Saturday, May 18, 2024

స్కూళ్లల్లో పెరుగుతున్న విద్యార్థుల డ్రాపౌట్‌.. బడిమానేసిన పిల్లలు 14.30 శాతం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బడిఈడు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని అమలు చేస్తున్నప్పటికీ మంచి ఫలితాలు రావడంలేదు. ప్రతి ఏడాది ఎంతో కొంత మంది బడిఈడు పిల్లలు పాఠశాలల బయటే ఉంటున్నారు. తమ బాల్యమంతా బయటే మగ్గుతోంది. ప్రభుత్వాలు బాలబాలికల విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ చాలా మంది ఇంకా చదువుకు దూరంగానే ఉంటున్నారు. 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఏప్రిల్‌ 20న జరిగిన సమగ్రశిక్షా అభియాన్‌ ప్రాజెక్టు అప్రూవల్‌ బోర్డు (పీఏబీ) సమావేశం జరిగింది. ఆ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను కేంద్ర విద్యాశాఖ రాష్ట్రానికి ఇటీవల పంపింది. ఇందులో రాష్ట్రానికి పలు సూచనలు చేసింది. పీఏబీ రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో డ్రాపౌట్‌ ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. హైస్కూళ్లలో మధ్యలోనే బడి మానేసే వారి సంఖ్య పెరుగుతోందని తెలిపింది. 2019-20లో విద్యార్థుల డ్రాపౌట్‌ రేటు 14 శాతం ఉంటే, 2020-21 విద్యా సంవత్సరంలో విద్యార్థుల డ్రాపౌట్స్‌ 14.30 శాతంగా నమోదైంది. బడిఈడు పిల్లలను గుర్తించేందుకు ప్రతి ఏడాది ఎన్ని సర్వేలు చేసినా బడికి వచ్చి మధ్యలో ఆగిపోయిన వారు ఉంటున్నారు. ప్రతి ఏటా జిల్లాల్లో బడులు ప్రారంభమయ్యే ముందు 6 నుంచి 14 ఏళ్లలోపు బడిఈడు పిల్లలను అదే విధంగా కళాశాల స్థాయిలో 15 నుంచి 19 ఏళ్ల పిల్లలను వేర్వేరుగా గుర్తిస్తారు. విద్యార్థుల సామర్థ్యం, వయసు, అర్హత, ఆసక్తిని బట్టి తగిన తరగతిలో చేర్పించటం చేస్తుంటారు. అలాగే దూరవిద్యలో ప్రవేశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. సమగ్రశిక్ష ఆధ్వర్యంలో సీఆర్పీలు క్షేత్రస్థాయిలో తిరిగి ఈసర్వేను నిర్వహిస్తుంటారు. మధ్యలోనే చదువు ఎందుకు ఆపేశారు, గల కారణాలు, పరిస్థితులపై పూర్తి సమాచారాన్ని సేకరిస్తారు. ఈ సర్వేలో భాగంగా ఆవాస ప్రాంతాలు, గృహాలు, పనిచేసే ప్రదేశాలు, ఇటుకబట్టీలను సందర్శించి సమాచారం సేకరించి నివేదిక రూపొందిస్తాీరు. వివిధ కారణాలతో బాల, బాలికలు చదువుకు దూరం కాకుండా బడిలో చేర్పించాలనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యంగా ఉంది.

కారణాలు అనేకం…

ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నా ప్రతి ఏటా బడికి దూరం అవుతున్న పిల్లల సంఖ్య పెరుగుతునే ఉంది. బాలికలకైతే హైస్కూల్‌ చదివే వయసులోనే బాల్య వివాహాలు చేసేస్తున్నారు. కరోనా కాలంలో ఇది ఎక్కువగా ఉంది. మరికొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులు తమకు ఆర్థిక స్థోమతలేని కారణంగా చదువును మధ్యలోనే మాన్పించేస్తున్నారు. ఇంకొంత మంది వారు ఉండే ప్రాంతాలు, ఆవాలసాల్లో ప్రభుత్వ పాఠశాలలు లేకపోవడంతో పంపించడంలేదని తెలుస్తోంది. కొంత మంది తల్లిదండ్రులైతే పిల్లలను పనికి పంపించేస్తున్నారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పౌష్ఠికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్యను అందించడంతోపాటు పాఠశాల దూరంగా ఉందన్న కారణంతో విద్యార్థులు బడి మానివేయకూడదని, ప్రతి రోజూ బడికి వెళ్లి చదువుకోవాలని నెలనెలా రవాణా భత్యాన్ని అందిస్తున్నది.

బడులు లేని ప్రాంతాలు 3,880…

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు లేని గ్రామాలు చాలానే ఉన్నాయి. పాఠశాలలు లేని ప్రాంతాలు 3,880 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా తమ గ్రామాలు, పల్లెల్లో బడులు లేకపోవడంతో సమీప గ్రామాలకు వెళ్లి చదువుకుంటున్నారు. మరికొంత మంది విద్యార్థులు ఆటోలు, బస్సులు, వ్యాన్ల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. అయితే రాష్ట్రంలోని బడులులేని 3,880 ప్రాంతాల్లో 37,103 మంది విద్యార్థులను అధికారులు గుర్తించినట్లుగా తెలిసింది. వీరికి రవాణా భత్యం కింద నెలకు రూ.600 ఇచ్చేందుకు సమగ్ర శిక్షా అభియాన్‌ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం వీరికి రవాణా భత్యం అందజేయనున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఒక కిలోమీటర్‌, 8వ తరగతికి 3 కిలోమీటర్లు, 9, 10వ తరతగతి విద్యార్ధులకు 5 కిలోమీటర్ల దూరంలోని బడుల్లో చదువుకుంటున్న వారికి రవాణా భత్యం ఇవ్వనున్నారు. గతంలో 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే రవాణా భత్యం అందించేవారు. కానీ 2021 ఏడాది నుంచి 9, 10 తరగతి విద్యార్థులకూ అందజేస్తున్నారు. ఇందుకు గతేడాది రూ.24.35 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. 1 నుంచి 10 తరగతి వరకు గల 40,598 మంది విద్యార్థులకు ఏడాదికి రూ.6వేల వరకు రవాణా భత్యాన్ని గతేడాది అందించారు. ఇదే మాదిరిగా ఈ విద్యా సంవత్సరానికి కూడా డ్రాపౌట్‌ తగ్గించేందుకు విద్యార్థులకు రవాణా భత్యాన్ని అందించనున్నారు

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement