Monday, April 29, 2024

ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే నియమించాలి : ఆమ్ ఆద్మీ నేత సోమ‌నాథ్..

తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సోమనాథ్ భారతి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆప్ తెలంగాణ యూనిట్ గురువారం ఏర్పాటు చేసిన వర్చువల్ ప్రెస్ మీట్‌లో ఢిల్లీ నుంచి పాల్గొన్న ఆయన, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో కుటుంబ సమేతంగా రోడ్డున పడ్డ 7,651 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్య పరిష్కారమయ్యేంత వరకు వారికి అండగా ఉంటామని అన్నారు. 2019 జూలైలో, ఫీల్డ్ అసిస్టెంట్ల కాంట్రాక్టులను పొడిగించకూడదని కేసీఆర్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసిందని, ఇందుకు నిరసనగా సమ్మెకు దిగారన్న కారణంతో వారిని తొలగించారని గుర్తుచేశారు. 2006 నుంచి పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు కుటుంబ సమేతంగా రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని అన్నారు.

ఉద్యోగాలు రావని మనస్థాపంతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అభివృద్ధి ఫలాలు, పదవులు కేసీఆర్ కుటుంబానికే దక్కాయని ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించాలని హైకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు, ఉపాధి హామీ నిధులను ఇతర పథకాలకు మళ్లించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జోక్యం చేసుకున్న తర్వాతే ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కొంత సానుకూలంగా స్పందిస్తున్నారని చెప్పారు. తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, చనిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సోమనాథ్ భారతి డిమాండ్ చేశారు. ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న 1 కోటి పరిహారం పథకం ప్రకారం, కేసీఆర్‌ ప్రభుత్వ అమానవీయ చర్య కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఫీల్డ్‌ అసిస్టెంట్ల కుటుంబాలకు 1 కోటి చొప్పున కేసీఆర్‌ ప్రభుత్వం అందజేయాలని డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు న్యాయం జరిగేవరకు ఆప్ పోరాడుతుందని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలంగాణ రాష్ట్ర ఆప్ నేత ఇందిరా శోభన్ హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement