Friday, October 11, 2024

Delhi | 195 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల !

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లోక్‌సభ ఎన్నికలకు తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 543 స్థానాల లోక్‌సభలో ఏకంగా 195 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రుల పేర్లను తొలి జాబితాలో ప్రకటించింది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నలుగురు సిట్టింగ్ ఎంపీల్లో ఆదిలాబాద్ స్థానం మినహా మిగతా మూడు స్థానాల్లో సిట్టింగ్‌లను కొనసాగించింది.

ఈ క్రమంలో కరీంనగర్ నుంచి బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మళ్లీ బరిలోకి దిగుతున్నారు. గురు, శుక్రవారాల్లో పార్టీలో చేరిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పోతుగంటి రాములు, బీబీ పాటిల్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న నాగర్ కర్నూలు, జహీరాబాద్ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించింది. ఎస్సీ రిజర్వుడు స్థానంగా ఉన్న నాగర్ కర్నూలు నుంచి సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడు పి. భరత్ ప్రసాద్‌కు టికెట్ ఇవ్వగా, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్‌ పేరును ప్రకటించింది.

నిజానికి ఈ స్థానానికి తొలుత ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు పేరును పరిశీలించినప్పటికీ, ఆయన ఆసక్తి చూపకపోవడంతో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్‌కు టికెట్ ఖరారు చేశారు. ఈ స్థానం నుంచి మీడియా సంస్థల అధిపతి యేలేటి సురేశ్ రెడ్డి, బాగా రెడ్డి కుటుంబానికి చెందిన జైపాల్ రెడ్డి, బద్దం బాల్‌రెడ్డి కుటుంబానికి చెందిన మహిపాల్ రెడ్డి, ఆలె నరేంద్ర కుమారుడి పేర్లను కూడా అధిష్టానం పరిశీలించింది. చివరకు నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న లింగాయత్ సామాజికవర్గ ఓట్లను దృష్టిలో పెట్టుకుని బీబీ పాటిల్ వైపే మొగ్గు చూపింది.

సీనియర్ నేత మురళీధర్ రావు కన్నేసిన మల్కాజిగిరి స్థానం నుంచి ఈటల రాజేందర్ పేరును ఖరారు చేసింది. ఈ స్థానం నుంచి మల్క కొమురయ్య, టి. వీరేందర్ గౌడ్ సహా పలువురు టికెట్ ఆశించారు. అయితే చివరకు అధిష్టానం ఈటల రాజేందర్‌ వైపే మొగ్గు చూపింది. భువనగిరి స్థానం నుంచి డా. బూర నర్సయ్య గౌడ్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఆయన 2014 నుంచి 2019 వరకు బీఆర్ఎస్ తరఫున ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. చేవెళ్ల స్థానం నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరును ఖరారు చేసింది.

దేశవ్యాప్తంగా ముస్లిం సమాజానికి ప్రతినిధిగా వ్యవహరిస్తూ నిత్యం వార్తల్లో నిలిచే ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రాతినిథ్యం వహిస్తున్న హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి డా. మాధవీలత పేరును కమలనాథులు ఖరారు చేశారు. ఈ నియోజకవర్గంలో హిందూ ఓట్లను ఏకీకృతం చేసి ఓవైసీకి సవాల్ విసరాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. గత కొన్నేళ్లుగా హిందుత్వ ఎజెండాతో డా. మాధవీలత నగరంలో పనిచేస్తున్నందున అధిష్టానం ఆమెవైపు మొగ్గు చూపారు. ఈ స్థానం నుంచి యమున పాఠక్, రాజాసింగ్ వంటి నేతల పేర్లను కూడా అధిష్టానం పరిశీలించినప్పటికీ, చివరకు మాధవీలత వైపే మొగ్గు చూపింది.

- Advertisement -

8 స్థానాలు పెండింగ్

సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆదిలాబాద్ నియోజకవర్గం సహా వరంగల్, మెదక్, పెద్దపల్లి, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాలను బీజేపీ పెండింగులో పెట్టింది. గురువారం తెల్లవారుఝాము వరకు జరిగిన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో మొత్తం 17 స్థానాల అభ్యర్థిత్వాలపై కసరత్తు చేసినప్పటికీ బలమైన అభ్యర్థుల వేటలో అధిష్టానం ఈ 8 స్థానాలను పెండింగులో పెట్టినట్టు తెలిసింది. ఇందులో సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు గత ఐదేళ్లలో కొన్ని వివాదాల్లో చిక్కుకోవడంతో ఆయనకు ప్రత్యామ్నాయంగా బలమైన నేత కోసం అధిష్టానం ఎదురుచూస్తోంది.

ఈ క్రమంలో మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, జనార్థన్ రాథోడ్ పేర్లను పరిశీలించినప్పటికీ ఆదివాసీ సామాజికవర్గానికి చెందిన నేత నగేశ్ కోసం బీజేపీ ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలిసింది. ఆయన ఇంకా బీజేపీలో చేరకపోవడంతో ఈ స్థానాన్ని పెండింగులో ఉంచినట్టు సమాచారం. ఈ స్థానాన్ని ఆదివాసీకి కేటాయిస్తే మరో ఎస్టీ రిజర్వుడు స్థానం మహబూబాబాద్ నుంచి బంజారావర్గం నేతకు టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. తద్వారా ఆదివాసీ, బంజారా వర్గాలకు సమ ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉంటుందని ఆలోచిస్తోంది. ఈ క్రమంలో మహబూబాద్ నుంచి ఆదివాసీ నేత సీతయ్య పేరుతో పాటు బంజారా వర్గం నేత హుస్సేన్ నాయక్ పేర్లను పరిశీలనలో ఉంచింది.

ఇదిలా ఉంటే వరంగల్ నుంచి విశ్రాంత ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్ టికెట్ ఆశిస్తుండగా.. అక్కడ యువనేత కళ్యాణ్ కూడా స్థానికంగా విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. పెద్దపల్లి స్థానం నుంచి పాపులర్ నేత కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తున్నట్టు తెలిసింది. అలాగే మెదక్ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పేరుతో పాటు అంజిరెడ్డి పేర్లు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నప్పటికీ, అక్కడ ప్రత్యర్థి పార్టీలు ప్రకటించే అభ్యర్థిని బట్టి వ్యూహత్మకంగా వ్యవహరించాలని చూస్తోంది.

ఈ క్రమంలో ఈ సీటును పెండింగులో పెట్టినట్టు తెలిసింది. మహబూబ్‌నగర్ స్థానం నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేరు దాదాపు ఖరారైనప్పటికీ.. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా గట్టిగా పట్టుబడుతున్నారు. ఇద్దరిలో ఒకరికి నచ్చజెపితే తప్ప సమస్య తేలేలా కనిపించడం లేదు. అందుకే ఈ స్థానాన్ని తాత్కాలికంగా పెండింగులో ఉంచింది. ఖమ్మం, నల్గొండ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి బలమైన స్థానాలుగా కనిపిస్తున్నందున.. అక్కడ ఆ పార్టీ బలాన్ని సైతం ఢీకొట్టగలిగే ముఖాల కోసం బీజేపీ నాయకత్వం ఎదురుచూస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలకు గాలం వేసి, వారికి టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణలో ఈసారి 17 స్థానాల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుపొందడంపై బీజేపీ దృష్టి పెట్టింది. ఎన్నికల తేదీలు ప్రకటించేలోగానే అభ్యర్థులను ఖరారు చేయడం ద్వారా ప్రచారానికి ఎక్కువ సమయం ఉంటుందని, అభ్యర్థి విజయంలో ఈ అంశం కూడా తోడ్పడుతుందని కమలదళం భావిస్తోంది. గతంలో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వ్యూహం ఫలించి మూడు రాష్ట్రాల్లో పార్టీ విజయ దుందుభి మోగించింది. అందుకే దేశవ్యాప్తంగా మూడో వంతు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి, మిగతా స్థానాల్లో కూడా అభ్యర్థుల ఎంపిక కసరత్తును కొనసాగిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement