Monday, May 6, 2024

Big story | కృష్ణాలోకి వరద నీరు.. పెరుగుతున్న నీటి నిల్వలు

అమరావతి, ఆంధ్రప్రభ : పూర్తిస్థాయిలో అడుగంటిన కృష్ణా ప్రాజెక్టుల్లో ఇపుడిపుడే వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. గత ఏడాది ఇదే సమయంతో పోల్చుకుంటే నీటి నిల్వలు అతి తక్కువగా ఉన్నప్పటికీ గడిచిన రెండు రోజులుగా స్థానికంగా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి కొద్దిపాటి వరద వస్తుండటంతో ప్రాజెక్టుల్లో క్రమేపీ నీటి నిల్వలు పెరుగుతున్నాయి. కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల్లో గత ఏడాది ఇదే సమయానికి 443.9 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఈనెల 25 మంగళవారం సాయంత్రం నాటికి 207 టీఎంసీల నిల్వలున్నాయి. కృష్ణా బేసిన్‌ లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులయిన శ్రీశైలం, సాగర్‌, పులిచింతల, ప్రకాశం బ్యారేజిల్లోకి నీటి ప్రవాహం ఇపుడిపుడే వచ్చి చేరుతోంది.

శ్రీశైలంలో 215.81 టీఎంసీల గరిష్ట నీటి నిల్వ సామర్ద్యానికి గాను 36.88 టీఎంసీల నిల్వలున్నాయి. ఎగువ నుంచి ఇన్‌ ప్లో రూపంలో 9,002 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నాగార్జునసాగర్‌ లో 312.05 టీఎంసీలకు గాను 142.44 టీఎంసీల నిల్వలున్నాయి. ఎగువ నుంచి 4,407 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా దిగువకు 10,647 క్యూసెక్కులను అవుట్‌ ప్లో రూపంలో దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతలలో గరిష్ట నీటి నిల్వ సామర్దం 45.77 టీఎంసీలకు గాను 19.73 టీఎంసీల నిల్వలున్నాయి. 17,330 క్యూసెక్కులు ఇన్‌ ప్లో రూపంలో వరద నీరు వచ్చి చేరుతోంది.

- Advertisement -

కృష్ణా బేసిన్‌కు దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజ్‌ నిండుకుండలా తొణికిసలాడుతోంది. 3.07 టీఎంసీల గరిష్ట సామర్ద్యానికి గాను పూర్తిస్తాయి నీటి ప్రవాహంతో ప్రకాశం బ్యారేజ్‌ జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి 9560 క్యూసెక్కుల ఇన్‌ ప్లో ఉండగా దాదాపు అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుల్లోకి ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహం తగిన విధంగా ఇన్‌ ప్లో, అవుట్‌ ప్లnోలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తుంగభద్రకు భారీగా వరద నీరు చేరుతుండటంతో శ్రీశైలంకు ఎగువ నుంచి ఒక్కసారిగా భారీగా వరద నీరు వచ్చే చేరే అవకాశం ఉందని అంచనా.

తుంగభద్రలో ఇప్పటి సుమారు 25 టీ-ఎంసీల నీటి నిల్వ ఉంది. ఈనెల 23 ఆదివారం ఒక్క రోజే 5 టీఎంసీల వరద వచ్చి చేరింది. మరో వారం రోజులు తుంగభద్రలో ఇదే ప్రవాహం కొనసాగితే కర్ణాటక, తెలంగాణతో పాటు ఏపీలో సాగు, తాగునీటి అవసరాలు పూర్తిగా తీరే అవకాశం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి శ్రీశైలంకు వచ్చిన నీటిని దిగువకు విడుదల చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement