Sunday, February 25, 2024

Editorial – రెజ్ల‌ర్లు గెలిచారా ?.. ఓడారా?…

మహిళా మల్లయోధులు (రెజ్లర్లు) కొద్దినెలల పాటు జరిపిన ఆందోళనను నిలిపివేస్తున్నట్టు ప్రకటించడం ఒక మెట్టుదిగినట్టుగానే భావించాలి. వారి డిమాండ్‌ ప్రకారం రెజ్లర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌సింగ్‌ పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లలో ఒకటి మైనర్‌ బాలిక ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేసినట్టిదనీ,ఆ బాలిక మైనర్‌ కాదని ఆమె తండ్రి చెప్పడంతో పోక్సో చట్టం కింద నమోదు చేసిన ఆ ఎఫ్‌ ఐఆర్‌ని పోలీసులు వెనక్కి తీసుకునే అవకాశాలున్నాయి. ఈ కేసులో బ్రిజ్‌భూషణ్‌ పై కేసు దర్యాప్తు చేయించి ఈనెల 15వతేదీలోగా చార్జిషీట్‌ నమోదు చేయిస్తామంటూ కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ హామీ ఇవ్వడంతో రెజ్లర్లు తమ ఆందోళనను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.బ్రిజ్‌ భూషణ్‌ అధికార పార్టీ ఎంపీ కావడం వల్ల ఈ కేసును ఏదో విధంగా మసిపూసి మారేడు కాయ చేస్తారనే అనుమానాలు మొదటి నుంచి వ్యక్తం అవుతున్నాయి. దానికి తగినట్టే, ఇప్పుడు ఫిర్యాదుదారుల్లో ఒకరు మైనర్‌ కాదనీ, ఈ విషయాన్ని స్వయంగా ఆమె తండ్రే చెప్పారని అంటున్నారు. అంటే కేసు తీవ్రత తగ్గినట్టే. ఇదే మాదిరిగా మంత్రి ఇచ్చిన వ్యవధిలోపల ఇంకా ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయోనని అనుమానిస్తు న్నారు.

బ్రిజ్‌ భూషణ్‌సింగ్‌ ఉత్తరప్రదేశ్‌కి చెందిన బీజేపీ నాయకుడు రాజకీయ కండల యోధుడు. ఆయన పలుకుబడి, రాజకీయప్రాబల్యం తన నియోజకవర్గానికే కాకుండా ఆరేడు నియోజకవర్గాలకు విస్తరించిందని చెబుతున్నారు. బహుశా అతడిపై చర్య తీసుకోవడానికి ప్రభుత్వం వెనకాడుతోందా? కావాలనే వెనకేసుకొస్తు న్నదా? అన్న అనుమానాలు రోజురోజుకి తీవ్రమవుతూ వచ్చాయి. అంతేకాకుండా అతడు ఉత్తరప్రదేశ్‌ ముఖ్య మంత్రి యోగీ ఆదిత్య నాథ్‌కి అత్యంత సన్నిహితుడు. ఇంకా చెప్పేదేముంది! అతణ్ణి టచ్‌ చేయడం సంగతి దేవుడెరుగు.. భారత శిక్షా స్మృతి అతని దరిదాపులకైనా వెళ్లగలదా? ఇన్ని నెలల పరిణామాల తర్వాత ఈ అనుమానం రాక మానదు. అతడు తమను వేధింపులకు గురి చేశాడని మహిళా రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. అయితే, వాటన్నింటికన్నా ఫిర్యాదు ఇచ్చిన వారిలో మైనర్‌ ఉండటం వల్ల పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ని నమోదు చేశారు. ఈ చట్టం కింద కేసునుంచి నిందిత ుణ్ణి తప్పిం చడం అంత సులభం కాదు.మామూలు వేధింపులకూ, మైనర్ల వేధింపులకూ చాలా తేడా ఉంటుంది. ఈ కేసును నీరు గార్చడానికే మైనర్‌ బాలిక తండ్రికి ఏదో ఆశజూపి అతడు వెనక్కి తగ్గేట్టు చేశాడని అంటున్నారు.

ఇందులో వాస్తవం ఉండి ఉండవచ్చు. బ్రిజ్‌ భూషణ్‌ని ఈ కేసు నుంచి బయటపడేయడానికి కేసును నీరు గార్చడం ప్రధానం. ఇదంతా పథకంప్రకారమే జరుగుతోందని అనుమానిస్తున్నారు. మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ని కలు సుకున్న వారిలో ఒలింపిక్‌ విజేతలు బజరంగ పునియా, సాక్షి మాలిక్‌ తదితర కీలక రెజ్లర్లు ఉన్నారు. మంత్రి ఇచ్చిన హామీపై తమకు నమ్మకం కుదిరిందని వారిద్దరూ చెప్పారు.మహిళా, పురుష రెజ్లర్ల భద్రత గురించి కూడా మంత్రితో ఆరు గంటల సేపు తాము జరిపిన చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్టు సాక్షి మాలిక్‌ చెప్పారు.గత నెల 28వ తేదీన రెజ్లర్లపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ని వెనక్కి తీసుకునేందుకు కూడా మంత్రి అంగీకరించారని ఆమె తెలిపారు.

మంత్రితో సుదీర్ఘంగా జరిగిన చర్చల సారాం శాన్ని బట్టి చూస్తే ఈ ఎఫ్‌ఐఆర్‌ని అడ్డుపెట్టుకునే రెజ్లర్లను ప్రభుత్వం మెత్తబడేట్టు చేసిందేమోననిపిస్తోంది.దేశ రాజధానిలో రెజ్లర్లు జరిపిన ఆందోళన చరిత్రలో నిలిచి పోతుంది. కొత్త పార్లమెంటుభవనం ప్రారంభోత్సవం రోజున రెజ్లర్లు జరిపిన ఆందోళన దేశంలో అన్ని వర్గాల ను ఆకర్షించింది.మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఇచ్చిన హామీల్లో రెజ్లర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్ష పదవికి ఈనెలాఖరు లోగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకరిం చింది. అంతేకాకుండా ఫెడరేషన్‌ ఏర్పాటు చేసిన అంత ర్గత ఫిర్యాదుల కమిటీకీ మహిళనే అధ్యక్షురాలిగా నియ మిస్తామని తెలిపారు. అంటే, మహిళా రె జ్లర్స్‌ చేసే ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించేందుకు మహిళ అధ్యక్షురాలు ఉండటం వల్ల మహిళా రె జ్లర్స్‌ భవిష్యత్‌లో చేసే ఫిర్యాదులను తేలిగ్గా కొట్టివేయడానికి వీలుండదు. రెజ్లర్ల సమాఖ్యకు ఈనెలాఖరులోగా ఎన్నికలు నిర్వహి స్తామన్న హామీని కూడా మహిళా రెజ్లర్లు ప్రభుత్వం నుంచి రాబట్టగలిగారు.

అంతేకాదు,బ్రిజ్‌పై దర్యాప్తును జూన్‌ 15వ తేదీలోగా పూర్తి చేయిస్తామనే విషయమై మంత్రి నుంచి రెజ్లర్లు లిఖిత పూర్వక హామీని రాబట్టడం విశేషమే. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెనక్కి తగ్గితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రెజ్లర్లు హెచ్చ రించారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసిన రెజ్లర్ల విషయంలో ప్రభుత్వం ఇక పైన మరింత స్పష్టమైన రీతిలో వ్యవహరిస్తుందని అనుకోవచ్చు. రెజ్లర్లు మెట్టు దిగి వచ్చినట్టు కనిపిస్తున్నా, ప్రభుత్వం నుంచి హామీలను రాబట్టడంలో దృఢంగానే వ్యవహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement