Friday, May 3, 2024

వడ్డీ బాదుడు తప్పదు, జూన్‌లో ద్రవ్యపరపతి సమీక్ష.. పెంపు మాత్రం ఖాయం..

దేశ వ్యాప్తంగా రిటైల్‌, టోకు ద్రవ్యోల్బణాలు గరిష్టాలకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వడ్డీ రేట్ల పెంపు కచ్చితంగా ఉంటుందని, రానున్న ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వడ్డీ రేట్ల పెంపు అనివార్యం అని చెప్పుకొచ్చారు.జూన్‌లో ద్రవ్యపరపతి సమీక్ష ఉంటుందని, ఈ భేటీలో.. ఆర్‌బీఐ కొత్త ద్రవ్యోల్బణాలకు సంబంధించిన అంచనాలను కూడా విడుదల చేస్తుందన్నారు. రెపో రేటు కొద్దిగా పెంచాలనే ఆలోచనలో ఆర్‌బీఐ ఉందని తెలిపారు. అయితే ఎంత మేర పెంచొచ్చనే దానిపై స్పష్టత లేదని, ఈ విషయంలో మాత్రం గణాంకాలు వెల్లడించలేనన్నారు. కానీ రెపో రేటు మాత్రం ఆర్‌బీఐ పెంచుతుందని చెప్పగలనని వివరించారు. రెపో రేటు సుమారు 5.15 శాతానికి చేరుకుంటుందని మాత్రం చెప్పలేనన్నారు.

పెరుగుతూ వస్తున్న ద్రవ్యోల్బణం

ద్రవ్య పరపతి సమీక్ష అనుకోకుండా.. మే 2-4 మధ్య ఆర్‌బీఐ నిర్వహించింది. ఈ భేటీలో.. బెంచ్‌మార్క్‌ రేట్లను 40 బీపీఎస్‌ పాయింట్లు పెంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ ప్రకటన వెలువడగానే.. మార్కెట్లు భారీగా పడిపోయాయి. వరుసగా నాలుగు నెలల పాటు ద్రవ్యోల్బణం 6 శాతం కంటే ఎక్కువగా నమోదవుతూ వస్తున్నది. దీంతో ఆర్‌బీఐ రెపో రేటు పెంపు నిర్ణయం అనివార్యమైంది. జూన్‌లో జరిగే ద్రవ్యపరపతి సమీక్షలో వడ్డీ రేట్ల పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంటామని, ఈ భేటీలో కాకపోయినా.. తరువాత సమీక్షలో అయినా.. వడ్డీ రేట్లు పెంచాలనే ఆర్‌బీఐ కోరుకుంటున్నదని చెప్పుకొచ్చారు. దశలవారీగా లిక్విడిటీని తగ్గించడం ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కరెన్సీ మార్కెట్‌లో నెలకొన్న అస్థిరతను నిరోధించేందుకు పని చేస్తుందని శక్తికాంత్‌ దాస్‌ తెలిపారు. డాలర్‌తో పోలిస్తే.. రూపాయి విలువ క్షీణిస్తోందన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల అంశాలే దీనికి కారణమని చెప్పుకొచ్చారు.

కీలక చర్యలకు ప్రణాళికలు

కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ద్రవ్యోల్బణం అదుపు చేసేందుకు కీలక చర్యలు తీసుకుంటుందన్నారు. రాయితీలు ప్రకటిస్తున్నదని వివరించారు. 8 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం చేరుకున్న నేపథ్యంలో మోడీ సర్కార్‌ దిద్దుబాటుకు ఉపక్రమించింది. ఆర్థిక ప్యాకేజీ, రాయితీలో భాగంగా.. పెట్రోల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. దీన్ని ప్రస్తావిస్తూ.. పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఈ చర్యలు తీవ్ర ప్రభావం చూపుతాయని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది కరెంట్‌ అకౌంట్‌ డిఫిక్ట్‌ ను చాలా సౌకర్యవంతంగా నిర్వహించగలుగుతామని ధీమా వ్యక్తం చేశారు. భారతదేశంలో ఎగుమతుల రంగం ఎంతో పటిష్టంగా ఉందని, రికార్డు స్థాయిలో ఎగుమతులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. దిగుమతులను తగ్గించుకుంటున్నామని, ఇది కూడా స్థిరంగానే కొనసాగుతున్నదని తెలిపారు. దిగుమతులు తగ్గించుకోవడంతో దేశీయ డిమాండ్‌ పునరుద్ధరించబడుతున్నదని చెప్పుకొచ్చారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement