Tuesday, May 7, 2024

డిజిటల్‌ రంగంలో సువర్ణావకాశాలు… పెరుగుతున్న డిమాండ్‌

అమరావతి, ఆంధ్రప్రభ: ఆధునిక కాలంలో డిజిటల్‌ మార్కెటింగ్‌లో కెరీర్‌ మొదలుపెట్టాలనుకునే వారికి ఎన్నో సువర్ణవకాశాలున్నాయి. ఇప్పటి వరకూ జాతీయ స్థాయిలో ఉండే ఆయా సంస్థలు సైతం రాష్ట్రలకు విస్తరించడం, స్థానికంగా ఉన్న అనేక సంస్థలు డిజిటల్‌ రంగంలో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తుండటంతో డిజిటల్‌ రంగంలో ఉద్యోగులకు డిమాండ్‌ విపరీతంగా పెరుగుతోంది. ఈ తరుణంలో ఇటీవల కాలంలో చాలామంది యువత డిజిటల్‌ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. దేశంలో 5-జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో మార్కెట్‌ పరిధి మరింత విస్తృతమయ్యింది.

5-జీ వచ్చిన తరువాత దేశంలో ఇంటర్నెట్‌ కనెక్టివిటీ మరింత మెరుగయ్యింది. దీంతో రాబోయే కాలంలో డిజిటల్‌ మార్కెటింగ్‌ పరిధి మరింతగా విస్తరించనుంది. ఈ క్రమంలో రానున్న కాలంలో డిజిటల్‌ రంగంలో ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా పెరిగే అవకాశాలున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ల వాడకం విపరీతంగా పెరగడం, ఇంటర్నెట్‌ సేవలు విస్తృతంగా వ్యాపించడంతో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆధునిక కాలంలో ప్రతి రంగం సాంకేతికత అనుసంధానంతోనే నడుస్తుంది.

డిజిటల్‌ రంగంలోని ఫొటో, వీడియో విభాగాలలో గ్రాఫిక్‌ డిజైనర్‌, కంటెంట్‌ రైటర్‌, వెబ్‌ డిజైనర్‌ వంటి విభాగాలలో స్థానికంగా ఉన్న కొన్ని సర్వే కంపెనీలలో డిమాండ్‌ బాగా ఉంది. డిజిటల్‌ రంగంలో అనుభవజ్ఞులు తక్కువగా ఉన్న ఈ తరుణంలో డిజిటల్‌ రంగానికి పెరుగుతున్న డిమాండ్‌ దృష్ఠ్యా అనేక సంస్థలు ఆన్‌లైన్‌ ద్వారా డిజిటల్‌ మార్కెటింగ్‌లోని ఆయా విభాగాలలో సర్టిఫికెట్‌ కోర్సులను అందించడానికి పోటీ పడుతున్నాయి. కాలంతో పాటు అప్‌డేట్‌ అవుతున్న వారు డిజిటల్‌ రంగంవైపు అడుగేసి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు.

డిజిటల్‌ మార్కెటింగ్‌ అంటే

- Advertisement -

నిత్యం మన వద్ద ఉండే స్మార్ట్‌ ఫోన్‌లో ఇంటర్‌నెట్‌ను వినియోగిస్తుంటాం. ఫోన్‌లో వాడె యాప్‌లు, వెబ్‌ బ్రౌజర్లు డిజిటల్‌ మార్కెటింగ్‌ కిందకు వస్తాయి. బ్రౌజర్‌లో గూగుల్‌ సెర్‌చ్చలో నిత్యం మనకు కావలసిన సమాచారం కొరకు అన్వేషిస్తుటాం. ఆ సమాచారాన్ని వెబ్‌ పేజీలో పొందుపరచడాన్ని ‘సెర్చ్‌ ఇంజిన్‌ ఆఫ్టిమైజేషన్‌ (ఎస్‌ఈవో)’ అంటారు. యూజర్‌కు సమాచారం సులువుగా అర్దమయ్యే విధంగా పొందుపరచడానికి ‘కంటెంట్‌ రైటర్‌’లు ఉంటారు. వెబ్‌ పేజీలో మనకు కనిపించే యాడ్‌లు, స్క్రోలింగ్‌, కంటెంట్‌లు ఇలా స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌ ఇంటర్‌నెట్‌ బ్రౌజర్‌లోని ప్రతీది డిజిటల్‌ మార్కెటింగ్‌ కిందకు వస్తాయి.

వెబ్‌ బ్రౌజర్‌లో మనకు గూగుల్‌ సెర్చ్‌లో వేలాది వెబ్‌సైట్‌లు దర్శనమిస్తుంటాయి. ఆయా సంస్థలు డిజిటల్‌ మార్కెటింగ్‌ విభాగానికి చెందిన సిబ్బంది ఆధారంగా తమ కార్య కలాపాలను ఇలా ఇంటర్‌నెట్‌ ద్వారా నిర్వహిస్తుంటారు. ఉంటుంది. ఇలా ప్రతి విభాగానికి కోర్సులు చేయాల్సి ఉంది. ఇవి నేరుకోవడానికి ప్రత్యేకంగా కోర్సులు చేయాల్సి ఉంటుంది. కోర్సులు నేర్చుకోవడంతో పాటు, భాషా ప్రావీణ్యం, యూజర్‌ల అభిరుచులకు అనుగుణంగా ఆలోచించగలగడం, కాలానికనుగుణంగా అప్‌డేటెడ్‌గా ఉండటం తదితర లక్షణాలు కలిగి ఉండాలి.

వ్యాపార రంగంలో విస్తృత అవకాశాలు..

జోమాటో, స్విగ్గీ, అమెజాన్‌ వంటి అనేక సంస్థలు ఆన్‌లైన్‌ ద్వారా తమ వ్యాపారాలను ప్రారంభించి ప్రపంచవాప్తంగా దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. దీంతో వారి కార్యకలాపాలను మరింతగా విస్తరించడం ద్వారా అనేక మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. వీరి మార్కెటింగ్‌ కార్యకలాపాలు దేశ విదేశాలలో కొనసాగుతున్నాయి. ఇలాంటి సంస్థలన్నీ తమ వ్యాపారాలను ఆన్‌లైన్‌ బేస్‌గా నడుస్తుండటంతో వీరు పెద్ద సంఖ్యలో డిజిటల్‌ మార్కెటింగ్‌ నిపుణులను నియమించుకుంటున్నారు.

ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థలే కాకుండా ఇటీవల కాలంలో అనేక రంగాలు డిజిటల్‌ విధానాన్ని అవలంబిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియా వంటి యూట్యూబ్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఈ మెయిల్‌, ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటి వాడకం అధికంగా ఉంటుంది. కొన్ని వ్యాపార సంస్థలు ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటి వాటితో టై అప్‌ అయ్యి ఉన్నారు. వీరి వారి యూజర్‌లకు ప్రత్యేక ఆఫర్‌లు ఇస్తూ ఉంటారు. ఈ సంస్థలలో పనిచేసేవారి సంఖ్య అధికంగా ఉండటంతో పాటు వారి జీతభత్యాలూ బారీగానే ఉంటాయి.

ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్‌ కోర్సులు..

డిజిటల్‌ యుగంలో చాలా కంపెనీలు ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. అందుకే ఆధునిక కాలంలో మార్కెటింగ్‌ నిపుణులకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలో వేల సంఖ్యలో డిజిటల్‌ మార్కెటింగ్‌ నిపుణులకు డిమాండ్‌ పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతున్న నేపధ్యంలో దీన్ని గమనించిన కొన్ని సంస్థలు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి.

ఐఐఎమ్‌ అహ్మదాబాద్‌, బెంగుళూరు, లక్నో, ఎన్‌ఐఎఫ్‌టి కలకత్తా, ఐఎస్‌బి హైదరాబాద్‌, ఏఐఎమ్‌ఏ న్యూడిల్లీలో డిజిటల్‌ మార్కెటింగ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూజీ కోర్సు మూడు, పీజీ కోర్సు ఒకటి నుంచి రెండు సంవత్సరాలు చేయాల్సి ఉంది. సర్టిఫికెట్‌ కోర్సు మూడు నుంచి ఆరు నెలల వరకు ఉంటుంది. సర్టిఫికెట్‌ కోర్సు ఎంచుకునే సమయంలో డిజిటల్‌ మార్కెటింగ్‌లో ఉండే విభాగాల గురించి అవగాహన పెంచుకోవాలి.

డిజిటల్‌ మార్కెటింగ్‌లో ఉండే విభాగాలు

వెబ్‌ డిజైనింగ్‌, సోషల్‌ మీడియా, సెర్చ్‌ ఇంజిన్‌ ఆఫ్టిమైజేషన్‌ (ఎస్‌ఈవో), కంటెంట్‌ మార్కెటింగ్‌, లీడ్‌ జనరేషన్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, గ్రాఫిక్‌ డిజైనర్‌, పీపీసీ ఎక్స్‌ఫర్ట్‌, గూగుల్‌ సెర్చ్‌, గూగుల్‌ ప్రకటనలు, ఫేస్‌ బుక్‌ ప్రకటనలు, స్కేల్‌ మార్కెటింగ్‌ తదితర విభాగాలు ఉంటాయి. డిజిటల్‌ రంగంలో ప్రవేశించాలనుకునేవారు వీటిలో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకుని రాణిస్తే వంద శాతం ఉద్యోగ అవకాశాన్ని పొందుతారు. ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన తరువాత డిజిటల్‌ మార్కెటింగ్‌ కు సంబంధించిన సర్టిఫికెట్‌ కోర్సు చేయవచ్చు.

గ్రాడ్యుయేషన్‌ చేస్తూ కూడా ఆన్‌లైన్‌ ద్వారా ఈ కోర్సులను పూర్తి చేయవచ్చు. డిజిటల్‌ మార్కెటింగ్‌లో డిప్లొమా లేదా సర్టిఫికెట్‌ కోర్సు చేయగలిగితే అనేక రంగాలలో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ కోర్సు చేయడానికి అధిక ఫీజులు చెల్లించి కళాశాలల్లో అడ్మిషన్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌ ద్వారా అనేక సంస్థలు సర్టిఫికెట్‌ కోర్సును అందిస్తున్నాయి. ఎంచుకునే విభాగాలను బట్టి నెల నుంచి ఆరు, తొమ్మిది నెలల్లో కోర్సు పూర్తి చేసి సర్టిఫికెట్‌ను అందించడంతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement