Friday, May 10, 2024

కాంగ్రెస్‌లోకి వలసల జోరు.. కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ శ్రేణుల్లో కనిపిస్తోన్న ఉత్సాహం

హైెదరాబాద్‌, ఆంధ్రప్రభ : అసెంబ్లి ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉండటంతో.. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు, నేతల చేరికలతో ఆరు నెలల ముందుగానే ఎన్నికల వేడి మొదలవుతోంది. మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మరి కొందరు నాయకులు కారుదిగి హస్తం గూటికి చేరేందకు సిద్ధమైన తరుణంలో.. ఉమ్మడి రంగారెడ్డి, అదిలాబాద్‌, తదితర జిల్లాల నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి వలసల జోరు పెరుగుతోంది. వివిధ పార్టీలకు చెందిన ప్రధాన నాయకులతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు భారీగానే హస్తం గూటికి చేరుకుంటున్నారు.

దీంతో నిత్యం కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో గాంధీభవన్‌ కలకళలాడుతోంది. గత రెండు రోజులుగా టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీలోకి వచ్చే వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. గురువారం అదిలాబాద్‌ నియోజక వర్గం నుంచి ఆ పార్టీకి చెందిన నాయకులు కంది శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరగా .. వారికి టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వీరితో పాటు మహేశ్వరం, షాద్‌నగర్‌ అసెంబ్లి నియోజక వర్గాలకు చెందిన బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు కూడా కాంగ్రెస్‌ గూటికి చేరారు.

- Advertisement -

రెండు రోజుల క్రితం ఉమ్మడి అదిలాబాద్‌లోని నిర్మల్‌ నియోజక వర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు శ్రీహరిరావు, సికింద్రాబాద్‌కు చెందిన ప్రకాశ్‌లు కాంగ్రెస్‌లో చేరి.. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఝలక్‌ ఇచ్చారని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కీలకంగా వ్యవహారించడంతో పాటు నిర్మల్‌ నియోజక వర్గంలో శ్రీహరిరావుకు ప్రజల్లో మంచి పట్టు ఉన్నది. నిర్మల్‌కు చెందిన మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడంతో..అక్కడ శ్రీహరిరావును కాంగ్రెస్‌లో చేర్చుకుని.. ఆ నియోజక వర్గంలో నాయకత్వ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

కాగా, కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందు.. రాష్ట్రంలో అధికార బీఆర్‌ఎస్‌కు భారతీయ జనతా పార్టీనే ప్రత్యామ్నాయమని ప్రచారం జోరుగా సాగింది. దీంతో హస్తం పార్టీకి చెందిన కొందరు ముఖ్య నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు సైతం హస్తానికి హ్యండిచ్చి.. కమలం చెంతకు చేరారు. కానీ, కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత.. ఇప్పుడా పరిస్థితి తారుమారైంది. తిరిగి సొంత గూటికి వచ్చేందుకు కొందరు మాజీ ఎంపీలు, ఇతర నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మహబూబ్‌నరగ్‌ జిల్లాలోని కొల్లాపూర్‌కు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డిలు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ గూటికి చేరేందుదుకు సిద్ధమైన విషయం తెలిసిందే.

అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ.. శనివారం స్వదేశానికి రానున్నారు. 18 లేదా 19న అగ్రనేతతో చర్చించాక ఢిల్లిలోని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సునీల్‌ కనుగోలుతో చర్చలు జరపగా.. ఒకటి రెండు రోజుల్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఠాక్రే, ఇతర నేతలు కలిసి.. వారిని కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement