Monday, April 29, 2024

Big Story | రైతులకు గుడ్​ న్యూస్​… 26 నుంచి వానాకాలం రైతు బంధు పంపిణీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వానాకాలం సాగు పెట్టుబడి కోసం రైతు బంధును సోమవారం నుంచి పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. రైతుల బ్యాంకు ఖాతాల్లో సోమవారం నుంచి 2023 వానాకాలం రైతుబంధు నిధులు జమ అవుతాయని తెలిపింది. దాదాపు 70లక్షల మంది రైతులకు రైతుబంధు పంపిణీ కానుంది. ఈ సారి 5లక్షల మంది కొత్త రైతులకు రైతు బందు పంపిణీ చేయనున్నారు. అదే సమయంలో దాదాపు లక్షా50వేల మంది పోడు రైతులకు చెందిన సుమారు 4లక్షల ఎకరాలకూ రైతు బంధు పంపిణీ కానుంది. మొత్తం కోటి 54లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం సోమవారం నుంచి ప్రారంభం కానుంది.

ఈ సీజన్‌లో రైతుల ఖాతాల్లో రైతు బంధు కింద రూ.7720.29కోట్లు జమ కానున్నాయి. ఈ సారి గతంలో కన్నా ప్రభుత్వంపై రూ.300కోట్ల అదన పు భారం పడనుంది. ప్రస్తుతం పంపిణీ చేయనున్న 11వ విడత రైతు బంధుతో రైతుల ఖాతాల్లో ఈ పథకం కింద జమ చేసిన మొత్తం రూ.72, 910కోట్లకు చేరనుంది. 10 విడత వరకు రూ.65, 190 కోట్లను రైతులకు పంపిణీ చేశారు. ఈసారి కూడా ఎప్పటి మాదిరిగానే ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ కానున్నాయి.

- Advertisement -

సీఎం కేసీఆర్‌కు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కృతజ్ఞతలు…

వానాకాలం రైతు బంధు పంపిణీ నేపథ్యంలో తెలంగాణ రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈసారి కొత్తగా రైతు బంధు సాయం తీసుకోనున్న రైతులు స్థానిక వ్యవసాయశాఖ అధికారులను బ్యాంకు అకౌంట్‌ వివరాలతో సంప్రదించాలని సూచించారు. దేశంలో ఏడాదికి రెండుసార్లు ఎకరాకు రూ.10వేలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. రైతులపట్ల, వ్యవసాయంపట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధికి రైతుబంధు, రైతు బీమా, 24గంటల ఉచిత కరెంటు, సాగునీటి సరఫరా నిదర్శనమన్నారు.

కాళేశ్వరంతో ఒక్క ఎకరా సాగులోకి రాలేదని విషం కక్కిన విపక్షాలు తమిళనాడు, కర్ణాటక, కేరళలు బియ్యం సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖలు రాశాయని, అది చూసైనా విపక్షాలు కళ్లు తెరవాలని హితవు చెప్పారు. పెండింగ్‌ ప్రాజెకర్టుల పూర్తి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో అందుబాటులోకి వచ్చిన సాగునీటితో సాగు విస్తీర్ణం పెరిగి వరిధాన్యం ఉత్పత్తి గణనీయస్థాయికి చేరుకుందన్నారు. బిచయ్యం సరఫరాపై కేంద్రం చేతులు ఎత్తేస్తే పొరుగు రాస్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని చెప్పారు. తెలంగాణ వ్యవసాయ విధానాలు దేశాన్ని ఆకర్షిస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ అబ్‌కీబార్‌ కిసాన్‌ సర్కారు నినాదం దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పథకాలను కొనసాగిస్తున్నారని చెప్పారు. ఎంత ఖర్చు అయినా సరే రైతు నష్టపోకూడదన్నది కేసీఆర్‌ ఆలోచన అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement