Sunday, May 19, 2024

నియామక విధానంలో భారీ మార్పులు.. ఇక సీడీఎస్‌గా లెఫ్టినెంట్‌ జనరల్స్‌.?

న్యూఢిల్లి : త్రివిధ దళాల ప్రధానాధికారి (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌-సీడీఎస్‌) నియామక విధానాల్లో భారీ మార్పులు చేస్తూ రక్షణశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటివరకు త్రివిధ దళాల్లో అత్యున్నత పదవుల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన వ్యక్తికి సీడీఎస్‌గా అవకాశం ఇచ్చారు. కాగా ఇప్పుడు ఆ నిబంధనను సడలిస్తూ నియామక విధానాన్ని విస్తృతం చేశారు. త్రివిధ దళాల్లో లెప్టినెంట్‌ జనరల్‌ లేదా అందుకు సమాన హోదా ఉన్న అధికారులు కూడా సీడీఎస్‌ పదవికి అర్హులని ప్రకటించారు. అంటే త్రివిధ దళాల్లో రెండో అత్యున్నత పదవిలో ఉన్నవారికి సీడీఎస్‌గా అవకాశం ఇస్తారన్నమాట. అయితే, అదే జరిగితే వారికన్నా అత్యున్నత హోదాలో, అంటే చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ, చీఫ్‌ ఆఫ్‌ నేవీ, చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌ఫోర్స్‌ పదవుల్లో ఉన్నవారిని కాదని జూనియర్లకు పెద్దపదవి ఇచ్చినట్టవుతుంది. అలాగే, త్రివిధ దళాల్లో తాజాగా పదవీ విరమణ చేసి, 62 ఏళ్లు పైబడని త్రివిధ దళాల ప్రధానాధికారులు, ఉప ప్రధానాధికారులు కూడా సీడీఎస్‌ పదవికి అర్హులుగానే ప్రకటించింది. భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) గా పనిచేసిన జనరల్‌ బిపిన్‌ రావత్‌ తమిళనాడులో గత డిసెంబర్‌లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి సీడీఎస్‌ పదవి ఖాళీగానే ఉంది. ఆర్మీ చీఫ్‌గా పనిచేసి రిటైరైన రావత్‌ను నరేంద్రమోడీ ప్రభుతం పెద్దపీట వేస్తూ తొలి సీడీఎస్‌గా నియమించిన విషయం తెలిసిందే.

అప్పటికే త్రివిధ దళాల చీఫ్‌లుగా పనిచేస్తున్నవారికంటే వయసులోను, సైన్యం ర్యాంకులలోను ఆయన పెద్దవారు. రక్షణశాఖలో సైన్యానికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తూ మిగతా రక్షణ బలగాలతో సమనయం చేసుకునేలా చూడటం సీడీఎస్‌ ప్రధాన విధి. సైన్యంలో దశాబ్దాలుగా ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. పాత వ్యవస్థలు, ఆయుధాలతోనే నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సైన్యాన్ని ఆధునీకరించి మరింత బలోపేతం చేయడంలో సీడీఎస్‌ కీలకం. వాయుసేన, నౌకాదళంతో సైన్యాన్ని సమన్వయం చేస్తూ శత్రువులపై ఎదురు దాడి చేయగలిగేలా మార్పులు తీసుకురావడం, కొత్త కమాండ్లను ఏర్పాటు చేయడం సీడీఎస్‌ విధుల్లో మరోకటి. తొలి సీడీఎస్‌గా పనిచేసిన రావత్‌ తన కర్తవ్యాన్ని అత్యంత చురుకుగా, సమర్థంగా నిర్వహిస్తున్న సమయంలో హెలికాప్టర్‌ ప్రమాదం బలితీసుకుంది. ఈ ప్రమాదంలో ఆయన సతీమణి, మరో 12మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న సీడీఎస్‌ పదని భర్తీ చేసేందుకు కసరత్తు ప్రారంభించిన కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలను మార్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement