Friday, April 19, 2024

సభలో విప్ ఉల్లంఘిస్తే అనర్హత.. పిటిషన్లపై నిర్ణయాలకు డెడ్‌లైన్ ఉండాలే

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్లమెంట్ సభ్యులపై అనర్హత వేటు పిటిషన్లపై నిర్ణయాలకు డెడ్‌లైన్ అవసరమని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అభిప్రాయపడ్డారు. స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టి ఈనెల 19వ తేదీతో మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై స్పందించారు. ఎంపీలపై అనర్హత వేటుకు సంబంధించి 10వ షెడ్యూల్‌ను సవరించాల్సిందేననే ఓంబిర్లా స్పష్టం చేశారు. డెహ్రాడూన్‌లో జరిగిన సభాపతుల సదస్సులోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైందని వివరించారు. ఈ అంశంపై కమిటీ డ్రాఫ్ట్ రిపోర్టు ఇచ్చిందని, తుది నివేదికను త్వరలో బయటపెడతామని చెప్పారు. సవరణలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందని ఓంబిర్లా తెలిపారు. పార్లమెంటు వెలుపల ఎంపీలపై జరిగే ఘటనలు సభాహక్కుల ఉల్లంఘన కిందికి రావని ఆయన వ్యాఖ్యానించారు. సభల బయట కేసులు, అరెస్టులపై 24 గంటల్లోగా స్పీకర్‌కు సమాచారం ఇస్తే చాలని, ముందుగా సమాచారం ఇచ్చిన తర్వాతే అరెస్ట్ చేయాలన్న నిబంధన ఏమీ లేదని స్పష్టం చేశారు. అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలేవైనా ఉంటే పార్లమెంట్ సభ్యులు న్యాయస్థానాలు, మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించవచ్చని సూచించారు. ఎంపీలపై జరిగే థర్డ్ డిగ్రీలు, సెకండ్ డిగ్రీలు తమ పరిధిలోని అంశాలు కాదన్న ఓంబిర్లా, ఆ వ్యవహారాలను న్యాయస్థానాలు చూసుకుంటాయని వివరించారు. ఎంపీ రఘురామకృష్ణ రాజు అరెస్టు వ్యవహారంలో పోలీసులు స్పీకర్ కార్యాలయానికి సమాచారం ఇచ్చారని గుర్తు చేశారు. బండి సంజయ్ అరెస్టు విషయంలో స్పీకర్ కార్యాలయానికి సమాచారం ఇవ్వకపోవడం వల్లే బండి సంజయ్ ప్రివిలేజ్ మోషన్‌పై వేగంగా చర్యలు చేపట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. రఘురామకృష్ణంరాజు సీఎం జగన్‌పై విమర్శలు గుప్పిస్తుండడాన్ని కారణంగా చూపిస్తూ వైసీపీ ఎంపీలు అతనిపై అనర్హత వేటు వేయమంటూ దాఖలు చేసిన ఫిర్యాదు మీదా స్పీకర్ స్పందించారు. పార్లమెంట్ సభ్యులు సభలో విప్ ఉల్లంఘిస్తేనే అనర్హత వేటు పరిధిలోకి వస్తుందని ఆయన తెలిపారు. బయట ముఖ్యమంత్రిని తిట్టినా, కొట్టినా అనర్హత అంశమనేది చట్టసభల పరిధిలోకి రాదని వివరించారు.

సభల్లోకి మీడియా ప్రవేశంపై త్వరలో నిర్ణయం..

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకల్లా కొత్త పార్లమెంట్ భవనం సిద్ధమవుతుందని ఓంబిర్లా తెలిపారు. అనుకున్న సమయం కంటే 5-6 రోజులు ఆలస్యంగా పనులు నడుస్తున్నాయని చెప్పారు. కోవిడ్-19 పరిస్థితులపై నిపుణులతో చర్చిస్తామని, రాజ్యసభ ఛైర్మన్‌తో కలిసి మీడియా ప్రవేశంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మీడియాపై ఆంక్షలు విధించాలని తమకేమీ లేదని ఓంబిర్లా నొక్కి చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement