Sunday, May 5, 2024

Delhi | 15న కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా.. వెల్లడించిన స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం (నేడు) 58 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేయనున్న ఆ పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కే. మురళీధరన్ వెల్లడించారు. శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ అభ్యర్థుల ఎంపిక, అధిష్టానం పెద్దల ప్రచార కార్యక్రమాల తేదీలపై రోజంతా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.

కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉదయం గం. 11.30కు మొదలైన ఈ సమావేశం రాత్రి గం. 7.00 వరకు సాగింది.

- Advertisement -

భేటీ అనంతరం బయటకొచ్చిన మురళీధరన్ మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు తెలంగాణ అభ్యర్థుల జాబితాను ఆదివారం ప్రకటిస్తామని వెల్లడించారు. మరో రెండ్రోజుల్లో మిగతా స్థానాల అభ్యర్థులపై కసరత్తు పూర్తి చేస్తామని చెప్పారు. గెలుపు అవకాశాలు, పార్టీ విధేయత వంటి అంశాలే ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని తెలిపారు.

పొన్నాల లక్ష్మయ్య పార్టీని వీడడం గురించి ప్రశ్నించగా.. పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్లడం తమ అంతర్గత విషయమంటూ మాట దాటేశారు. అంతకు ముందు రోజు ‘పోతే పోనీ.. పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అన్న రీతిలో చెప్పిన మురళీధరన్ ఆదివారం స్వరం తగ్గించారు. అన్ని సామాజిక వర్గాలకు సీట్ల కేటాయింపు ఉంటుందని, మరోవైపు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు సీపీఐ, సీపీఐ(ఎం)తో పొత్తులపై చర్చలు తుది దశలో ఉన్నాయని మురళీధరన్ తెలిపారు. ఆదివారం ఈ విషయంపై కూడా స్పష్టత వస్తుందని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement