Monday, April 15, 2024

వచ్చేది ఇందిరమ్మ రాజ్యం.. ప్రజా ప్రభుత్వం : భట్టి విక్రమార్క

  • పేదోడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తాం
  • ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాల భర్తీ
  • అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణాలు మాఫీ
  • రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం

తాండూర్, మార్చి 28 ( ప్రభ న్యూస్) : రానున్న 2023-24 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క అన్నారు. భారత్ జూడో యాత్రకు మద్దతుగా ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 13వ రోజు మంగళవారం తాండూరు మండలంలో సాగింది. మంచిర్యాల జిల్లా సరిహద్దు పెగడపల్లి గ్రామం నుంచి మొదలై జాతీయ రహదారి మీదుగా బెల్లంపల్లి వరకు పాదయాత్ర కొనసాగింది. ప్రధాన సమస్యలను రైతులు, మహిళలు, విద్యార్థులు భట్టికి వివరించారు. ఈ సందర్భంగా తాండూరు ఐబీ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సంపాదనను బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటున్నదన్నారు. బీఆర్ఎస్ దశాబ్ద పరిపాలనలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణ లక్ష్యాలు నెరవేరలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటి స్థలాలు, రేషన్ షాపుల్లో 9 రకాల సరుకులు ఇస్తామని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం నిధులను దళిత గిరిజనుల అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు. కౌలు రైతు, విద్యార్హులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రతి ఏటా జాబ్ కేలండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. పరీక్ష పేపర్లు లీక్ కాకుండా అత్యంత సమర్థవంతంగా నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు.

ప్రస్తుతం గ్యాస్ ధర రూ.1300గా ఉందని.. దానిని రూ.500కే ఇస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. భూములు లేని నిరుపేదలకు భూములు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. రుణమాఫీ చేస్తానని మాట తప్పిన కేసీఆర్లా కాకుండా.. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల మాఫీ చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామని, సింగరేణి భూముల్లో ఇల్లు కట్టుకున్న వారికి పట్టాలి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. తాండూరు మండలంలోని మామిడి పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వచ్చేలా చూస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో కొత్తపల్లి లో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల స్థలాలకు ఇప్పటికీ మోక్షం లేదని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఈ 9 ఏళ్లలో రాష్ట్ర బడ్జెట్ రూ.18 లక్షల కోట్లు, తెలంగాణ ప్రజల్ని తాకట్టు పెట్టి తెచ్చిన రూ.5 లక్షల కోట్ల సొమ్ము సర్వనాశనం చేశాడని విమర్శించారు.

కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా చెబుతున్నా.. ఇందిరమ్మ రాజ్యం వచ్చాక సమస్యలన్నీ తీరుస్తామని మరోమారు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు, మండల పార్టీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి జిల్లా కార్యదర్శి సూరం రవీందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గట్టు మురళీధర్, ఐఎన్టియుసి బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షులు పెరం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సుభాష్, మాజీ జెడ్పిటిసి బండి పోశం సింగిల్ విండో వైస్ చైర్మన్ కడారి రత్నాకర్, యూత్ నాయకులు పుట్ట శ్రీనివాస్, భీమ లింగయ్య, ప్రభాకర్, షేక్ హైమద్, మోమిన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement