Wednesday, May 1, 2024

సమస్యలకు నిలయంగా గాంధీ.. డ్రైనేజీ నీటితో నిండిన‌ సెల్లార్‌.. డైట్‌ క్యాంటిన్‌లో ఎలుకల స్వైరవిహారం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మౌళిక వసతులు, నిర్వహణా లోపంతో తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉంటున్న సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి ఇప్పుడు సమస్యలకు నిలయంగా మారింది. ఆసుపత్రిలో డైట్‌ క్యాంటిన్‌ పరిసరాల్లో డ్రైనేజీ లీకేజీ యథేచ్ఛగా కొనసాగుతున్నా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలందించిన పెద్దాసుపత్రి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి. కొవిడ్‌ వైరస్‌ సోకడంతో ప్రాణాల మీద ఆశలు వదులుకున్న ఎందరికో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఇక్కడి వైద్యులు సేవలందించి బతికించారు. అయితే ఇప్పుడు ఆ పెద్దాసుపత్రిని కష్టాలు చుట్టుముట్టాయి. తెలంగాణకు కరోనా నోడల్‌ ఆసుపత్రిగా నిలిచిన గాంధీలో అడుగడుగునా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం, మౌళిక సదుపాయాల కల్పనపై మంత్రి హరీష్‌రావు ప్రతీ రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను కూడా గాంధీలో పనిచేసే కింది స్థాయి వైద్యులు, వివిధ విభాగాల సిబ్బంది మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. ప్రధానంగా ఆసుపత్రిలోని సెల్లార్‌లో డ్రైనేజీ లీకేజీ చాలా రోజులుగా కొనసాగుతోంది. ఏకంగా లీకైన డ్రేనేజీ నీటితో సెల్లార్‌ మొత్తం నిండిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సెల్లార్‌లోని రూమ్‌లు, డైట్‌ క్యాంటిన్‌, ఎలక్ట్రిషియన్‌, శానిటేషన్‌ సిబ్బంది రెస్ట్‌ రూం, పార్కింగ్‌ తదితర విభాగాలన్నీ డ్రైనేజీ నీటితో నిండిపోయాయి. డ్రైనేజీ నీరు లీకవుతుండటంతో సెల్లార్‌లో ఉన్న విద్యుత్‌ వ్యవస్థ పనితీరు ప్రమాదంలో పడింది. ఎప్పుడు ఎటువంటి విద్యుత్‌ ప్రమాదం చోటుచేసుకుంటోంది తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

సెల్లార్‌లో అస్తవ్యస్తంగా డ్రైనేజీ పైపులు, విద్యుత్‌ వైర్లు, బూజు పట్టి ఉండటం, ఆసుపత్రిలో విరిగిపోయిన చైర్లు, మంచాలు, ఇతర ఉపకరణాల న్నీ సెల్లార్‌లో అస్తవ్యస్తంగా పడి ఉన్నాయని రోగులు వాపోతున్నారు. సెల్లార్‌లో రోగులకు ఫిజియో థెరపీ చేసే విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఆ విభాగానికి వెళ్లే అన్ని మార్గాల్లో డ్రైనేజీ లీకవటంతో రోగులు, సిబ్బంది నానా ఇబ్బందులు ప డుతున్నారు. ఫీజియో థెరపీ విభాగంతోపాటు సెల్లార్‌లోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఆహారాన్ని అందించే డైట్‌ క్యాంటిన్‌ ను నిర్వహిస్తున్నారు. అయితే పలుమార్లు డైట్‌ క్యాంటిన్‌లో లీకేజీలపై ఉన్నతాధికారులపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని అక్కడి సిబ్బంది వాపోతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 1200 రోగులు, 220 మంది వైద్యులకు ఈ డైట్‌ సెంటర్‌లో వండిన ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. డైట్‌ క్యాంటిన్‌లో ఎలుకలు, బొద్దింకలు యథేచ్ఛగా సంచరిస్తుండటంతో గాంధీలోనూ వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి ఘటన తలెత్తే ప్రమాదం ఉందని పలువురు సిబ్బంది, రోగులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు, గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్‌, డీఎంఈ డా. రమేష్‌రెడ్డి ఆసుపత్రిలో సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుండటంతో ఇకనైనా డ్రైనేజీ బాధల నుంచి విముక్తి లభిస్తుందని సిబ్బంది, రోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement