Sunday, May 19, 2024

ఐఏఎస్ను, ఉద్యోగాలు ఇప్పిస్తా!

అందరినీ  నమ్మించేలా సూటూ బూటూ.. వాహనానికి ఆన్‌ గవర్నమెంట్‌ డ్యూటీ బోర్డు.. పోలీస్‌ సైరన్‌… ఇవన్నీ తాను ఐఏఎస్‌ అధికారిని అని నమ్మించి, అమాయకులను మోసగించడానికి తెచ్చిపెట్టుకొన్న ఆర్భాటాలు. తాను మంచిర్యాల జాయింట్‌ కలెక్టర్‌(జేసీ)నని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలకడంతో 29 మంది అతడి వలకు చిక్కారు. వారిలో ఇద్దరు మోసాన్ని గ్రహించి పోలీసులను ఆశ్రయించడంతో అతడి నయవంచన బహిర్గతమైంది. ఐఏఎస్​ అధికారిని అని చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని మంచిర్యాల పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి శనివారం ఆ వివరాలను వెల్లడించారు.

జగిత్యాల జిల్లా బీర్పూర్‌ మండలం రేకులపల్లికి చెందిన బర్ల లక్ష్మీనారాయణ హైదరాబాద్‌లో బీటెక్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. 2019లో రైల్వేశాఖ జేఈ ఉద్యోగాలకు నిర్వహించిన పోటీ పరీక్షకు హాజరయ్యాడు. ఆ ఉద్యోగం రాకపోయినా వచ్చినట్లు కుటుంబసభ్యులు, గ్రామస్థులను నమ్మించాడు. గ్రామస్థులు సన్మానాలు కూడా చేశారు. లాక్‌ డౌన్‌ సమయంలో గ్రామంలోనే ఉన్న లక్ష్మీనారాయణ తాను ఏది చెప్పినా ప్రజలు నమ్మేస్తారన్న ఆలోచనతో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసానికి తెర లేపాడు. హైదరాబాద్‌ లో బీటెక్‌ చదువుతూ ప్రైవేటుగా ఓ బ్యాంకులో పనిచేస్తున్న క్రమంలో బీర్పూర్‌ కు చెందిన కారు డ్రైవర్‌ రమేష్‌తో పరిచయం పెంచుకున్నాడు. మంచిర్యాల జేసీగా ఎంపికయ్యానని రమేష్‌ను నమ్మించి అతడిని కారు డ్రైవర్‌గా నియమించుకున్నాడు. దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామానికి చెందిన మహేందర్‌ను పీఏగా పెట్టుకున్నాడు. మోసం బయటపడకుండా.. తాను ఎక్కడికెళ్లినా కారును దూరంగా పార్క్‌ చేయించి డ్రైవర్‌ను అక్కడే ఉండమనేవాడు.

జేసీ అయిన తనకు 30 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే వీలు ఉందని.. ఒక్కో ఉద్యోగానికి రూ.3 లక్షల నుంచి రూ.5లక్షలు ఖర్చు అవుతాయని వారికి తెలిపాడు. దీంతో వారు తమ బంధువులకు చెప్పడంతో మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్‌జిల్లాలకు చెందిన 29 మంది సుమారు రూ.80 లక్షలు లక్ష్మీనారాయణకు అప్పజెప్పారు. ఈ డబ్బుతో నిందితుడు జగిత్యాలలో ఇల్లు, రెండు కార్లు, ద్విచక్రవాహనం కొన్నాడు. ఉద్యోగాల కోసం డబ్బులు ఇచ్చి తాము మోసపోయినట్లు గ్రహించిన బాధితులు శ్వేత, రమేష్‌ ఈనెల 12న మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో లక్ష్మీనారాయణ మోసాలు వెలుగు చూశాయని డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. నిందితుడి నుంచి రూ.2లక్షల నగదు, రెండు కార్లు, ద్విచక్రవాహనం, సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement