Monday, April 29, 2024

Cyber ​​attack | సైబర్‌ కేటుగాళ్ళ నయా రూట్‌.. సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగాల‌ ప్రకటనలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సైబర్‌ నేరాలకు, ఘోరాలకు, మోసాలకు ఉపయోగిస్తూ కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు. నిరుద్యోగులే లక్ష్యంగా ఎరవేసి ఉచ్చులోకి దింపుతున్నారు. విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని భరోసా ఇస్తూ బోగస్‌ కంపెనీల పేరిట బ్యాకుకు ఖాతాలు తెరిపిస్తూ యధేచ్చగా దోచేస్తున్నారు. ప్రజలను బురిడీ కొట్టిస్తున్న సైబర్‌ నేరగాళ్లు.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిరుద్యోగ యువతీయువకులను పావులుగా మార్చుకుంటున్నారు. తెర వెనుక చక్రం తిప్పుతూ.. కోట్లు కొల్లగొడుతున్నారు. మోసపోయిన బాధితుల ఫిర్యాదులతో కేసులు నమోదైనా అసలు సూత్రధారులు తప్పించుకుంటున్నారు. కమీషన్‌పై ఆశతో పాన్‌, ఆధార్‌కార్డులు, బ్యాంకు ఖాతాలు ఇచ్చి సహకరించిన ఉద్యోగులు బలి పశువులుగా మారుతున్నారు. ఈ బోగస్‌ కంపెనీల పేర్లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న ముఠా మూలాలు హైదరాబాద్‌లోనూ ఉన్నాయని సైబర్‌ క్రైం పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -

ఇంటర్‌, డిగ్రీ, పీజీ చేసిన యువత.. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం పోటీపడుతున్నారు. పేద, మధ్యతరగతికి చెందిన నిరుద్యోగుల అవసరాలను సైబర్‌ మోసగాళ్లు.. అనువుగా మలుచుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటనలు గుప్పించి టెలీకాలర్స్‌గా ఎంపిక చేస్తున్నారు. నెలకు రూ.8 నుంచి రూ.10 వేల ప్రారంభ వేతనం ఇవ్వడంతోపాటు వసతి కల్పిస్తున్నారు. ప్రతినెలా జీతం జమ చేస్తామంటూ వారి పేరిట బ్యాంకుల్లో ఖాతా తెరిపిస్తున్నారు. కొంతకాలం గడిచాక కొందరినీ ఎంపిక చేసి.. పదోన్నతుల పేరిట నకిలీ సంస్థలకు డైరెక్టర్లుగా నియమిస్తున్నారు. సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలు, కార్యాలయాల అద్దెలు, కంపెనీల లావాదేవీలన్నీ వారితోనే నిర్వహిస్తూ.. అసలు సూత్రదారులు తమ గుట్టు బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదైతే అసలు దొంగలు తేలికగా తప్పించుకుంటున్నారు.

కుటుంబానికి అండగా ఉండే ఉద్దేశంతో కొందరు.. తెలియక మరికొందరు పోలీస్‌ రికార్డుల్లో నేరస్థులుగా మారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తప్పటడుగును సరిదిద్దుకోలేని ఇంకొందరు, ఆ అనుభవంతో సైబర్‌ మాయగాళ్ల అవతారం ఎత్తుతున్నారు.
ఈ ఏడాది ఇప్పటివరకు రుణయాప్‌, టెలీకాల్‌ సెంటర్లు, నకిలీ ఉద్యోగాలు, పెట్టుబడుల పేరిట మోసాలకు తెగబడినవారిపై.. 1560 కేసులు నమోదయ్యాయి. వాటిలో 200 మంది నిందితులను అరెస్ట్‌ చేయగా వారిలో 100 మంది సైబర్‌ మోసగాళ్లకు బ్యాంకు ఖాతాలు, బోగస్‌ కంపెనీలకు డైరెక్టర్లుగా యువతీ, యువకులే ఉన్నారు. దిల్లీ, హర్యానా, రాజస్థాన్‌, హైదరాబాద్‌కి చెందిన 250 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

వారి నుంచి వచ్చే సమాధానం, దర్యాప్తులో లభించే ఆధారాలు బట్టి సాక్షులుగా మార్చాలా లేకా నిందితులుగా చేర్చాలా అనేది నిర్ణయిస్తామని.. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన మున్వర్‌ మహ్మద్‌, అరుల్‌దాస్‌, షమీర్‌ఖాన్‌, సుమేర్‌.. చైనా సైబర్‌ మోసగాళ్ల కోసం లక్నో వెళ్లి మూడు నెలలున్నారు. 33 బోగస్‌ కంపెనీల పేరిట వేర్వేరు బ్యాంకుల్లో 65 ఖాతాలు ప్రారంభించారు. వాటి ద్వారానే దేశవ్యాప్తంగా 15వేల మంది బాధితుల నుంచి కొట్టేసిన రూ.712కోట్లను హవాలా మార్గంలో చైనా చేరేందుకు సహకరించారు.

ఖాతాకు రూ.2లక్షల కమీషన్‌కు ఆశపడి సహకరించిన నలుగురికీ.. డబ్బులు ఇవ్వకుండా మాయగాళ్లు ఝలక్‌ ఇచ్చారు. ఐతే వారంతా సైబర్‌ నేరాల కింద అరెస్టయి జైలు పాలయ్యారు. వ్యక్తిగత బ్యాంకు ఖాతాలను ఇతరులకు ఇవ్వటం నేరమని తెలిసి.. తెలియకుండా చేసినా.. కేసుల్లో ఇరుక్కుంటారని సైబర్‌ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్‌ కేసుల్లో.. ఇటీవల కాలంలో చాలామంది యువకులు కమీషన్‌పై ఆశతో తమ పేరిట బ్యాంకు ఖాతాలు ప్రారంభించి మోసగాళ్ల చేతికి ఇస్తున్నారని వాటి ద్వారా అసాంఘిక శక్తులు మత్తు పదార్థాలు, సైబర్‌ నేరాలు, హవాలా అంశాలకు వినియోగించుకుంటున్నాడని చెబుతున్నారు. పాన్‌, ఆధార్‌కార్డు నకళ్లు ఇచ్చినా దుర్వినియోగం చేసే అవకాశం ఉందని గమనించాలని భవిష్యత్‌ భద్రంగా ఉండాలంటే ఎలాంటి తప్పటడుగులు వేయవద్దని సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement