Sunday, April 28, 2024

Rains | రాగల 48 గంటల్లో కుండపోత.. ఏడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ

అమరావతి, ఆంధ్రప్రభ: వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. దీంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలపై రానున్న 48 గంటల్లో తీవ్ర ప్రభావం చేపనున్నట్లు వాతావరణ కేంద్రం సూచించింది. . గుంటూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కడప, తిరుపతి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. రానున్న రెండురోజులు కుండ పోత వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం లోపు 10 నుంచి 15 సెంమీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.

గత నాలుగు రోజులుగా కురుస్తున్న జోరువానలకు కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్‌, పల్నాడు, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరాల్లోని ప్రధాన రహదారుల్లో వర్షపునీరు మేట వేయడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో కట్లేరు, ఎదుళ్ళ, పడమటి, గుర్రపు, విప్ల, కొండ వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. గంపలగూడెం మండలం వినగడప వద్ద వంతెనపైనుంచి కట్లేరు వాగు ప్రవహిస్తుండటంతో ఆ మార్గంలో రాకపోకలు నిల్చిపోయాుం తిరువూరు, అక్కపాలెం రహదారిలో ఇదే పరిస్థితి నెలకొంది. ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో చెరువు కట్టలు తెగి రోడ్డపైకి నీరు ప్రవహిస్తుండటంతో గ్రామాల మధ్య రాకపోకలు స్తంభిస్తున్నాయి.

- Advertisement -

మంగళవారం రాత్రి 7 గంటల వరకు అనకాపల్లి జిల్లా గొలుగొండలో 102 మి.మీ, విశాఖపట్నం రూరల్‌ లో 77.7 మి.మీ, విజయనగరం జిల్లా పెదనాడిపల్లె, 77 మి.మీ, విశాఖ జిల్లా భీమునిపట్నంలో 75 మి.మీ, అల్లూరి సీతారామరాజు జిల్లా మూలపేటలో 70 మి.మీ, కృష్ణా జిల్లా పెడనలో 59.25 మి.మీ అధిక వర్షపాతం, 60మి.మీ కన్న ఎక్కువ వర్షపాతం 10 ప్రాంతాల్లో నమోదైనట్లు- వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అలాగే శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

పెరగనున్న గోదావరి వరద

ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు ప్రభావంతో గోదావరి వరద బుధవారం నుంచి పెరగనున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. మంగళవారం రాత్రి 7 గంటలకు గోదావరి వరద ప్రవాహం భద్రాచలం వద్ద 39 అడుగులు, ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్‌ ప్లో, ఔట్‌ ప్లnో 6.76 లక్షల క్యూసెక్కులు ఉందని తెలిపారు. వర్షప్రభావంతో వరద ఉధృతి హెచ్చుతగ్గులుగా ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విపత్తుల సంస్థ ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేస్తున్నామన్నారు. అత్యవసర సహాయక చర్యలకోసం 6 బృందాలు బృందాలు ఉన్నట్లు- విపత్తుల సంస్థ ఎండి తెలిపారు. భారీ వర్షాలు నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం కురిసేపుడు వ్యవసాయ పనుల్లోని రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement