Sunday, February 25, 2024

పోలీసుల వేధింపులు ఆపాలి : ఎమ్మెల్యే ఈట‌ల

కరీంనగర్ : హుజూరాబాద్ నియోజకవర్గంలో పోలీసుల వేధింపులు, అక్రమ కేసులకు నిరసనగా హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో చేప‌ట్టిన బీజేపీ ధర్నాలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఆయ‌న‌తోపాటు బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, నియోజకవర్గ బీజేపీ నేతలు కార్యకర్తలు హాజ‌ర‌య్యారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ బీజేపీ అద్యక్షుడు గంగిషెట్టి రాజు ఆధ్వర్యంలో నిరసన దీక్ష, ధర్నా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఈటల రాజేందర్ పూలమాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఈట‌ల రాజేంద‌ర్ మాట్లాడుతూ.. చెల్పూర్ గ్రామ సర్పంచ్ నేరేళ్ళ మహేందర్ గౌడ్, వార్డు మెంబర్ మహ్మద్ ఇబ్రహీమ్ పై అక్రమంగా కేసులు పెట్టిన పోలీసుల చర్యలపై మండిప‌డ్డారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి శారీరకంగా హింసించిన హుజురాబాద్ సీఐ బొల్లం రమేష్ పై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేశారు. పొలీసులు బీఆర్ఎస్ తొత్తులుగా వ్యవహరిస్తూ బీజేపీ నాయకులను, కార్యకర్తల పై అక్రమ కేసులతో పోలీసుల వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో పోలీసుల వేధింపులు ఆపకుంటే గ్రామస్థాయిలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఈటల హెచ్చరించారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ నాయకులతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement