Friday, May 3, 2024

అభిషేక్ బోయినపల్లికి బెయిల్ ఇవ్వొద్దు.. బయటికొస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితులు అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ బెయిల్ మీద బయటికొస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆరోపించింది. బుధవారం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్సులో ఉన్న సీబీఐ స్పెషల్ కోర్టులో నిందితుల బెయిల్ పిటిషన్లపై జరిగిన విచారణ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాదులు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్, బెయిల్‌పై నిర్ణయాన్ని ఈ నెల 14న సాయంత్రం గం. 4.00కు వెల్లడిస్తానని తెలిపారు.

బెయిలిస్టే విచారణపై ప్రభావం: సీబీఐ
బెయిల్ కోసం నిందితులు అభిషేక్, విజయ్ నాయర్ దాఖలు చేసిన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ.. నిందితులిద్దరికీ బెయిల్ ఇవ్వొద్దంటూ పేర్కొంది. అభిషేక్ పలుకుబడి కల్గిన వ్యక్తి అని, సాక్షులను ప్రభావితం చేస్తారని వెల్లడించింది. బెయిల్ ఇస్తే దేశం విడిచి పారిపోయే అవకాశం కూడా ఉందని తెలిపింది. తాజాగా బుధవారం జరిగిన విచారణ సందర్భంగా.. కేసులో కీలక నిందితుడు దినేశ్ అరోరా అప్రూవర్‌గా మారి స్టేట్మెంట్ ఇవ్వనున్నారని, ఈ సమయంలో బెయిలిస్తే విచారణపై ప్రభావం పడుతుందని న్యాయవాదులు తెలిపారు. పూర్తిగా న్యాయపరిధిలో విచారణ జరుపుతున్నామని, ఈ క్రమంలో అప్రూవర్‌గా మారిన దినేశ్ అరోరాను ప్రశ్నించాల్సి ఉందని తెలిపారు.

మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన సమావేశాల్లో విజయ్ నాయర్ పాల్గొన్నారని, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో ఈ సమావేశాలు ఏర్పాటు చేశారని చెప్పారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు హవాలా మార్గాల్లో నగదు బదిలీలు చేశారని వివరించారు. మద్యం లైసెన్సుల్లో ఎల్-1 లైసెన్స్ పొందినవారికి వచ్చే 12 శాతం కమిషన్‌లో 6 శాతం కమిషన్‌ను తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని వివరించారు. మొత్తంగా నాయర్ మీడియా ప్రతినిధి రూపంలో దళారీ పాత్ర పోషించారని చెప్పారు. లిక్కర్ స్కాంలో అధికార పార్టీ హస్తం ఉన్నందున సాక్ష్యాధారాలు సేకరిస్తూ లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఈ సమయంలో నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. అయితే ఈ సందర్భంగా న్యాయమూర్తి నాగ్‌పాల్ జోక్యం చేసుకుంటూ ఈ కేసులో పబ్లిక్ ఆఫీస్ దుర్వినియోగం అయిందని అభియోగాలున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన సమాచారం ఇవ్వాల్సిందిగా సీబీఐకి సూచించారు. అలాగే నిందితుల మధ్య జరిగిన చాటింగ్ వివరాలు కూడా కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు.

ఎలాంటి ఆధారాలు దొరకలేదు: అభిషేక్
అభిషేక్‌పై కేవలం నగదు లావాదేవీల ఆరోపణలు మాత్రమే ఉన్నాయని, ఎలాంటి ఆధారాలు లేవని ఆయన తరఫు న్యాయవాది శ్రీ సింగ్ వాదించారు. నెల రోజుల నుంచి అభిషేక్ రిమాండ్‌లో ఉన్నారని, విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. అలాగే సీబీఐ ఆరోపిస్తున్నట్టుగా అభిషేక్‌కు ఏ ఆంగ్ల ఛానెల్‌తోనూ సంబంధాలు లేవని, అందులో ఎలాంటి వాటాలు (షేర్లు) లేవని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

మంత్రులు, అధికారులను ప్రశ్నించడం లేదు: విజయ్ నాయర్ తరఫు న్యాయవాది
ఢిల్లీ మద్యం కుంభకోణంలో సంబంధం లేని వ్యక్తి (విజయ్ నాయర్)ను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు తప్ప ప్రత్యక్షంగా ప్రమేయమున్న మంత్రులు, అధికారులను ప్రశ్నించడం లేదని విజయ్ నాయర్ తరఫు న్యాయవాది రెబెకా జాన్ వాదించారు. విజయ్ నాయర్‌ను 47 రోజులకు పైగా రిమాండ్‌లో ఉంచారని తెలిపారు. ఆగస్టు 19న, సెప్టెంబర్ 6న విజయ్ నాయర్ నివాసంలో రెండు సార్లు సోదాలు నిర్వహించారని, కానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదని సీబీఐ జడ్జికి వివరించారు. లిక్కర్ వ్యాపారులకు 12 శాతం కమిషన్ ఇచ్చి 6 శాతం తీసుకున్నారన్న ఆరోపణల్లోనూ నిజం లేదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో నాయర్‌కు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement