Saturday, December 7, 2024

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భారీ వర్షాలు.. పొంగుతున్న వాగులు, మత్తళ్ళు పడుతున్న చెరువులు

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. జులై మూడు, నాలుగు వారాల్లో కురిసిన భారీ వర్షాల తర్వాత తిరిగి సెప్టెంబర్‌ మొదటివారంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.

వాతావరణ శాఖ ఉమ్మడి జిల్లాలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా, ములుగు, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మంగళవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జులైలో మత్తళ్లు పడిన చెరువులు తిరిగి మరోసారి మత్తళ్లతో పరవళ్లు తొక్కుతున్నాయి.

- Advertisement -

పొంగుతున్న వాగులు, మత్తళ్లు పడుతున్న చెరువులు

మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ములుగు జిల్లాలోని బొగ్గుల వాగు, గుండ్ల వాగు, దయ్యాల వాగు, వట్టేవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాగులకు ఇరువైపులా పంట పొలాలు నీటమునిగాయి. జులై నెలాఖరులో మత్తళ్లు పడిన చెరువులు మరోసారి భారీ వర్షాలతో మత్తళ్లతో పరవళ్లు తొక్కుతున్నాయి. ములుగు జిల్లాలోని గుండ్లవాగు ప్రాజెక్టు, లక్నవరం సరస్సు, రామప్ప సరస్సు మత్తళ్లు పడుతున్నాయి.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని భీంగణపూర్‌ చెరువుతోపాటు గణపసముద్రం చెరువులు మత్తళ్లు పడుతుండగా, మహబూబాబాద్‌ జిల్లాలోని బయ్యారం పెద్దచెరువు మరోసారి మత్తడి పడింది. వరంగల్‌ జిల్లాలోని పాకాల చెరువు, రంగాయి చెరువు, మాధన్నపేట చెరువులు మత్తళ్లు పడ్డాయి. హనుమకొండ జిల్లాలోని కటాక్షపూర్‌ చెరువు మరోసారి మత్తడి పడింది.

లోతట్టు ప్రాంతాల ప్రజల్లో ఆందోళన

అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఉమ్మడి జిల్లాలోని వాగుల ఉధృత ప్రవాహంతో అనేక లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి కకలావికలం కాగా, మంగళవారం నుంచి కురుస్తున్న భారీ వర్షంతో మోరంచ వాగు ఉధృతి పెరిగితే మళ్లిd ఇబ్బందులు పడాల్సివస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని గుండ్లవాగు, దయ్యాలవాగు, వట్టేవాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాగుల ఉధృత ప్రవాహానికి గోవిందరావు పేట, తాడ్వాయి, ఏటూర్‌నాగారం మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జులైలో కురిసిన భారీ వర్షానికి మేడారం సహా అనేక గిరిజన గ్రామాలు నీటమునిగిన విషయం తెలిసిందే.

ఏటూర్‌నాగారం మండలంలోని దొడ్ల, కొండాయి, మల్యాల గ్రామాలు నీట మునగడంతో పాటు ఆరుగురు మృత్యువాతపడ్డారు. మళ్లి వాగుల ఉధృత ప్రవాహంతో ముంపు తప్పదా అని ఆందోళన చెందుతున్నారు. వరంగల్‌ నగరంలోని హనుమకొండ, కాజీపేట, వరంగల్‌ ట్రై సిటీల్లో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్లో కూడా ఆందోళన మొదలయింది.

భద్రకాళీ చెరువు, వడ్డేపల్లి చెరువుల మత్తళ్లు పడుతుండడంతో వరదనీరు పెరుగుతోందని భయపడుతున్నారు. వాతావరణ శాఖ మరోరెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షించుకోవాలని జిల్లా కలెక్టర్లు సూచించారు.

నిలిచిన ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు ఉత్పత్తి

భారీ వర్షాల కారణంగా రెండు రోజుల నుంచి భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలంలోని ఓపెన్‌ కాస్ట్‌ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు. అదేవిధంగా మల్హర్‌ మండలంలోని తాడిచర్ల ఓపెన్‌ కాస్ట్‌లో కూడా భారీ వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిపివేశారు. భారీ వర్షాలతో గనుల్లోకి వర్షపు నీరుచేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement