Monday, April 29, 2024

Delhi | జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో ఉన్న బీజేపీ జాతీయ కార్యాలయంలో 2వ అంతస్తులో ఆయనకు కేటాయించిన గదిలోకి వేద మంత్రాల నడుమ ప్రవేశించారు. అనంతరం పూజాది కార్యక్రమాలు చేసి తన సీటులో ఆసీనులయ్యారు. ఈ సమయంలో ఆయన వెంట బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ మాజీ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, మైనారిటీ మోర్చా అధ్యక్షులు అఫ్సర్ పాషా, రాష్ట్ర నాయకులు బొమ్మ జయశ్రీ, దేశ్ పాండే, దరువు ఎల్లన్న, నూనె బాలరాజు తదితరులున్నారు.

బాధ్యతలు చేపట్టిన తర్వాత బండి సంజయ్‌కు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షలు ఎల్నేని సుధాకర్ రావు, రాష్ట్ర నాయకులు దిలీపాచారి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నేరుగా విమానాశ్రయానికి బయల్దేరి హైదరాబాద్ పయనమయ్యారు.

- Advertisement -

రామ రాజ్యం ఏర్పాటు చేస్తాం: బండి

బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. తనను నమ్మి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు జాతీయ నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో తనకు ఏ పని అప్పగించినా సరే బాధ్యతాయుతంగా పనిచేస్తానని చెప్పారు. తెలంగాణలో ప్రధాని మోదీ నేతృత్వంలో రామరాజ్యాన్ని స్థాపించేందుకు కృషి చేస్తానని అన్నారు. శుక్రవారం బాధ్యతలు చేపట్టడానికి ముందు గురువారం రాత్రి బండి సంజయ్ కుటుంబ సమేతంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

పార్టీ బలోపేతానికి బండి కృషి: వివేక్

జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి.. అనంతరం ఓ ప్రకటన విడుదల చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అయ్యాక పాదయాత్ర చేసి తెలంగాణలో పార్టీ బలోపేతానికి బండి కృషి చేశారని కొనియాడారు. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీని మార్చారని అన్నారు. ఆయన్ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు చెబుతూ.. బండి సంజయ్ సేవలను తెలంగాణలోనే ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement