Friday, May 17, 2024

పెద్ద ప్లాట్లకే డిమాండ్.. అనరాక్‌ నివేదిక వెల్లడి

దేశంలో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో వినియోగదారుల అభిరుచి, డిమాండ్‌కు అనుగుణంగా రియల్టర్లు పెద్ద ప్లాట్లలో అపార్ట్‌మెంట్లను నిర్మిస్తున్నారని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ అనరాక్‌ నివేదిక వెల్లడించింది. కోవిడ్‌ సమయంలో పెద్దలు, పిల్లలు వేరువేరు గదులు ఉండాలన్న కోరిక పెరిగింది. అదే సమయంలో ఇంటి నుంచే పని మూలంగా కూడా విశాలమైన ఇల్లు ఉండాలని చాలా మంది భావించారు. ఇంటి సైజ్‌ పెరిగితే రేటు కూడా పెరుగుతుంది. అయినప్పటికీ వినియోగదారులు పెద్ద ప్లాట్లకే మొగ్గు చూపుతున్నారని ఈ నివేదిక తెలిపింది.

దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ సంవత్సరం జనవరి- మార్చి త్రైమాసికంలో ప్రారంభించిన అపార్ట్‌మెంట్లలో ప్లాట్ల పరిమాణం వార్షిక ప్రాతిపదికన 5 శాతం పెరిగిందని అనరాక్‌ తెలిపింది. సంవత్సరం క్రితం ఇదే సమయంలో సరాసరి ప్లాట్‌ విస్తీర్ణం 1170 చదరపు అడుగులుగా ఉండగా, ఈ సంవత్సరం అది 1225 చదరపు అడుగులకు పెరిగిందని పేర్కొంది. ఢిల్లి ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో సరాసరి ప్లాట్‌ పరిమాణం 50 శాతం పెరిగి 1700 చదరపు అడుగులకు చేరింది. 2022 జనవరి- మార్చి నెలలో ఇక్కడ సరాసరి ప్లాట్‌ సైజ్‌ 1130 చదరపు అడుగులుగా ఉంది.

- Advertisement -

కొనుగోలుదారులు పెద్ద ప్లాట్లకు మొగ్గు చూపుతుండడంతో డెవలపర్లు ఆ దిశగా ప్లాట్ల సైజ్‌ పెంచుతున్నారు. ముంబై, చెన్నయ్‌లో మాత్రం ప్లాట్ల సైజ్‌ తగ్గింది. గత 5 సవంవత్సరాలుగా ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌)లో సరాసరి ప్లాట్‌ సైజ్‌ తగ్గుతూ వస్తోంది. 2018లో 932 చదరపు అడుగులు ఉంటే, 2023 నాటికి అది 743 చదరపు అడుగులకు తగ్గింది. ఢిల్లిd-ఎన్‌సీఆర్‌ లో అత్యధికంగా ప్లాట్ల పరిమాణం పెరిగింది. ఇక్కడ 2018లో 1250 చదరపు అడుగులు ఉండగా, ప్రస్తుతం 1700 అడుగులకు చేరింది. హైదరాబాద్‌లో 2022 జనవరి- మార్చి కాలంలో ప్లాట్ల సైజ్‌ 1700 చదరపు అడుగులు ఉంటే, ప్రస్తుతం అది 2200 చదరపు అడుగులకు పెరిగింది.

హైదరాబాద్‌లో ప్లాట్‌ సైజ్‌ 29 శాతం పెరిగింది. కోల్‌కతాలో 2022 జనవరి- మార్చి నెలల్లో ప్లాట్‌ సైజ్‌ 800 చదరపు అడుగులు ఉంటే, ప్రస్తుతం 44 శాతం పెరిగి 1150 చదరపు అడుగులుగా ఉంది. పుణేలో 877 చదరపు అడుగులు ఉంటే, ప్రస్తుతం 16 శాతం పెరిగి 1013 చదరపు అడుగులకు చేరింది. బెంగళూర్‌లో 1200 చదరపు అడుగుల నుంచి 8 శాతం పెరిగి 1300 చదరపు అడుగులకు పెరిగిందని అనరాక్‌ తెలిపింది. చెన్నయ్‌లో 2022 జనవరి -మార్చి లె 1250 చదరపు అడుగులు ఉంటే,2023 మార్చి నాటికి 6 శాతం తగ్గి 1175 చదరపు అడుగులుగా ఉందని అనరాక్‌ తన నివేదికలో తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement