Friday, March 29, 2024

రష్యాపై ఆధారపడొద్దు, ఏ సాయమైనా చేస్తాం.. ఇండియాకు అమెరికా ఆఫర్‌

యుద్ధకాంక్షతో విర్రవీగుతున్న రష్యాపై ఆధారపడడం తగ్గించుకోవాలని, ఇండియాకు ఆయుధాలు సహా ఎటువంటి సహాయం కావాలన్నా అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అమెరికా ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో ఇండియా తటస్థవైఖరిని అవలబిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షలను కాదని రష్యానుంచి చమురు, ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఇన్నాళ్లూ తప్పుపట్టిన అగ్రదేశం ఇప్పుడు ఓ తరుణోపాయం ప్రకటించింది. సుదీర్ఘ మైత్రి, ఆయుధ ఒప్పందాల నేపథ్యంలో ఇంతకాలం రష్యాపై అతిగా ఆధాపడుతున్న ఇండియా ఇక వైఖరిని మార్చుకోవాలని, ఆ దేశంపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని, ఆ మేరకు ఏ సహాయమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా రక్షణశాఖ సహాయ మంత్రి వెండీ షెర్మన్‌ అన్నారు.

భవిష్యత్‌లో రష్యా ఆయుధాలు ఎందుకూ పనికిరావని, ఆంక్షల ప్రభావంతో రష్యా ఆయుధ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుందని, అందువల్ల ఇండియా పునరాలోచించుకోవాలని ఆమె సూచించారు. ఈ విషయంలో తాము భారత్‌తో కలసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఐరోపా యూనియన్‌కు చెందిన ఫ్రెండ్స్‌ ఆఫా యూరోప్‌ సంస్థ బ్రసెల్స్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ఈ కీలక ప్రకటన చేశారు. మరోవైపు ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు వస్తుసామాగ్రి, ఆయుధ సహాయం చేస్తున్న చైనాపై నిప్పులు కక్కారు. రష్యాకు అనుకూలంగా అబద్ధాలను ప్రచారం చేస్తూ పరోక్షంగా ఉక్రెయిన్‌ యుద్ధంలో ఆజ్యం పోస్తోందని విమర్శించారు. చైనా ఎన్ని కుయుక్తులు పన్నినా సంకీర్ణ పక్షాలను తమకు దూరం చేయలేదని ధీమా వ్యక్తం చేశారు. రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న చైనాకు గుణపాఠాలు తప్పవని హెచ్చరించారు.

ఆ దేశంపై ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆమె వెల్లడించారు. రష్యాతో వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం చేసుకుంటున్నామని బీజింగ్‌ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా ఈ వ్యాఖ్యలు చేసింది. రష్యాపై తాము ఆంక్షలు విధించిన నేపథ్యంలో అనేక దేశాలనుంచి ఎగుమతులు నిలిచిపోయాయని, ప్రముఖుల ఆస్తులు స్తంభింపచేశామని షెర్మన్‌ పేర్కొన్నారు. ఈ పరిస్థితులను సానుకూలంగా మలుచుకుని ఆయా వస్తువులు, పదార్థాలు, ఆయుధాలు రష్యాకు చైనా చేరవేస్తోందని మండిపడ్డారు. కాగా ఈనెల తొలివారంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. చైనాతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రష్యానుంచి ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నామని, ఇతర దేశాలనుంచి ఆయుధాల కొనుగోలు భారీ వ్యయంతో కూడుకున్నదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement