Thursday, February 22, 2024

పెద్ద చెరువును నందనవనంగా తీర్చిదిద్దేందుకు కృషి.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, మార్చి 19: దుర్గదభరితంగా, మురికి కూపంగా ఉన్న పెద్ద చెరువును సుందర, నందన వనంగా తీర్చి దిద్దేదుకు గత నాలుగైదేళ్లుగా ఎంతో కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం ఉదయం రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, ముంబై, అహ్మదాబాద్ కు చెందిన టూరిజం కన్సల్టెంట్లతో మినీ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు, ఐలాండ్, సస్పెన్షన్ బ్రిడ్జి, శిల్పారామాలను సందర్శించారు. అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… పెద్ద చెరువు ప్రాంతం గతంలో దుర్గంధ భరితంగా ఉండేదని, కాలు పెట్టేందుకు కూడా సందులేని విధంగా మురికి తుమ్మ చెట్లు, కంప, చెత్త చెదారం ఉండేదన్నారు. గత నాలుగు ఐదు ఏళ్ళుగా ఎంతో శ్రమించి నందనవనంగా తీర్చిదిద్దామన్నారు. శిల్పారామంలో మినీ వండర్ లా, అడ్వెంచర్ పార్కు, ఫుడ్ కోర్టులు వంటివి ఏర్పాటు చేసి పట్టణవాసులకు మంచి పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే నంబర్ వన్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో ముందుకు వెళుతున్నట్లు వెల్లడించారు. రానున్న రెండు, మూడు నెలల్లో పనులన్నీ పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. ట్యాంక్ బండ్, ఐలాండ్, నక్లెస్ రోడ్డు, తీగల వంతెనతోపాటు పట్టణవాసులు ఉదయమే నడక కోసం నాలుగు కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటితోపాటు కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు, మన్యంకొండ టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.


మన ఎన్నారైలతో స్టార్టప్ ల ఏర్పాటు
ఇటీవల తన విదేశీ పర్యటన సందర్భంగా ఇతర దేశాలలో స్థిరపడిన జిల్లాకు చెందినవారు ఐటి కారిడార్ లో స్టార్ట్ అప్ లు, ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సహిస్తున్నట్లు, త్వరలో వారితో సమావేశమవ్వనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. విదేశాల్లో స్థిరపడిన మన ప్రాంత వాసులతో త్వరలోనే ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు వివారించారు. ఐటీ కం ఎనర్జీ పార్కులో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అమర రాజా లిథియం గిగా సెల్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇటీవల జర్మనీ పర్యటనలో ఉన్నప్పుడు జిల్లాకు చెందిన పలువురు ఉద్యోగులు తనను కలిసి లిథియం పరిశ్రమ ఏర్పాటుపై ఎంతో సంతోషం వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు. వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లే పనిలేకుండా జిల్లాలోనే అన్ని సౌకర్యాలతో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లు పూర్తయితే జిల్లాలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.


పర్యాటకులను ఆకట్టుకునేలా నిర్మిస్తున్నాం…
పర్యాటకశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా
మహబూబ్ నగర్ పట్టణానికి శిల్పారామం, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ కీలకంగా మారన్నాయని పర్యాటకశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. 90 శాతం పనులు పూర్తయ్యాయని, డిజైన్ వర్క్ మాత్రం మిగిలిందన్నారు. సుందరీకరణలో భాగంగా అహ్మదాబాద్, ముంబయి నుండి నిపుణులను పిలిపించామన్నారు. వారి సలహా మేరకు రానున్న వారం, పది రోజుల్లో సుందరీకరణ పనులు చేపడతామన్నారు. మహబూబ్ నగర్ శిల్పారామం, ట్యాంక్ బండ్లను ఒక అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇవన్నీ పూర్తయితే హైదరాబాద్, ఏపీ, కర్ణాటక నుండి సైతం ఇక్కడికి పర్యాటకులు వచ్చేందుకు అవకాశం ఉందని ఆయన అన్నారు.


ట్యాంక్ బండ్ పై స్వయంగా డ్రైవింగ్ చేస్తూ సమీక్షించిన మంత్రి…
అంతకుముందు మంత్రి ట్యాంక్ బండ్ చుట్టూ అధికారులను తన వాహనంలో ఎక్కించుకుని స్వయంగా డ్రైవింగ్ చేశారు. చెరువు చుట్టూరా జరుగుతున్న పనులను పరిశీలించారు. ట్యాంక్ బండ్ మీద నుంచి ఐలాండ్ వరకు అక్కడి నుంచి శిల్పారామం వరకు మంత్రి స్వయంగా డ్రైవింగ్ చేశారు. సుందరీకరణ, నెక్లస్ రోడ్, ఐల్యాండ్, డిజైన్, పార్కింగ్, గ్లో గార్డెన్ వంటివి వాటిపై సలహాలను ఇచ్చారు. అదేవిధంగా శిల్పారామం ఓపెన్ ఎయిర్ థియేటర్, పగోడాలు, వాల్ డెకరేషన్ వంటి వాటిపై సూచనలు ఇచ్చారు. రామన్ పాడు పైపులైన్ ద్వారా అబ్దుల్ ఖాదర్ దర్గా మీదుగా, బస్ డిపో వెనుక నుండి ట్యాంక్ బండ్ లోకి మరో పైప్ లైన్ ద్వారా నీటిని వదిలే విషయమై మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఇంజనీర్ బెంజిమెన్ లతో మంత్రి మాట్లాడారు.
ముడా చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీర్ మనోహర్, మున్సిపల్ ఇంజనీర్ బెంజమిన్, కౌన్సిలర్లు రామ్ లక్ష్మణ్, కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్, శిల్పారామం మేనేజర్ నిరంజన్ రెడ్డి, తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement