Friday, April 26, 2024

Delhi | విభజన హామీల పరంగా నిరాశే.. పోలవరం, ఇతర అంశాల్లోనూ నిర్లక్ష్యం: వైసీపీ ఎంపీలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విభజన హామీల పరంగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర బడ్జెట్‌ నిరాశే మిగిల్చిందని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి నేతృత్వంలో రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ… గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కొనసాగింపు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 66 శాతం పెంచడం శుభపరిణామమని సంతృప్తి వ్యక్తం చేశారు. రైల్వేకు 2.4 లక్షల కోట్లు కేటాయింపు కూడా మంచిదన్న ఆయన, అయితే అందులో రాష్ట్రానికి ఎంత మేర వాటా వచ్చిందో చూడాలన్నారు.

బడ్జెట్‌లో ప్రస్తావించి పంప్డ్ స్టోరీజీ విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మిథున్ చెప్పుకొచ్చారు. మధ్యతరగతికి ఇచ్చిన పన్ను ప్రయోజనాలు బావున్నాయన్న ఎంపీ, మత్య్స రంగానికి ఇచ్చే రాయితీలు కూడా రాష్ట్రానికి ఉపయోగపడతాయని వెల్లడించారు. 50 ఏళ్ల పాటు వడ్డీ రహిత రుణాల్లో రాష్ట్రానికి ఎంత కేటాయిస్తారో స్పష్టత రావాలని చెప్పారు. అయితే రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా హామీల నిధు ప్రస్తావన బడ్జెట్‌లో లేదని ఆయన వాపోయారు. పోలవరం, రెవెన్యూ లోటు, రైల్వే కారిడార్, స్టీల్ ఫ్యాక్టరీకి సహాయం వంటి ఏ అంశాన్ని బడ్జెట్‌లో ప్రస్తావించలేదని గుర్తు చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో వీటన్నింటి గురించి కేంద్రాన్ని నిలదీస్తామని వెల్లడించారు.

అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న కర్ణాటకకు అధిక నిధులు ఇవ్వడం గురించి బాధ లేదని, ఏపీకి సంబంధించి పోలవరం ప్రస్తావన లేకపోవడమే బాధాకరమని తెలిపారు. నర్సింగ్ కాలేజీలు, ఏకలవ్య స్కూల్స్‌లోనూ ఏపీకి తగ్గ వాటా సాధించుకుంటామని స్పష్టం చేశారు.

- Advertisement -

ప్రత్యేక హోదా సాధిస్తాం : ఎంపీ మోపిదేవి వెంకటరమణ
కేంద్ర బడ్జెట్ పేదలకు సంబంధించినంత వరకు బావుందని వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అభిప్రాయపడ్డారు. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పొడవైన తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నౌకాయానానికి సంబంధించి అధిక నిధులు కేటాయించాలని కోరారు. కేంద్ర బడ్జెట్‌లో ఏయే రంగానికి ఎంతమేర బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం శక్తివంచన లేకుండా తమ ప్రయత్నం కొనసాగుతుందని మోపిదేవి నొక్కి చెప్పారు.

చంద్రబాబు తన స్వార్థపూరిత ఆలోచనలతో పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారని విమర్శించారు. పోలవరం నిధులు, ఇతర అంశాలకు ఆర్థిక సహాయం పొందే విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొంత నిర్లక్ష్యానికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మెరైన్ – ఆక్వా రంగ అభివృద్ధిలో భాగంగా 4 చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతోందని చెప్పిన మోపిదేవి, బడ్జెట్‌లో ప్రకటించిన ఆక్వా రంగంలో రాయితీలు ఊరట ఇస్తున్నప్పటికీ ఇంకా కొన్ని ప్రోత్సహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న కానుక పేరుతో గ్రామాలకు గ్రామాలనే నిర్మించి ఇస్తున్నారన్న ఆయన, ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దీనిపై కేంద్రం మరింత ప్రత్యేక శ్రద్ధ, రాయితీలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. విశాఖలో మార్చి నెలలో ఏపీ సర్కారు చేపట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కి కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం కావాలని మోపిదేవి వెంకటరమణ విజ్ఞప్తి చేశారు.

ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ఫోకస్ : ఎంపీ భరత్
మహిళలు, మధ్యతరగతికి పెద్దపీట వేసేలా బడ్జెట్ ఉందని ఎంపీ మారగాని భరత్ అన్నారు. బడ్జెట్‌లో ఏపీకి అంశాల ప్రస్తావన లేదని పెదవి విరిచారు. సీఎం జగన్ ప్రకటించిన నవరత్నాలకు తగినట్టుగా కేటాయింపులు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ రావాల్సిన అవసరం ఉందని అన్నారు. కోవిడ్-19 సమయంలో ప్రజలు ఎంతగా అల్లాడిపోయారో చూశామన్న ఆయన, సీఎం జగన్ 16 మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి తీసుకొచ్చారని గురు చేశారు. ఇందులో మూడింటికి నిధులిస్తామని చెప్పిన కేంద్రం మిగతా వాటికి కూడా ఇవ్వాలని భరత్ విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే ప్రైాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.

మూడు ఇండస్ట్రియల్ కారిడార్లతో 80 శాతం ఏపీలోని ప్రాంతాలు కవర్ అవుతున్నాయన్న భరత్, వాటికి బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించడం ద్వారా మరింత ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. పీఎం మత్స్య సంపద పథకానికి రూ. 6 వేల కోట్లు కేటాయించడం సంతోషకరమన్నారు. పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి పెట్టిన కేంద్రం ఈ కేటాయింపుల్లో ఏపీకి ఎంత మొత్తం కేటాయిస్తుందో చూడాలన్నారు. హైదరాబాద్‌కు మంజూరు చేసిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ వంటి ఏదైనా కేంద్రాన్ని ఏపీకి ఇచ్చి ఉంటే రాష్ట్ర ప్రజలు సంతోషపడే వారని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై కేంద్రం ఫోకస్ పెట్టినట్టుగా ఉందని భరత్ విమర్శించారు. తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, విభజన చట్టంలో పదేళ్లలో పూర్తి చేయాల్సినవే అడుగుతున్నామని అన్నారు. దుగిరాజపట్నం బదులు రామాయపట్నం పోర్టుకు నిధులు కేటాయించాలని ఆయన కోరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేటాయింపుల విషయంలో ప్రయత్నిస్తామని, కేంద్రంపై ఒత్తిడి చేస్తామని భరత్ నొక్కి చెప్పారు.

ఫోన్ ట్యాపింగ్ రాజకీయం
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీదా వైసీపీ ఎంపీలు స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం రాజకీయ ఆరోపణని కొట్టి పారేశారు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను ఒకరు రికార్డు చేస్తే ట్యాపింగ్ ఎలా అవుతుందని ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని వ్యతిరేకించినంత మాత్రాన సరిపోదన్న ఆయన, రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ప్రజాస్వామ్య పద్దతిలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement