Saturday, May 18, 2024

Delhi | చంద్రబాబు కోసం నిజాముద్దీన్‌ దర్గాలో దువా.. విడుదల కోరుకుంటూ మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా ప్రార్థనలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల కావాలని కోరుకుంటూ ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా ఢిల్లీలోని నిజాముద్దీన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు (దువా) చేశారు. దర్గాపైన చాదర్ సమర్పించి దువా చేసిన చాంద్ బాషా, చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అక్రమ కేసుల నుంచి విముక్తి పొంది మరోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్టు చెప్పారు. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ కి కూడా మనోధైర్యం కల్పించి ముందుకు సాగాలని కోరుకున్నట్టు వెల్లడించారు.

శనివారం రాజస్థాన్ అజ్మీర్ దర్గాకు వెళ్లి అక్కడ కూడా ప్రార్ధన చేస్తానని ప్రకటించారు. నిజాముద్దీన్ నుంచి ఆంధ్రప్రదేశ్ భవన్ చేరుకున్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని, అరెస్ట్ చేసి జైల్లో పెడితే టీడీపీ పని అయిపోతుంది అనుకున్నారని, కానీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నారని అన్నారు. 2024లో మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయమని, ఆయన కోసం దేవాలయాల్లో హిందువులు పూజలు చేస్తుంటే, ముస్లింలు దర్గాల్లో దువా చేస్తున్నారని అన్నారు. అందరి ప్రార్థనలతో ఆయన కేసుల నుంచి బయటపడతారని, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement