Monday, April 29, 2024

ద్రవ్యోల్బణ సెగ.. మళ్లి నష్టాల్లోకి జారుకున్న స్టాక్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి నష్టాలబాట పట్టాయి. గురువారం భారీ నష్టాల్లోకి జారుకున్న సూచీలు, ఆఖరులో కొంతమేరకు పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీన సంకేతాలు, విదేశీ మదుపరుల అమ్మకాల పరంపర నేపథ్యంలో సూచీలు ఏ దశలోనూ బలంగా కనిపించలేదు. కొనుగోళ్ల మద్దతు లభించక ఒక దశలో నిఫ్టీ 170 పాయింట్లు నష్టపోయింది. మరోవైపు వీక్లీ డెరివేటివ్స్‌ ముగింపు రోజు కావడం మార్కెట్లపై ప్రభావం చూపింది. దేశీయంగా ఆగస్టు నెల పారిశ్రామిక ఉత్పత్తి 18 నెలల కనిష్టానికి చేరడం, సెప్టెంబర్‌ రిటైల్‌ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టానికి పెరగడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. సెన్సెక్స్‌ ఉదయం 57,512 పాయింట్ల వద్ద ప్రారంభమై 57,055 వద్ద కనిష్టాన్ని తాకి, చివరకు 390 పాయింట్ల నష్టంతో 57,235 వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ సైతం 17,087 వద్ద మొదలై 109 పాయింట్ల నష్టంతో 17,014 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌30 సూచీల4 హెచ్‌సీఎల్‌ టెక్‌, సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, రిలయన్స్‌, అల్ట్రాటెక్‌, నెస్లే ఇండియా, టీసీఎస్‌ షేర్లు లాభపడ్డాయి. అదే సమయంలో విప్రో, ఎస్‌బిఐ, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, ఎయిర్‌టెల్‌, టైటాన్‌ షేర్లు భారీగా నష్టపోయాయి.

మరో దఫా ఆర్బీఐ 50 బేసిక్‌ పాయింట్లు రెపోరేట్‌ పెంచుతుందన్న భయాల మధ్య బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో రోజంతా నెగెటివ్‌ ట్రేడింగ్‌ కొనసాగింది. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ 0.6 శాతం, స్మాల్‌ క్యాప్‌ 0.4 శాతం నష్టాలతో ముగిశాయి. విప్రో స్టాక్‌ ఇంట్రా డే ట్రేడింగ్‌లో 52 వారాల కనిష్ఠాన్ని తాకి దాదాపు ఏడు శాతం నష్టపోయింది. 2022-23 గైడెన్స్‌ పెంచడంతో హెచ్‌సీఎల్‌ టెక్‌ అత్యధికంగా లాభ పడింది. బీఎస్‌ఈ బ్యాంకెక్స్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, పవర్‌, రియాల్టి ఇండెక్స్‌లు ఒక్కో శాతం నష్టాలతో సరిపెట్టుకున్నాయి. హెల్త్‌కేర్‌, మెడికల్‌ స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈలో 2100కి పైగా స్టాక్స్‌ నష్టాలతో ముగిస్తే 1300 #స్క్రప్ట్‌లు లాభాలతో స్థిర పడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement