Monday, April 29, 2024

ఫిఫా మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌.. సెమీస్‌లో స్పెయిన్‌, స్వీడన్‌

ఫిఫా మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో స్పెయిన్‌, స్వీడన్‌ జట్లు సెమీస్‌లో ప్రవేశించాయి. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో స్పెయిన్‌ 2-1తో నెదర్లాండ్స్‌పై విజయం సాధించగా.. మరో క్వార్టర్‌ పోరులో స్వీడన్‌ 2-1తో జపాన్‌ను ఓడించింది. నెదర్లాండ్స్‌- స్పెయిన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ హోరాహోరీగా సాగింది. తొలి అర్ధ భాగంలో ఇరుజట్లు గోల్స్‌ కోసం తీవ్రంగా శ్రమించినా లాభంలేకుండా పోయింది.

తర్వాత రెండో క్వార్టర్స్‌లో మాత్రం స్పెయిన్‌ దూకుడు పెంచి స్పెయిన్‌ గోల్‌ పోస్ట్‌పై వరుస దాడులను ప్రారంభించింది. ఇదే క్రమంలో 81వ నిమిషంలో స్పెయిన్‌కు లభించిన పెనాల్టి కార్నర్‌ను మారియోనా గోల్‌గా మార్చింది. దీంతో స్పెయిన్‌ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత మరో పది నిమిషాల వ్యవధిలో నెదర్లాండ్స్‌ డిఫెండర్‌ స్టెఫెనీ వాన్‌ డర్‌ గ్రాగ్ట్‌ తమ జట్టు తరఫున తొలి గోల్‌ సాధించడంతో ఇరు జట్ల స్కోరు 1-1తో సమమైంది.

అనంతరం మ్యాచ్‌ ఫలితం కోసం ఎక్సట్రా టైమ్‌ ఇవ్వడం జరిగింది. ఎక్స్‌ట్రా టైమ్‌లో ఇరుజట్లు మరోగోల్‌ కోసం తీవ్రంగా శ్రమించాయి. అయితే 111వ నిమిషంలో స్పెయిన్‌ టీనెజర్‌ సల్మా సెలలెస్టే అయింగొనొ కళ్లు చెదిరే గోల్‌తో తమ జట్టుకు కీలకమైన విజయాన్ని అందించింది. దీంతో స్పెయిన్‌ 2-1 గోల్స్‌తో సెమీస్‌లో అడుగుపెట్టింది.

జపాన్‌ ఓటమి..

స్వీడన్‌తో జరిగిన మరో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో జపాన్‌ 1-2 గోల్స్‌ తేడాతో ఓటమితో ఇంటి బాట పట్టింది. ప్రపంచకప్‌ గెలువాలనుకున్న జపాన్‌ ఆశలు ఆవిరయ్యాయి. శుక్రవారం ఇక్కడ జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో స్వీడన్‌ జట్టు ఆది నుంచే దూకుడుగా ఆడుతూ జపాన్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

- Advertisement -

ఈ క్రమంలోనే స్వీడన్‌ 32వ నిమిషంలోనే తొలి గోల్‌ సాధించింది. స్వీడన్‌ తరఫున అమాండ లెస్టెడ్ట్‌ ఈ గోల్‌ సాధించింది. తర్వాత రెండో హాఫ్‌లో ఫ్లిప్పా అంజెల్డల్‌ పెనాల్టి కార్నర్‌ను అద్భుతమైన గోల్‌ మార్చి తమ జట్టుకు రెండో గోల్‌ అందించింది. దీంతో స్వీడన్‌ తమ ఆధిక్యాన్ని 2-0కు పెంచుకుంది. ఇక చివర్లో పుంజుకున్న జపాన్‌ 87వ నిమిషంలో తొలి గోల్‌ సాధించింది.

జపాన్‌ తరఫున హొనొకా హయాషి ఈ గోల్‌ను సాధించి స్వీడన్‌ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది. తర్వాత జపాన్‌ మరో గోల్‌ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా.. స్వీడన్‌ డిఫెన్స్‌ విభాగం వారి దాడులను సమర్థంగా అడ్డుకుంది. దీంతో మ్యాచ్‌ పూర్తి సమయం ముగియడంతో స్వీడన్‌ గెలుపుతో సెమీస్‌లో అడుగుపెట్టింది.

క్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అమెరికాను చిత్తు చేసిన స్వీడన్‌ ప్రస్తుతం ప్రపంచ టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. ఇక ఆగస్టు 15 జరిగే తొలి సెమీస్‌లో స్పెయిన్‌-స్వీడన్‌ జట్లు ఢీ కొననున్నాయి. శనివారం జరిగే ఇతర క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచుల్లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌తో కొలంబియా జట్టు తలపడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement