Friday, May 17, 2024

Hyderabad: బాలికపై లైంగిక దాడి కేసు.. ‘సజ్జనార్​ తరహా’ న్యాయం కావాలని బాధితుల ఆందోళన

దిశా కేసు మాదిరిగానే తమకు సజ్జనార్‌ తరహాలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్​లో ఇవ్వాల (బుధవారం) ఆందోళనకు చేపట్టారు. హైదరాబాద్​ బంజారాహిల్స్​ డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌లో డ్రైవర్​ రజనీకుమార్​ స్కూల్లో చదివే నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన ఇప్పుడు మరింత ఆందోళనకు దారితీస్తోంది. చిన్నారి తండ్రి బుధవారం బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నిరసనకు దిగడంతో స్థానిక ఏబీవీపీ విద్యార్థులు సపోర్టుగా తరలివచ్చారు. ఈ ఘటనలో తనకు, ఇతర తల్లిదండ్రులకు న్యాయం జరగకుంటే.. ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు ముందు నిరాహార దీక్షచేస్తామని వారు తెలిపారు.

ఇక.. 2019లో నలుగురు అనుమానితులను ఆత్మరక్షణ కోసం పోలీసులు ‘ఎన్‌కౌంటర్’ చేసిన దిశా ఘటన కేసును బాలిక తండ్రి ఈ ఆందోళన సందర్భంగా ప్రస్తావించారు. ఎన్‌కౌంటర్‌ జరిగినప్పుడు వీసీ సజ్జనార్‌ సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. తాము కేసులో ఎటువంటి నిర్లక్ష్యాన్ని అంగీకరించబోమని, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు డిమాండ్​ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరాహార దీక్ష చేస్తామని ఖరాకండిగా తేల్చి చెప్పారు. నిరసన జరిగిన కొద్ది గంటలకే బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ ఆధ్వర్యంలో డీఏవీ ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం.

- Advertisement -

కేసు నేపథ్యం ఏంటంటే..

ప్రస్తుత కేసులో బంజారాహిల్స్ లోని పాఠశాల ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ నాలుగేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 364, 376 (ఎ) (బి)లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. రజనీ కుమార్ అనే నిందితుడు పాఠశాలలోని డిజిటల్ క్లాస్‌రూమ్‌లోకి తరచూ వెళ్లేవాడని, అక్కడ చదివే బాలికలను అనుచితంగా తాకడం వంటి వికృత చేష్టలకు పాల్పడేవాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. అంతేకాకుండా వారితో అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆరోపణలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement