Tuesday, May 7, 2024

TS | సాఫీగా ప్రయాణం…. రాష్ట్రవ్యాప్తంగా చివరి దశకు చేరుకున్న రోడ్ల నిర్మాణం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే ప్రక్రియ వేగంగా సాగుతున్నది. మారుమూల పల్లెల నుంచి నగరాల దాకా గతుకుల మయంగా ఉన్న రోడ్లు అద్దాల్లా మెరుస్తున్నాయి. రోడ్లు భవనాల శాఖ పంచాయతీ రాజ్‌ శాఖ సమన్వయంతో అన్ని జిల్లాలలో నిర్మాణంలో ఉన్న రోడ్లను ఈ ఏడాది జూలైలోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో రహదారుల నిర్వహణ, మరమ్మత్తుల కోసం ప్రభుత్వం రూ.2,500 కోట్లను కేటాయించింది. రాష్ట్రంలో 1875 కి.మీ.ల మేర డబుల్‌ లేన్‌ రోడ్ల నిర్మాణం చేపట్టగా వాటిలో ఇప్పటికే 1684 కి.మీ.ల మేర రోడ్లు పూర్తయ్యాయి. అలాగే, 717 వంతెనలు నిర్మాణం దశలో ఉండగా, వాటిలో 350 వంతెనలు పూర్తయ్యాయి.

ఇక ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది వ్యాపార, వాణిజ్య అవసరాల నిమిత్తం వస్తుంటారు. దీని దృష్ట్యా రాజధాని నగరంలో మౌలిక వసతులను మెరుగుపర్చడానికి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆయా జిల్లాల నుంచి డబుల్‌ లేన్‌ రోడ్ల నిర్మాణం చేపట్టింది. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించడానికి ఎస్సార్డీపీ పథకం కింద 42 కీలక రహదారులు, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీల అభివృద్ధిని చేపట్టింది. వీటికి 31 ఇప్పటికే పూర్తి కాగా, మిగతా 11 కూడా దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయి.

- Advertisement -

అలాగే, హైదరాబాద్‌కు వివిధ జిల్లాల నుంచి చేరుకునేందుకు రూ.275 కోట్లతో లింక్‌ రోడ్ల నిర్మాణం కూడా పూర్తయింది. దీంతో ఆయా జిల్లాల నుంచి రాజధాని నగరానికి వచ్చే వాహనదారులకు ప్రయాణ దూరం కలసి రావడంతో పాటు నగరంలో ట్రాఫిక్‌ సమస్యలకు కూడా పరిష్కారం లభించినట్లయింది. దీంతో పాటు వాహనాల రద్దీ తగ్గి కాలుష్యం కూడా నియంత్రణలోకి వచ్చింది. అలాగే, 22 వంతెనల నిర్మాణం చేపట్టగా, 9 పూర్తి కాగా మిగతా వాటి పనులు వేగంగా జరుగుతున్నాయి. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రోజురోజుకూ ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నది. దీనిని దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయానికి సంవత్సరానికి 4 కోట్ల మంది ప్రయాణం చేసినా సరిపడే విధంగా విమానాశ్రయానికి వెళ్లే రోడ్లను అభివృద్ధి చేసే ప్రక్రియను రోడ్లు భవనాల శాఖ చేపట్టింది.

శంషాబాద్‌ విమానాశ్రయానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డు ద్వారా అలాగే, నగరంలోని లింక్‌ రోడ్ల ద్వారా చేరుకోవడానికి రూ.7500 కోట్ల వ్యయంతో రహదారుల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు కూడా ఈ ఏడాది జూలై నెల నాటికి పూర్తవుతాయని రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. అలాగే, తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైల్‌ను శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు విస్తరించనున్నట్లు ప్రకటించిన దృష్ట్యా మెట్రో రైల్‌కు కనెక్టివిటీ కల్పించేందుకు సైతం చుట్టుపక్కల రహదారులను అభివృద్ధి శంషాబాద్‌ విమానాశ్రయానికి రహదారులను అనుసంధానం చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement