Friday, May 3, 2024

డిగ్రీ అడ్మిషన్లు మరింత ఆలస్యం.. ఇంటర్‌ సప్లిమెంటరీ త‌ర్వాతే నిర్వ‌హ‌ణ‌

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. కరోనాకు ముందు వరకు ఏటా జూలై ఒకటో తేదీ నుంచి అడ్మిషన్ల స్వీకరణ, ఆ వెంటనే తరగతుల ప్రారంభం జరిగేది. అయితే గత రెండేళ్లు కోవిడ్‌- 19 కారణంగా విద్యా సంవత్సరం ప్రారంభం కావడంలో తీవ్ర జాప్యం జరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రభావం గత విద్యా సంవత్సరంపైనా చూపడంతో ఇంటర్మీడియట్‌ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఫెయిలయ్యారు. గత నెల 22న విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో ఫస్టియర్‌ 54 శాతం, సెకండియర్‌ 61 శాతం మంది పాసయ్యారు. ఈ నేపథ్యంలో ఫెయిలైన విద్యార్థులు వెనుకబడిపోకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ మేరకు షెడ్యూల్‌ కూడా విడుదల చేసింది. పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పాసైతే.. వారిని రెగ్యులర్‌గా పాసైన వారితోపాటుగానే పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అదే విధంగా మార్కుల మెమోలనూ విడుదల చేయనున్నారు.

ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కూడా అదే విధంగా విద్యా సంవత్సరం నష్టపోకుండా ఆగస్టు మూడో తేదీ నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, త్వరితగతిన ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయ్యే వరకు డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యేలా లేదు. దీంతో సెప్టెంబర్‌ నెలలోకానీ డిగ్రీ తరగతులు ప్రారంభం కాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపు రెండు నెలలు ఆలస్యంగా డిగ్రీ విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. అయితే వచ్చే ఏడాది నుంచి షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలను రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ నిర్వహించాలని దాదాపు పది వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల పరీక్షల జవాబు పత్రా పరిశీలన దాదాపుగా పూర్తయింది. వచ్చే వారంలో రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌కు సంబంధించిన ఫలితాలు వెల్లడి కానున్నట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement