Sunday, May 5, 2024

Fake Baba: కీచక బాబా బాగోతం బట్టబయలు..!

  • నగర శివారులో దర్జాగా దందా
  • రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ టీం
  • నమ్మించి లోబర్చుకొన్న కామాంధుడు
  • వివాహితపై కన్నేసి దొరికిపోయిన ప్రబుద్ధుడు
  • తమిళనాడు నుండి వచ్చి వరంగల్ లో సెటిల్
  • 40 ఏళ్లుగా మోసాలు, దందాలే

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్) : బతుకుదెరువు కోసం 40 ఏళ్ళ క్రితం వరంగల్ కు వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యాడు. నగర శివారులోని ఏనుమాములలో మకాం ఏర్పరుచుకొని, తనకు తానే మాయలు, మంత్రాలు వచ్చే బాబాగా పరిచయం చేసుకొన్నాడు. క్రమంగా ప్రాచుర్యం పొందాడు. మధ్య వయస్సులో ఉన్న నకిలీ బాబాకు కామ వాంఛ పెరిగిపోయింది. ఎన్నో సమస్యలు, మరెన్నో ఇబ్బందులు, ఇంకొన్నొ కష్టాలతో వచ్చే అమాయక మహిళల బలహీనతలను గుర్తించి, నెమ్మదిగా తనదైన శైలిలో ఒంటరిగా అర్ధరాత్రి వేళల్లో పూజలు చేస్తే దేవుడు కరుణిస్తాడు. మీ కష్టాలు, ఇబ్బందులన్నీ తీరిపోతాయని నమ్మించే వాడు. తాము ఉన్న స్థితిగతులు మారిపోతాయన్న ఆశతో దొంగ బాబా ఎత్తులు, జిత్తులు తెలియని మహిళలు ట్రాప్ లో పడే వారు. వారితో పూజలు చేయించే పేరుతో అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తించే వాడు. ఎవరైనా ఎదురు తిరిగితే సైతాన్ పట్టింది.. వదిలించే ప్రయత్నం చేస్తున్నానంటూ మరింతగా చెలరేగి పోయేవాడు. బాబా చెప్పిన్నట్టు వినకపోతే ఫలితం ఉండదని ముందస్తుగానే చెప్పి, తన లైన్ ను క్లియర్ చేసుకొనే వాడు. ఇలా తన వద్దకు వచ్చిన అనేక మంది మహిళలు, యువతులతో తన కామ వాంఛలను తీర్చుకున్నాడు.

ఏనుమాముల బాబా బాగోతం బట్టబయలు :
వరంగల్ నగర శివారులోని ఏనుమాములలో దొంగ బాబా ముసుగులో నేరాలు, ఘోరాలు చేస్తున్నట్టుగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ దృష్టికి వచ్చింది. అంతే నకిలీ బాబా బాగోటం కన్నేసి, నిజానిజాలు నిగ్గు తేల్చాలని వరంగల్ టాస్క్ ఫోర్స్ టీంను ఆదేశించారు. రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు దొంగ బాబా బాగోతంపై నిఘా వేశారు. పక్కా ప్లాన్ తో టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఏనుమముల ప్రాంతం లోని కీచక బాబా ఇంటిపై మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో కీచక బాబాగా పేరుగాంచిన షైక్నాలా లబ్బే బాగోతాన్ని బట్టబయలు చేశారు. దీనికి సంబందించిన వివరాలను వరంగల్ టాస్క్ ఫోర్స్ ఏసిపి డాక్టర్ ఎం.జితేందర్ రెడ్డి పత్రికలకు విడుదల చేశారు. వరంగల్ జిల్లా ఏనుమామూల ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కీచక బాబాగా అవతారమెత్తాడు.. తన మంత్రశక్తులతో కుటుంబంలో ఉన్న కలతలు, కలహాలు, భార్య భర్తల మధ్య‌ ఉన్న తగాదాలు, దాంపత్య, ఆరోగ్య సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు, నర దిష్టి, ఇలా ఏమి ఉన్న వాటిని పరిష్కరిస్తానని నమ్మించి పలువురు మహిళలు, యువతులను ట్రాప్ చేసి లోబరుచుకున్నాడు.

- Advertisement -

మాయమాటలు చెప్పి వినక పోతే భయబ్రాంతులకు గురిచేయడం, అయిన తన దారి లోనికి రాని వారిపై మాయలు, మంత్రాలు చేసి ముప్పుతిప్పలు పెడతానని చెబుతూ తన కామకోరికలు తీర్చుకునేవాడు. ఇలాగే తన వద్దకు వచ్చిన మరో వివాహితపై దొంగబాబా కన్నేశాడు. ఆమెకు తన భర్తతో ఉన్న విబేదాలను అవకాశంగా తీసుకొని, తనదైన శైలిలో ట్రాప్ చేయాలని విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ తన పథకం ఫలించక పోవడంతో, నైట్ పూజలు చేస్తునట్టు నటించి, ఆమెపై ముందు రచించుకొన్న ప్లాన్ ప్రకారం అత్యాచారం చేశాడు. భయపడిపోయిన సదరు వివాహిత జరిగిన ఘోరాన్ని వాస్తవ విషయాలను ఇంట్లో వారికి చెప్పి బోరుమంది. బాధితురాలును వెంటబెట్టుకుని కుటుంబ సభ్యులు టాస్క్ ఫోర్స్ పోలీసులను ఆశ్రయించారు. దాంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి బాధితురాలైన వివాహిత ద్వారా కీచకబాబా సాగిస్తున్న చీకటి యవ్వారంను బయటపెట్టారు. సీన్ లొనే ఉన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు కీచక బాబాను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించారు. ఇప్పటి వరకు తాను చేసిన చీకటి బాగోతం చిట్టాను విప్పాడు. తమిళనాడు చెందిన తాను 40 ఏళ్ళ క్రితం వరంగల్ కు వచ్చి స్థిరపడ్డట్టు చెప్పుకొచ్చాడు. తన పేరు షైక్నాలా లబ్బే (58) చెప్పాడు. ఏనుమామూల గ్రామ పంచాయతీ దగ్గర ఉంటూ అమాయక ప్రజలకు ఎర్ర ధారాలు, నల్ల ధారాలు, మంత్రంతో కూడిన తాయత్తులు, నిమ్మకాయలు, దిష్టి గురుగులు, వన ములికలు, నూనె డబ్బలు ఇస్తూ మోసం చేస్తున్నాడు. అతని వద్ద నుండి 25 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం ఏనుమామూల పోలీసులకు నిందితుడుని, సామగ్రిని అప్పగించారు.

టాస్క్ ఫోర్స్ టీం వర్క్ కు అభినందనలు :
దొంగ బాబా చీకటి బాగోతాన్ని చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్లు కొమ్మూరి శ్రీనివాస్ రావు, జనార్థన్ రెడ్డి, ఎస్.ఐలు శరత్ కుమార్, లవన్ కుమార్, టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ స్వర్ణలత, కానిస్టేబుళ్ళు రాజేందర్, కరుణాకర్, శ్రావణ్ కుమార్, నాగరాజులను పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ అభినందించారు.

అప్రమత్తంగా ఉండండి : సిపి రంగనాథ్
ఇటీవల కాలంలో దొంగ బాబాలు పుట్టగొడుగుల్ల పుట్టుకొస్తున్నారు. ప్రజల నమ్మకాలను, విశ్వాసాలను అవకాశంగా మల్చుకొని సొమ్ము చేసుకుంతున్నారు. గల్లీకో నకిలీ బాబా తయారవుతున్నాడు. ఈజీ మనీ కోసం ప్రజలను మాయ మాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. అమాయకత్వంనే అవకాశంగా చేసుకొని ఈ దొంగ బాబాలు దందాలు సాగిస్తున్నారు. ఫేక్ బాబాల ఘటనలు ఎన్నెన్నో వెలుగు చూసిన, జనాలు మాత్రం ఎవరినో ఒకరిని నమ్మి మోసపోతూనే ఉన్నారు. ప్రజలకు తెలియకుండానే ట్రాప్ లో పడి మోసపోవటం నిత్యకృత్యమైంది. దేవుడిపై ఉన్న భక్తి, నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని అమాయక ప్రజల్ని దొంగ బాబాలు టార్గెట్ చేస్తూ సులభంగా బురిడీ కొట్టిస్తున్నారు. ఏనుమాముల జరిగిన కీచక బాబా బాగోతంతోనైన ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమీషనర్ ఏవి రంగనాథ్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement