Friday, May 17, 2024

ఉన్నత న్యాయస్థానాల్లో ఖాళీల భర్తీపై దృష్టి.. త్వరలో మరో 50 మంది నియామకం: సీజేఐ ఎన్వీ రమణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : న్యాయవ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా ఇప్పటికే ఉన్న ఖాళీలను భర్తీ చేయడంపై దృష్టిపెట్టినట్టు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని సుప్రీంకోర్టు కాంప్లెక్స్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో జరిగిన సదస్సులో ఆయన ఈ విషయం వెల్లడించారు. మొత్తం 25 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొన్న ఈ సదస్సులో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ పాల్గొన్నారు. ఆరు అంశాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో చర్చించారు. దేశంలోని అన్ని కోర్టు సముదాయాల వద్ద ఐటీ మౌలిక సదుపాయాలను, కనెక్టివిటీని బలోపేతం చేయడం, జిల్లా కోర్టుల్లో మానవ వనరులు, సిబ్బంది, కోర్టు అవసరాలు తీర్చడం, అత్యాధునిక న్యాయపరమైన మౌలిక సదుపాయాలను పెంపొందించడం కోసం యంత్రాంగాన్ని తయారుచేయడం, న్యాయవ్యవస్థలో సంస్థాగత, చట్టపరమైన సంస్కరణలు తీసుకురావడం, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, వారి వేతనాలు, పదవీ విరమణ అనంతరం ప్రయోజనాలను పెంచడంపై చర్చించారు.

సదస్సును ప్రారంభిస్తూ మాట్లాడిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కోవిడ్-19 స‌మ‌యంలోనూ న్యాయవ్యవస్థ నిబద్ధతతో విధులు నిర్వహించిందని అన్నారు. సాధ్యమైనంత మేర న్యాయాన్ని అందించేందుకు కృషి చేశామని చెప్పారు. కొత్తగా ఫాస్టర్ సిస్టం ప్రవేశపెట్టినట్టు సీజేఐ తెలిపారు. న్యాయవ్యవస్థలో సమస్యల పరిష్కారం, సంస్కరణల కోసం ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు సదస్సు నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు. న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నామని తెలిపారు. న్యాయ‌ప‌రిపాల‌నలో ఎదుర‌వుతున్న సమస్యలను పరిష్కరించాల్సి ఉందని, కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీపై దృష్టి సారించామని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఏడాదిలోపే 126 మంది హైకోర్టు న్యాయ‌మూర్తుల ఖాళీలు భ‌ర్తీ చేసినట్టు గుర్తుచేశారు. మ‌రో 50 ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. సుప్రీంకోర్టులో కొత్తగా 9 మంది జడ్జీలను, హైకోర్టుల్లో 10 మంది ప్రధాన న్యాయమూర్తులను నియమించినట్టు తెలిపారు. శుక్రవారం నాటి సదస్సు, శనివారం ప్రధాని సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిపే సదస్సుకు భూమికలా మారుతుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement