Sunday, April 28, 2024

ఐదు వంద‌లు డ్రా చేస్తే 2,500 వ‌చ్చాయ్..దాంతో ఏటీఎం ముందు బారులు తీరిన జ‌నం

ఓ ప్రైవేటు బ్యాంక్ ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా చేసిన దానికంటే ఐదు రెట్లు న‌గ‌దు ఎక్కువ‌గా వ‌స్తుండ‌టంతో జ‌నం బారులు తీరారు. ఈ సంఘ‌ట‌న నాగ‌పూర్ జ‌ల్లా ఖాప‌ర్ ఖేడా ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది.ఓ ప్రైవేటు బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు ఉపసంహరించుకోవడానికి ఓ వ్యక్తి వెళ్లాడు. ఆ ఏటీఎంలో రూ. 500 తీసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, ఆయనకు రూ. 2,500 వచ్చాయి. దీంతో ఆయన ఖంగు తిన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఇది నిజమేనా అని మరోసారి రూ. 500 కోసం ప్రయత్నించాడు. అప్పుడు కూడా మరోసారి ఆయనకు రూ. 2,500 డబ్బులు చేతుల్లోకి వచ్చింది. ఈ విషయం క్షణాల్లో ఊరంతా పాకింది. స్థానికులంతా పరుగున ఏటీఎం ముందుకు వచ్చి చేరారు.

ఏటీఎంలో విత్ డ్రా చేసుకోవడానికి బారులు తీరారు. ఈ వ్యవహారం ఇలాగే సాగుతుండగా.. అదే బ్యాంకు కస్టమర్ ఒకరు అక్కడికి వచ్చారు. ఏదో తేడాగా కనిపించడంతో స్థానిక పోలీసులను అలర్ట్ చేశాడు. అంతే, పోలీసులు వేగంగా స్పాట్‌కు వచ్చారు. అనంతరం, ఆ అవకతవక గురించి బ్యాంకు అధికారులు తెలియజేసినట్టు ఖాపర్‌ఖేడా పోలీసు స్టేషన్‌కు చెందిన ఓ పోలీసు అధికారి తెలిపారు.ఏటీఎం మెషీన్‌లో చిన్న సాంకేతిక లోపం కారణంగా ఈ డబ్బు ఐదు రెట్లు ఎక్కువగా వస్తున్నట్టు గుర్తించారని వివరించారు. ఏటీఎం మెషీన్‌లో డబ్బులు పెట్టేటప్పుడు.. రూ. 100 నోట్లు పెట్టే ఏటీఎం ట్రేలో రూ. 500 నోట్లు పెట్టారని ఆ అధికారి చెప్పారు. అందుకే రూ. 500 విత్ డ్రా చేస్తే.. వంద రూపాయల కరెన్సీ నోట్లు ఐదు రావడానికి బదులు రూ. 500 నోట్లు ఐదు వచ్చినట్టు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement