Sunday, April 28, 2024

పొగ, పొగాకు ఉత్పత్తుల వినియోగంతో సంతానలేమి సమస్యలు.. గ్రాడ్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ అధ్యయనం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పొగతాగడం, ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగం మూలంగా ఊపిరితిత్తులు పాడవుతాయని, క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉంటుందని మాత్రమే చాలా మందికి తెలుసు. అయితే పొగ, పొగాకు ఉత్పత్తుల వినియోగం మూలంగా క్యాన్సర్‌ ప్రమాదం మాత్రమే కాకుండా సంతాన సాఫల్యత సామర్థ్యం కూడా తగ్గుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగతాగటం మూలంగా పురుషుల్లో వీర్య కణాల ఉత్పత్తి తగ్గుతోందంంటున్నారు. వీర్య కణాల ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని ఫలితంగా సంతాన లేమి సమస్యలు సిగరేట్‌ తాగే మగవారిలో పెరుగుతున్నాయని చెబుతున్నారు. సరదాగా మొదలయ్యే సిగరేట్‌ అలవాటు వ్యసనంగా మారుతున్నా కొద్దీ క్యాన్సర్లు దాడిచేయక మునుపే సంతానలేమి సమస్యలు ఉత్పన్నమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పొగతాగే వారిలో మగవారిలో చాలా మందిలో వీర్య కణాల్లో అనేక లోపాలు ఏర్పడుతున్నాయి. చుట్ట, బీడీ, సిగరేట్‌, పొగాకు ఉత్పత్తి ఏదైనా వాటిలో సుమారు 7వేలకు పైగా రసాయనాలు ఉంటాయి. ప్రమాదకరమైన క్రోమియం, హార్సినిక్‌, లెడ్‌ వంటి లోహాలు కూడా సిగరేట్‌ కాల్చినపుడు శరీరంలోకి చేరి రక్తంలో కలుస్తున్నాయి. ఇవన్నీ రక్తనాళాల్లో కి చేరడంతో చాలా మంది పురుషుల్లో సంతాన సామర్థ్యం తగ్గిపోతోంది. హానికారక పొగాకు ఉత్పత్తుల వినియోగం మూలంగా వీర్యం ఉత్పత్తి తగ్గడంతోపాటు వీర్య కణాల నాణ్యత తగ్గిపోతోంది. ఫలితంగా సంతానసాఫల్యత అవకాశాలు బాగా తగ్గిపోతున్నాయి. పొగతాగే అలవాటు తల్లిదండ్రులకు ఉంటే వారికి పుట్టబోయే బిడ్డల ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడినట్లేనని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. తాజాగా అమెరికాలోని గ్రాడ్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం తల్లిదండ్రుల్లో పొగతాగే అలవాట్లు ఉంటే పిల్లలకు క్యాన్సర్లతోపాటు పలు ప్రమాదకరమైన వ్యాధులు సోకుతాయని తేలింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement