Saturday, December 7, 2024

Breaking: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఐదుగురు మృతి.. పలువురికి గాయాలు

మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లా సమీపంలోని మగర్ధ రోడ్డులో ఉన్న ఓ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఐదుగురు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఫ్యాక్టరీలో బాణసంచా తయారీకి ఉంచిన గన్‌పౌడర్‌కు మంటలు అంటుకోవడంతో కొద్దిసేపటికే భారీ అగ్నిప్రమాదం జరిగింది. అలాగే సమీపంలోని 50కి పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళ వాతావరణం నెలకొని జనం అక్కడి నుంచి పరుగులు తీశారు. ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.


ఇక, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతం తెలియరాలేదు.. పేలుడు సంభవించిన సమయంలో ఫ్యాక్టరీలో 100 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. గాయపడిన వారిని అంబులెన్స్‌లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలం దగ్గర పోలీసు బలగాలను మోహరించాయి. ప్రస్తుతం ఫ్యాక్టరీకి వెళ్లే దారిలో బారికేడ్లు వేసి సామాన్య ప్రజల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement