Monday, April 29, 2024

Good News | 1827 స్టాఫ్‌ నర్స్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌.. ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : డైెరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) పరిధిలోని టీచింగ్‌ ఆసుపత్రుల్లో 1827 స్టాఫ్‌ నర్స్‌ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈమేరకు అనుమతులు ఇస్తూ శుక్రవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మెడికల్‌ హెల్త్‌ అండ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్దతిన భర్తీ చేయనుంది. ఈమేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ రావు మాట్లాడుతూ జిల్లాకు ఓ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలనే సీఎం కేసీఆర్‌ లక్ష్యాన్ని వేగంగా చేరుకుంటున్నామని చెప్పారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు 5 మాత్రమే మెడికల్‌ కాలేజీలు ఉండగా, ఇప్పడు ఆ సంఖ్య 26కు చేరిందన్నారు. వచ్చే ఏడాదిలో మరో 8 మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీంతో పేదలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు చేరువ కావడంతో పాటు తెలంగాణ బిడ్డలకు వైద్య విద్య కూడా చేరువ అవుతుందన్నారు. మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో పాటు అవసరమైన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని సైతం భర్తీ చేస్తున్నామన్నారు. ఇప్పటికే 1061 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి వారిని టీచింగ్‌ ఆసుపత్రుల్లో నియమించుకోగా ప్రస్తుతం 1827 మంది స్టాఫ్‌ నర్స్‌లను భర్తీ చేసుకోబోతున్నామన్నారు. దీంతో ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని చెప్పారు. కాగా, ఇప్పటికే 5204 స్టాఫ్‌ నర్స్‌ నియామక ప్రక్రియను వైద్యారోగ్య శాఖ మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement