Friday, April 26, 2024

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ కీ విడుదల, అందుబాటులో ఓఎంఆర్‌ షీట్లు.. రేపటి నుంచి అభ్యంతరాలు స్వీకరణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గ్రూప్‌-1 ప్రిలిమినరీ ‘కీ’ని టీఎస్‌పీఎస్‌సీ విడుదల చేసింది. ఈమేరకు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ శనివారం ప్రకటన విడుదల చేసింది. ప్రిలిమినరీ కీతో పాటు అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లను కూడా టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్ష రాసిన అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి తమ ఓఎంఆర్‌ షీట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు కోరారు. టీఎస్‌పీఎస్‌సీ మాస్టర్‌ కీతో అభ్యర్థులు చెక్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. కీ లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 31 నుంచి వచ్చే నెల నవంబర్‌ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు తమ అభ్యంతరాలు తెలపవచ్చని పేర్కొన్నారు. ఓఎంఆర్‌ షీట్లు నవంబర్‌ 29 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయిని అధికారులు తెలిపారు.

మొత్తం 2,85,916 మంది అభ్యర్థుల డిజిటల్‌ ఓఎంఆర్‌ పత్రాలను అందుబాటులో ఉంచారని కమిషన్‌ ఛైర్మన్‌ జనార్థన్‌ రెడ్డి తెలిపారు. టీఎస్‌పీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి డిజిటల్‌ పత్రాలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కేవలం వెబ్‌సైట్‌లోని ప్రత్యేక లింక్‌ ద్వారానే అభ్యంతరాలు నమోదు చేయాల్సి ఉంటుందని, ఈమెయిల్‌, వ్యక్తిగతంగా అభ్యంతరాలు స్వీకరించేది లేదని కమిషన్‌ స్పష్టం చేసింది. గడువు ముగిసిన తర్వాత అభ్యంతరాలు స్వీకరించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే డిసెంబర్‌లో గ్రూప్‌-1 ప్రిలిమినరీ ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement