Saturday, May 4, 2024

Exclusive – ఎగ్జిట్ పోల్స్ లో నిజ‌మెంత‌?

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – రానున్న సార్వత్రిక ఎన్నికలకు రిహార్సల్స్‌గా పరిగణిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లిd ఎన్నికలు తుది విడత గురువారం ముగి సింది. వెనువెంటనే ఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడ్డాయి. ఆదివారం జరిగే లెక్కింపు ప్రక్రియలో వాస్తవ లెక్కలు వెలువడే వరకు దేశవ్యాప్తంగా ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలపైనే విస్తృత స్థాయి లో చర్చలు జరగనున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో ఖచ్చి తత్వం పట్ల ఒకప్పుడు పూర్తిస్థాయి విశ్వాసముండేది. రాన్రాను ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహణలో కూడా రాజకీయ పార్టీల ప్రమేయం పెరిగింది. సాధారణ సర్వేల తరహాలోనే ఎగ్జిట్‌ పోల్స్‌ను కూడా రాజకీయ పార్టీలు ప్రభావితం చేయగలుగుతున్నాయి. దీంతో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలపై సాధారణ ప్రజల్లో విశ్వసనీయత కనిపించడం లేదు. పైగా గతంలో పలు ఎన్నికల సందర్భంగా వెల్లడైన ఎగ్జిట్‌ ఫలితాలు బ్యాలెట్ల లెక్కింపు ఫలితాలకు చాలా దూరంగా నిల్చిపోయాయి. భారత్‌లో ఎగ్జిట్‌ పోల్స్‌కు అనుస రిస్తున్న విధివిధానాల నుంచి సమాచార క్రోడీకరణ వరకు ఇప్పటికీ పాతతరహా విధానాల్నే అనుసరిస్తున్నారు. పైగా భారతీయ ఓటర్లలో నిరక్షరాస్యత శాతం ఎక్కువ. దీంతో పాటు భారతీయ ఎన్నికల్లో ధన ప్రవాహం అనూహ్యంగా పెరిగింది. దీంతో బూత్‌లో ఓటేసి తిరిగొచ్చిన ఓటరు తానేపార్టీకి అను కూలంగా వ్యవహరించింది చెప్పడంలో సందిగ్ధ పడుతున్నాడు. ఈ ఒక్క అంశం ఎగ్జిట్‌ పోల్స్‌ విశ్వసనీయతకు సవాల్‌గా మారింది. సాధారణంగా ఎగ్జిట్‌ పోల్స్‌ ఎన్నికల్లో ప్రజల మూడ్‌ ను ప్రతిబింబిస్తాయి. అయితే పలు సందర్భాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వాస్తవ ఫలితాలకు తీవ్ర విరుద్ధంగా మిగిలాయి. దీంతో గతకొన్నేళ్ళుగా ఎగ్జిట్‌ పోల్స్‌ను పూర్తిస్థాయిలో విశ్వసించడానికి వీల్లేదని రాజకీయ పండితులు కూడా స్పష్టం చేస్తున్నారు.

ప్రధానంగా ఎగ్జిట్‌ పోల్స్‌ సందర్భంగా ఓటర్లను ఏ రాజకీయ పార్టీకి మద్దతిచ్చారని ప్రశ్నిస్తారు. ఇది ఏ రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి గాలి వాటు పరిస్థితి ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది. గతంలో ఓటర్లను ప్రత్యక్షంగా మాత్రమే ప్రశ్నించేవారు. కానీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ప్రశ్నల సందర్భంలో ఓటర్లు ప్రదర్సించే నిజాయితీకి అనుగుణంగానే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల విశ్వసనీయత ఆధారపడి ఉంటుంది. అయితే వివిధ పార్టీలకు చెందిన అనుకూల వర్గాలు తమ అనుకూలతను బహిరంగపర్చేందుకు ఏమాత్రం వెనుకాడరు. కానీ తటస్థ ఓటర్లు మాత్రం తమ పార్టీ విశ్వసనీయతను వెల్లడించేందుకు సంకోచిస్తారు.
2017లో గుజరాత్‌ ఎన్నికల ఫలితాలపై తొమ్మిది సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించాయి. ఇందులో ఒకటి తప్ప మిగిలినవన్నీ మరోసారి బీజేపీకి అవకాశం లేదని తేల్చేశాయి. ఇందులో నాలుగు సంస్థలు కాంగ్రెస్‌కు ఏకపక్ష మెజార్టీ ఖాయమని స్పష్టం చేస్తే మిగిలినవి హంగ్‌ దిశగా ఫలితాలొస్తాయని తేల్చి చెప్పాయి. అయితే ఒక్క సంస్థ వెల్లడించిన ఫలితాలు మాత్రమే వాస్తవ రూపం దాల్చాయి.
2004 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ 240 సీట్లకు పైగా స్థానాల్ని సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెలువడ్డాయి. ఈ పోల్స్‌ నిర్వహించిన ప్రతి సంస్థ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డిఎ మరోసారి అధికారంలోకి వస్తుందని ప్రకటించాయి. కానీ వాస్తవ ఫలితాలు ఇందుకు విరుద్ధంగా వచ్చాయి. ఎన్‌డీఏ పక్షాలన్నీ కలిపి 187సీట్లకే పరిమితమైతే కాంగ్రెస్‌ మిత్రపక్షాలతో కలసి 216 సీట్లు సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014 ఎన్నికల సమయానికి దేశమంతా మోడీ వేవ్‌ స్పష్టమైంది. అప్పటి ఎన్నికల్లో టైమ్స్‌ నౌ – ఓఆర్‌జీలతో సహా ఏ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వాస్తవానికి దగ్గరగా లేవు. బరాబర్‌గా ఎన్‌డీఏ పక్షాలు అన్నీ కలసి మెజార్టీ మార్కును సాధిస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేశాయి. టౌమ్స్‌నౌ- ఓఆర్‌ జీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఎన్‌డీఏ కూటమికి 257 సీట్లు వస్తాయని ప్రకటించింది. సీఎన్‌ఎన్‌-ఐబీఎన్‌, సిీఎస్‌బీఎస్‌ పోల్‌ సంస్థలు ఎన్‌డీఏకు 246 నుంచి 251సీట్లు రావొచ్చని అంచనాలేశాయి. కాగా అప్పటి ఎన్నికల్లో ఎన్‌డీఏ పక్షాలకు 300లకు పైగా సీట్లు లభించాయి. అప్పట్లో న్యూస్‌ 24-టుడేస్‌ చాణక్య మాత్రమే ఈ వాస్తవ సంఖ్యకు దగ్గరగా అంచనాలేసింది. 298 సీట్లు ఎన్‌డీఏకు వస్తాయంటూ ప్రకటించింది.

2017 అసెంబ్లిd ఎన్నికల్లో బీజేపీ 200కు పైగా సీట్లు సాధిస్తే ఎగ్జిట్‌ పోల్స్‌లో మాత్రమే ఏబీపీ, లోక్‌నీతిలు 167, సీ-ఓటర్‌ 161 స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌లో ప్రకటించాయి. అలాగే 2020 బీహార్‌ అసెంబ్లిd ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌లో యాక్సిస్‌ మై ఇండియా పోల్‌, టుడేస్‌ చాణ క్యలు రెండూ ఆర్‌జేడీ నేతృత్వంలోని కూటమి స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని ప్రటించాయి. కానీ వాస్తవ ఫలితాలు బీజేపీ, జేడీయూ కూటమికి అనుకూలంగా వెలువడ్డాయి. 2021 పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని ప్రకటించాయి. ఇండియా టుడే, యాక్సిస్‌ మైఇండియా ఫలితాలు బీజేపీకి 160స్థానాల్నిచ్చాయి. రిపబ్లిక్‌- సీఎన్‌ఎక్స్‌ పోల్‌ 148స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని స్పష్టం చేసింది. కానీ వాస్తవ పరిస్థితుల్లో బీజేపీ 77 సీట్లకే పరిమితమైంది.
దేశంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్ని పూర్తిగా విశ్వసించలేమని 2004, 2014, 2019 సార్వత్రిక ఎన్నికలు నిరూపించాయి. అలాగే పశ్చిమబెంగాల్‌ తాజా ఎన్నికల ఫలితాల్లో కూడా ఇదే రుజువైంది. ఇందుకు ప్రధాన కారణం ఎగ్జిట్‌ పోల్‌ నిర్వహణలో నాణ్యత తగ్గడం. పరిమాణాన్ని కుదించడం. ఈ రెండు అంశాల కారణంగా ఎగ్జిట్‌ పోల్స్‌ రాన్రాను తమ విశ్వసనీయతను కోల్పోతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement