Saturday, May 18, 2024

Big Story | అడుగంటుతున్న ప్రధాన జలాశయాలు… వానాకాలం సాగుపై సన్నగిల్లుతున్న ఆశలు

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో : రుతుపవనాలు దోబూచులాడుతున్నాయి.. అల్పపీడనాలతో అంతంత మాత్రంగానే కురుస్తున్నాయి.. భారీ వ ర్షాలు లేక కాకతీయుల కాలంలో నిర్మించిన ప్రధాన జలాశయాలు వట్టిపోయి కళాహీనంగా కనిపిస్తున్నాయి. ప్రతిసారీ జులై 15 నాటికే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరినాట్లు జోరుగా సాగుతుండేవి. పత్తి, ఇతర పంటలు కూడా ఏపుగా పెరిగేవి.. గత ఏడాది జులై 12 నాటికే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రధాన జలాశయాలైన లక్నవరం, గుండ్లవాగు, బయ్యారం చెరువు, భీం గణపూర్‌ చెరువులు మత్తళ్ళతో పరవళ్లు తొక్కుతుండగా, రామప్ప, పాకాల, గణపసముద్రం చెరువులు నిండుకుండను తలపించాయి.

భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరదలు ముంచెత్తాయి. కానీ ఈ ఏడాది రుతుపవనాలు ప్రారంభమై దాదాపు నెల రోజులు కావస్తున్నా… ఇప్పటివరకు చెప్పుకోదగిన భారీ వర్షం నమోదు కాలేదు. చెదురు మదురు జల్లులు కురుస్తూ ఒక మోస్తరు వర్షం మాత్రమే ఇప్పటివరకు నమోదైంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా 18 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 10లక్షల ఎకరాల్లో కూడా వివిధ పంటలు విత్తుకోలేదు. వరి రైతుల పరిస్థితి కడు దయనీయంగా మారింది. బోర్లు, బావులు నీటి ఆధారం ఉన్నటువంటి రైతులు జూన్‌ రెండవ వారం నుంచే వరినార్లు పోసుకున్నారు. వివిధ పంటలను సాగుచేసుకున్నారు. వర్షాధారంతో చెరువులపై ఆధారపడిన రైతులు 50 శాతం మంది కూడా వరినార్లు పోసుకోలేదు.

వానాకాలం పంటలపై సన్నగిల్లుతున్న ఆశలు

- Advertisement -

వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా… ఇప్పటివరకు భారీ వర్షం కురిసిన దాఖలాలే లేవు. వాగుల్లో వరదలు పారిన పరిస్థి తి కనిపించడంలేదు. కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి ప్రధాన జలాశయాలతో పాటు చిన్న తరహా, మధ్య తరహా చెరువుల్లోకి చుక్కనీరు జారలేదు. చెరువులు వెలవెలబోతున్నాయి. వానాకాలం పంటల సాగుపై రైతుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. వచ్చీరాని వానలకు రైతులు మెట్టనార్లు పోసుకున్నారు. అవి సరిగా మొలకెత్తడం లేదు.

మెట్టనార్లు వరి ధాన్యం మొలకెత్తి పైనున్నటువటి మట్టి పెళ్లలను చీల్చుకుంటూ బయటకు రావాలి. అలా విత్తనాలు మొలకెత్తాలంటే నేల పుసుల నానితేనే వరి గింజ అయినా, పత్తి గింజ అయినా, ఇతర గింజలైన భూమిని చీల్చుకుంటూ మొలకెత్తుతాయి. కానీ నేల పుసుల నానే విధంగా ఒక్క భారీ వర్షం కూడా నమోదు కాకపోవడం రైతుల్లో ఆందోళన మొదలైంది. వానాకాలం పంటలు పండుతాయా.. అనేటటువంటి ఆందోళన రైతులను వెంటాడుతోంది.

గతేడాది జులై 12 నాటికి మత్తళ్లతో పరవళ్లు తొక్కిన ప్రధాన జలాశయాలు

గత సంవత్సరం జులై 9 నాటికే మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం చెరువు మత్తడితో పరవళ్లు తొక్కింది. 12 నాటికి లక్నవరం, గుండ్లవాగు ప్రాజెక్టు, భీంగణపూర్‌ సరస్సు సహా వందలాది చిన్న చిన్న చెరువులు మత్తళ్లు పడ్డాయి. రామప్ప, పాకాల, గణపసముద్రం సహా అనేక పెద్ద చెరువులు నిండుకుండను తలపించాయి. లక్నవరం, గుండ్లవాగు, భీంగణపూర్‌ చెరువుల మత్తళ్లతో వరదలు పెరిగి అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదలతో వేసిన పంటలు నీట మునిగి ఇసుక మేటలు వేశాయి.

భారీ వర్షాలు లేక గొలుసుకట్టు చెరువులు వెలవెల

కాకతీయులు వర్షపు నీటిని ఒడేసి పట్టేందుకు గొలుసుకట్టు చెరువులను నిర్మాణం చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని రామప్ప, లక్నవరం, పాకాల, గణపసముద్రం ఇలా పెద్దపెద్ద చెరువులకు పౖౖెభాగంలో చిన్న చిన్న గొలుసుకట్టు చెరువులను నిర్మాణం చేశారు. అడవుల్లో కురిసేటటువంటి వర్షాలకు వచ్చే వరదలతో గొలుసుకట్టు చెరువులు ఒక్కొక్కటిగా నిండుతూ మత్తళ్లు పడేవి. మత్తడి ప్రవాహంతో కింది చెరువులు నిండుతూ వచ్చే. ఇలా ప్రతి ప్రధానజలాశయానికి పైభాగంలో 10 నుంచి 20కు పైగా గొలుసుకట్టు చెరువులను నిర్మాణం చేశారు.

వీటి ద్వారా ప్రధాన జలాశయాలకు ఒకేసారి వరద తాకిడి లేకుండా చెరువుకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఈ నిర్మాణాలు చేపట్టారు. రుతుపవనాలు మొదలైనప్పటికీ.. ఎక్కడ కూడా భారీ వర్షాలు నమోదు కాకపోవడంతో గొలుసుకట్టు చెరువులన్నీ వెలవెలబోతున్నాయి. అయితే గడిచిన పది సంవత్సరాల కాలాన్ని పరిశీలించినట్లయితే రుతుపవనాలతో కురిసేటటువంటి వర్షాల కన్నా అల్పపీడన ప్రభావంతోనే భారీ వర్షాలు నమోదవుతున్నాయి.

వాతావారణంలోని సమతుల్యత లోపించడంతో అల్పపీడనాలు ఏర్పడి భారీ వర్షాలు కురిపిస్తుంటాయి. విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ వానాకాలం సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మూడు దఫాలుగా బంగాళఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడినప్పటికీ.. భారీ వర్షం నమోదు కాలేదు. ఇక్కడ పరిస్థితి ఇలాగే ఉంటే కేరళ, మహారాష్ట్ర, ఉత్తర భారతంలోని అనేక రాష్ట్రాల్లో రుతుపవనాలకు అల్పపీడనం తోడుకావడంతో భారీ వర్షాలు నమోదై వరదలు పోటెత్తుతున్నాయి. తెలంగాణలో అందుకు భిన్నమైన పరిస్థితులు నమోదవుతున్నాయి. ఆకాశంలో భారీ వర్షం కురిసే విధంగా మేఘాలు కమ్ముకుంటున్నప్పటికీ.. తేలికపాటి జల్లులతోనే తేలిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే వానాకాలం పంటలపై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతులు ఆవేదన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement