‌. చంద్రయాన్‌ -3లో కీలకమైన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టింది. ఈ ల్యాండర్‌ నారాయణన్‌ సారథ్యంలోని బృందం రూపొందించింది. ఖరగ్‌పూర్‌ ఐఐటీలో పోస్ట్‌ గ్యాడ్యుయేట్‌. ఇస్రో తయారు చేసిన వ్యోమనౌకలపై ఆయన ముద్ర ఉంది. చంద్రయాన్‌ 3లో వాడిన మార్క్‌ 3 వాహకనౌకపై కూడా.

8 బి.ఎన్‌.రామకృష్ణ, డైరక్టర్‌, ఇస్ట్రాక్‌

చంద్రయాన్‌-3లో ఉపయోగించిన వ్యోమనౌక మార్క్‌ 3 ఒకవిధంగా చంద్రుడి చుట్టూ నాట్యం చేసిందనే చెప్పాలి. రామకృష్ణ సారథ్యంలో ఇస్ట్రాక్‌ అందించిన సందేశాలు ఇందుకు కారణం. దేశంలో అత్యంత పెద్దదైన డిష్‌ యాంటిన్నా ఈ కేంద్రం ప్రత్యేకత. 32 డయామీటర్‌ విస్తీర్ణమున్న ఈ డిష్‌ బెంగళూరు ఆవల ఏర్పాటు చేశారు. విక్రమ్‌ ల్యాండర్‌కు ఇక్కడి నుంచే ఆదేశాలు పంపారు. చంద్రుడిపై ల్యాండర్‌ అడుగుపెట్టడానికి ముందు కీలకమైన ఇరవై నిమిషాలు (ట్వంటీ మినిట్స్‌ టెర్రర్‌) ఇక్కడి నుంచి నియంత్రించారు. ఫ్లయింగ్‌ సాసర్‌ ఆకారంలో ఉండే ఇస్ట్రాక్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఇస్ట్రాక్‌ అంటే మిషన్‌ కంట్రోల్‌ రూమ్‌గా చెప్పుకోవచ్చు. ఇస్రో టెలిమెట్రి, ట్రాకింగ్‌ అండ్‌ కమాంట్‌ నెట్‌వర్క్‌ సెంటర్‌ను ఇస్ట్రాక్‌గా పిలుస్తారు. 3 లక్షల 84 వేల కి.మి దూరంలోని చంద్రుడిపైకి ప్రయాణాన్ని ఈ కేంద్రం మానిటర్‌ చేసింది.

9 ఎస్‌.మోహన్‌ కుమార్‌ మిషన్‌ డైరక్టర్‌, లాంచ్‌ ఆఫ్‌ చంద్రయాన్‌ 3

చంద్రయాన్‌ 3లో భాగంగా జులై 14న చేపట్టిన మార్క్‌ 3 (ఎల్‌ఎమ్‌వి3-ఎం4) రాకెట్‌ ప్రయోగానికి మిషన్‌ డైరక్టర్‌గా వ్యవహరించారు. శ్రీహరికోటలో ఆ ప్రయోగం విజయవంతమైనట్టు ప్రకటించింది ఆయనే. ఇస్రోకు చెందిన విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (తిరువనంతపురం)లో సీనియర్‌ సైంటిస్ట్‌. ఇస్రోకు రాకెట్లు తయారు చేసే కేంద్రం ఇది. అంతకుముందు ఇస్రోలో ఆయన 30 ఏళ్లుగా సేవలందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement