Friday, May 3, 2024

భయం భయంగా గ్రేటర్​ ప్రజలు.. వీడని వానలతో భారీ ముప్పు తప్పదా?

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ : మహానగర వాసుల్లో మళ్లి వణుకు పుడుతోంది. దాదాపు 5 సెం.మీ వర్షపాతానికే అతలాకుతలమయ్యే రోడ్లు.. భారీ వర్షాలతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన రోజులొచ్చాయి. గత 2020, 2021లో కురిసిన వర్షాలతో తీవ్ర అవస్థలు ఎదుర్కొన్న నగరవాసులు మళ్లి పాత రోజులను తల్చుకుంటేనే భయంతో గజగజ వణికిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళితే, తిరిగి క్షేమంగా చేరుకుంటామో.? లేదో.? అనే పరిస్థితులు నగరంలో తలపిస్తున్నాయి. మహానగర పరిధిలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పాత పరిస్థితులను పునరావృతం చేస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న తరుణంలో భారీనుంచి అతి భారీవర్షాలు పడనున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంతో పాటు రెడ్‌ అలెర్ట్‌ను జారీ చేయడం గమనార్హం. 2020 సంవత్సరంలో అక్టోబర్‌ నెలలో కురిసిన భారీ వర్షాలతో పాత రికార్డులన్నీ బ్రేక్‌ అయిన సంగతి తెలిసిందే. గత వందేళ్లలో అంటే 1903లోచివరిసారి భారీస్థాయిలో వర్షం పడినట్టు వాతావరణ శాఖ అధికారులు గతంలోనే వెల్లడించిన విషయం విధితమే. దీంతో నగరంలో వర్షం పడితే ఎలా అంటూ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు చాలా చెరువులను ఆక్రమించి అక్రమ కట్టడాలు చేపట్టడంతో భారీవర్షాలు కురిసిన ప్రతి సంవత్సరం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు చెరువుల పటిష్టతకు నియమించిన కమిటీ చెరువుల పరిస్థితిపై నివేదిక రూపొందించినా క్షేత్రస్థాయిలో పనులు పట్టాలెక్కడం లేదు.

మురుగు నిర్వహణ అంతంతే.!

గతంలో కురిసిన కుండపోత వర్షాలతో వాటర్‌ బోర్డు మురుగు నిర్వహణ విషయంలో కనబరుస్తున్న చిత్తశుద్ధి బయట పడిన సంగతి తెలిసిందే. గ్రేటర్‌ పరిధిలో నాలాలు, మ్యాన్‌హోల్స్‌ ఉప్పొంగి ప్రవహించి ప్రధాన రోడ్లపైకి వస్తున్న పరిస్థితులకు నేటికీ చెక్‌ పడటం లేదనే విమర్శలున్నాయి. కాంక్రీట్‌ జంగల్‌ను తలపిస్తున్న రోడ్లు ఒకవైపు, కురిసిన వర్షం భూమిలోకి ఇంకే విధంగా చేయకపోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు చందంగా తయరైంది నగరం పరిస్థితి. నగరంలో మురుగునీటిని శుద్ధి చేసే ఎస్టీపీలు లేకపోవడంతో పాటు, మరోవైపు కొత్త ఎస్టీపీల నిర్మాణాలు చేపట్టినా అమల్లోకి రాకపోవడంతో సమస్యలు పునరావృతం కానున్నాయనే ప్రచారం నెలకొంది. ప్రస్తుతం 18చోట్ల ఉన్న 172 ఎంఎల్‌డీ మురుగునీటిని శుద్ధిచేసే సామర్థ్యం ఉన్న ఎస్టీపీలు ఉండటంతో ప్రస్తుతం అవటర్‌ వరకు మురుగునిర్వహణ బాధ్యతను బోర్డు చూస్తున్న వేల ఎం.ఎల్‌.డి మురుగునీటి ప్రతినిత్యం ప్రధాన రోడ్లపైకీ వస్తుండటంతో సమస్యలు ఉత్పన్నం అవుతుండటం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement