Saturday, April 27, 2024

ఎమ్మెల్యేగా గెలిచిన టీమిండియా క్రికెటర్

టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ తన జీవితాన్ని రాజకీయాల వైపు మళ్లించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మనోజ్ తివారీ.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు. వెస్ట్ బెంగాల్‌లోని షిబ్‌పూర్ నియోజకవర్గం నుంచి తివారీ ఎన్నికల బరిలో నిలిచాడు. దీంతో ఎన్నికల ప్రచార సమయంలో బాగా కష్టపడి అందరిలోనూ మంచి పేరును సంపాదించుకున్నాడు. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాడు.

ఆదివారం వెల్లడైన ఎన్నికల ఫలితాలలో 6 వేల ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రథిన్ చక్రవర్తిపై విజయం సాధించాడు. తనపై మమతా బెనర్జీ పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ విజయం పూర్తిగా మనోజ్ తివారీ కష్టానికే దక్కిందని చెప్పాలి. ఎందుకంటే మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో కూడా పెద్దగా పాల్గొనలేదు. కాగా ఐపీఎల్ ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న మనోజ్ తివారీ చివరిగా 2018 ఐపీఎల్ సీజన్‌లో ఆడాడు. రెగ్యులర్‌గా అతడు క్రికెట్ ఆడకపోయినా ఇప్పటి వరకు అధికారికంగా తన రిటైర్మెంట్‌ను ప్రకటించలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో తన నియోజకవర్గానికి మనోజ్ తివారీ ఎలాంటి సేవలను అందిస్తాడో వేచి చూడాలి.

ఇప్పటికే క్రీడా జీవితం నుంచి రాజకీయాలకు మళ్లిన వారిలో గౌతమ్ గంభీర్, సచిన్ టెండూల్కర్, మహ్మద్ అజరుద్దీన్, నవజ్యోత్ సింగ్ సిద్దూ, సౌరభ్ గంగూలీ వంటి భారత క్రికెటర్లు ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement