Tuesday, April 30, 2024

క్రికెట్‌కు అలెక్స్‌ హేల్స్‌ వీడ్కోలు..

ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ అలెక్స్‌ హేల్స్‌ వీడ్కోలు పలికాడు. టీ20ల్లో విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు సాధించిన అలెక్స్‌ సంచలన నిర్ణయం తీసుకొని అందరికి షాకిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌ అన్ని ఫార్మాట్లనుంచి తప్పుకుంటున్నట్లూ శుక్రవారం ప్రకటించాడు. తన రిటైర్మెంట్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నాడు. అలెక్స్‌ ఇంగ్లండో ఎన్నో చిరస్మరాణీయ విజయాలు అందించాడు.

గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అలెక్స్‌.. తమ జట్టు విశ్వవిజేతగా నిలవడంలో ఎంతో కృషి చేశాడు. ప్రపంచకప్‌లో ఆరు మ్యాచుల్లో 212 పరుగులు చేశాడు. సెమీఫైనల్లో భారత్‌పై విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడిన అతను 47 బంతుల్లో 86 పరుగులు చేసి ఇంగ్లండ్‌ను ఫైనల్స్‌కు పంపాడు. ఇక ఇంగ్లండ్‌ తరఫున అలెక్స్‌ హేల్స్‌ 11 టెస్టులు, 70 వన్డేలు, 75 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

ఓవరాల్‌గా ఇతని కెరీర్‌లో 7 శతకాలు, 31 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు 5000లకు పైగా పరుగులు చేశాడు. టీ20 స్పెషలిస్టుగా పేరు సాధించిన అలెక్స్‌ 2022 టీ20 ప్రపంచకప్‌ తర్వాత జట్టులో చోటు సాధించలేదు. మరోవైపు వన్డే జట్టులో 4 సంవత్సరాలుగా ఇతనికి చోటు లభించలేదు. 2016లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిన అలెక్స్‌ 171 పరుగులు చేశాడు.

దీంతో ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 444/3 అత్యధిక పరుగులు చేసి ప్రపంచరికార్డు నమోదు చేసింది. రెండేళ్ల అనంతరం ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌ మరోసారి 481/6 పరుగులు చేసి పాత ప్రపంచ రికార్డును తిరగరాసింది. ఈ మ్యాచ్‌లోనూ అలెక్స్‌ 147 పరుగులు చేశాడు. ఇప్పుడు ఇతను క్రికెట్‌కు వీడ్కోలు పలకడం ఇంగ్లండ్‌కు పెద్ద షాకే.

Advertisement

తాజా వార్తలు

Advertisement