Friday, May 3, 2024

దీక్ష‌, ప‌ట్టుద‌ల‌తో ప‌ని చేస్తేనే పెట్టుబ‌డులు వ‌స్తాయి : మంత్రి కేటీఆర్

దీక్ష‌, ప‌ట్టుద‌ల‌తో ప‌ని చేస్తేనే పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని, అదేవిధంగా ప‌రిశ్ర‌మ‌ల‌కు ఊత‌మిస్తేనే కొలువులు వ‌స్తాయి.. రాష్ట్రానికి సంప‌ద వ‌స్తుంది అని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టించారు. ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేశారు. అనంత‌రం ఏర్పాటు చేసిన స‌భలో మంత్రి ప్ర‌సంగించారు. లిథియం అయాన్ బ్యాట‌రీ మేకింగ్‌లో భార‌త‌దేశంలోనే ఇది అతి పెద్ద పెట్టుబ‌డి అని కేటీఆర్ పేర్కొన్నారు. అమ‌ర‌రాజా గ్రూప్ రూ.9,500 కోట్ల పెట్టుబ‌డిని తీసుకొచ్చినందుకు అమ‌ర రాజా కుటుంబ స‌భ్యుల‌కు అంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఒక ప‌రిశ్ర‌మ రావాలంటే దాని వెనుకాల త‌దేక‌మైన దీక్ష‌తో, ప‌ట్టుద‌ల‌తో ప‌ని చేస్తేనే వ‌స్తాయి. ఇది పోటీ ప్ర‌పంచం. పోటీ ప్ర‌పంచంలో అవినీతి ర‌హిత పార‌ద‌ర్శ‌క‌మైన పాల‌న‌తో ముందుకు వెళ్తున్నాం. ఈ దేశంలో ఎక్క‌డైనా అమ‌ర‌రాజా గ్రూప్ ప్లాంట్ పెట్టుకోవ‌చ్చు. దివిటిప‌ల్లిలో ప్లాంట్ పెడుతామ‌ని ప్ర‌క‌టించిన త‌ర్వాత 8 రాష్ట్రాల సీఎంలు, మంత్రులు వారికి ఫోన్ చేసి త‌మ త‌మ రాష్ట్రాల‌కు రావాల‌ని ఆహ్వానించారు. కానీ అమ‌ర‌రాజా గ్రూప్ వారు ఇక్క‌డే ప్లాంట్ ప్రారంభించేందుకు స‌ముఖ‌త వ్య‌క్తం చేశారు.

రాష్ట్రం ఏర్ప‌డే నాటికి హైద‌రాబాద్ ఐటీ రంగంలో 3ల‌క్ష‌ల 23 వేల మంది ప‌ని చేసేవారు. ఇప్పుడు దాదాపు 10 ల‌క్ష‌ల మంది ప్ర‌త్య‌క్షంగా ప‌ని చేస్తున్నారని కేటీఆర్ వివ‌రించారు. ఒక ఐటీ కంపెనీ ఉంటే దాని చుట్టూ ఎన్నో ఉపాధి అవ‌కాశాలు వ‌స్తాయి. అమ‌రారాజ యూనిట్ రావ‌డం వ‌ల్ల ఇక్క‌డ ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా 10 వేల మందికి ఉపాధి అవ‌కాశాలు వ‌స్తాయి. దీని వ‌ల్ల చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల రూపురేఖ‌లు మారిపోతాయి. పెద్ద ఎత్తున ప‌రిశ్ర‌మ‌లు కూడా వ‌స్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. అమ‌ర‌రాజా గ్రూప్ రాబోయే ప‌దేండ్ల కాలంలో రూ. 9,500 కోట్ల పెట్టుబ‌డి పెట్ట‌బోతుంది. 3 సంవ‌త్స‌రాల్లో రూ. 3 వేల కోట్లు పెట్టుబ‌డి పెట్ట‌నుంది. మిగ‌తా పెట్టుబ‌డి ద‌శ‌ల వారీగా పెట్ట‌నుంది. అమ‌ర‌ర‌రాజా యొక్క 37 ఏండ్ల చ‌రిత్ర పరిశీలిస్తే.. దానికి రెట్టింపు ఈ ఒక్క ప్లాంట్‌లోనే పెట్టుబ‌డి పెడుతున్నారు. అభివృద్ధి నిరోధ‌కులు, ప్ర‌గతి నిరోధ‌కులు ఈ ప్రాంతం బాగు ప‌డొద్ద‌నే ఉద్దేశంతో పుకార్లు సృష్టించి, జ‌రిగే మంచి ప‌నికి విఘాతం క‌లిగించేప్ర‌య‌త్నం చేస్తారని కేటీఆర్ తెలిపారు. బ్యాట‌రీ ప‌రిశ్ర‌మ అని కాలుష్యం వ‌స్తుంద‌ని మాట్లాడుతున్నారు. ఇది లిథియం అయాన్ బ్యాట‌రీ మేకింగ్ కంపెనీ. భ‌విష్య‌త్ అంతా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌దే. రాబోయే 20, 30 ఏండ్ల‌లో పెట్రోల్, డిజీల్ వాహ‌నాల‌ను ప‌క్క‌న పెట్టి.. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను వాడుతారు. ఆ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల్లో వాడే బ్యాట‌రీనే ఇక్క‌డ త‌యార‌వుతుంది. సంప్ర‌దాయ బ్యాట‌రీ వ‌ల్ల కాలుష్యం కొంత క‌లుగుతుంది. జీరో లిక్విడ్ డిశ్చార్జితో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో ఈ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు. లిథియం అయాన్ బ్యాట‌రీల‌తో ఒక్క చుక్క కాలుష్యం కూడా జ‌ర‌గ‌దు. లెడ్ యాసిడ్ బ్యాట‌రీలు త‌యారు చేయ‌ట్లేదు. ఈ పెట్టుబ‌డితో మ‌హ‌బూబ్‌నగ‌ర్ ముఖ‌చిత్రం మారాల‌ని మ‌నస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కేటీఆర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement