Sunday, April 28, 2024

Delhi | ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ నవంబర్ 9కి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం ఈ కేసు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం ముందు విచారణకు రాగా.. చంద్రబాబుపై మొత్తం 3 ఎఫ్.ఐ.ఆర్ లు నమోదయ్యాయని, వాటిలో ఒక కేసుపై సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వులో ఉందని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా తెలిపారు.

ఈ సమయంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. ఆ తీర్పు వెలువరించే వరకు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేయాలా అంటూ ప్రశ్నించారు. అప్పటి వరకు ఆయన్ను అరెస్టు చేయకుండా కేవలం నోటిమాటగా సీఐడీ హామీ ఇచ్చిందని, అది కొనసాగించాలని లూత్రా కోరారు. విచారణ వాయిదా వేసేందుకు ఇరుపక్షాల న్యాయవాదులు అందుకు అంగీకారం తెలిపారు.

తాము దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లోనే ఈ విషయాన్ని ప్రస్తావించామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వెల్లడించారు. దసరా సెలవుల అనంతరం నవంబర్ 8కి విచారణ వాయిదా వేస్తున్నట్టుగా ధర్మాసనం తొలుత తెలిపింది. నవంబర్ 9కి వాయిదా వేయాల్సిందిగా సిద్ధార్థ్ లూత్రా ధర్మాసనాన్ని కోరారు. దాంతో ధర్మాసనం కేసు తదుపరి విచారణ నవంబర్ 9కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement