Sunday, April 14, 2024

ప్రధాని కార్యాలయం ప్రొటోకాల్ మరచింది.. ముఖ్యమంత్రిని ఆహ్వానించకపోవడం సిగ్గుచేటు: ఎంపీ బడుగుల

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించేందుకు వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావును ఆహ్వానించకపోవడం సిగ్గుచేటు అని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు చెందిన రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వం, ప్రధాని కార్యాలయం తీరును తీవ్రంగా తప్పుబట్టారు. గత ఏడాది కాలంగా పనిచేస్తున్న రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని ఇప్పుడొచ్చి ప్రారంభించాలనుకోవడమే విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం పంపలేదని, ప్రధాని కార్యాలయం ప్రొటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం పగబట్టిందని, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తోందని విమర్శించారు. గుజరాత్‌కు లక్ష కోట్లు ఇస్తున్న మోదీ దేశానికి ప్రధాని మంత్రా లేక గుజరాత్ రాష్ట్రానికే మాత్రమేనా అని ప్రశ్నించారు. తెలంగాణ పర్యటనకు వస్తున్న మోదీ రాష్ట్రానికి ఏమి ఇచ్చారో, ఏమిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement