Saturday, July 27, 2024

Big Story: క్రికెట్​ వార్​.. ముంబై, పుణే వేదికలుగా మరికాసేపట్లో 15వ సీజన్‌ ప్రారంభం

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ 15వ సీజన్‌కు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ఐపీఎల్‌ 2022కు తెరలేవనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌, రన్నరప్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య శనివారం తొలి మ్యాచ్‌ జరగనుంది. మార్చి 26న మొదలయ్యే మెగా టోర్నీ మే29న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. తాజా సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ అరంగేట్రం చేయనుండటంతో మొత్తం జట్ల సంఖ్య 10కు చేరింది. పదిజట్లు రెండు గ్రూపులుగా తలపడనున్నాయి. స్టార్‌స్పోర్ట్స్‌ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. తాజా సీజన్‌లో ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లి క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌కింగ్స్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ టైటిల్‌ వేటలో బరిలోకి దిగనున్నాయి. ఐపీఎల్‌ 2022 టైటిల్‌ స్పాన్సర్‌గా దేశీయ వ్యాపార దిగ్గజం టాటా వ్యవహరించనుంది.

అయ్యర్‌ వర్సెస్‌ జడేజా..

ఈ రోజు రాత్రి 7.30కు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా సీఎస్కే – కేకేఆర్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ తొలిసారి చెన్నైజట్టు పగ్గాలు అందుకున్న రవీంద్రజడేజా, కోల్‌కతా జట్టుకు సారథ్యం వహిస్తున్న శ్రేయస్‌ అయ్యర్‌కు తొలి సవాల్‌గా నిలవనుంది. జడేజాసేనకు శ్రేయస్‌ సేనకు మధ్య జరిగే తొలి మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐపీఎల్‌ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 25శాతం ప్రేక్షకులను అనుమతించనున్నారు. గత ఐపీఎల్‌లో కరోనా కారణంగా ఎదురైన పరిస్థితులను అధిగమించేందుకు ఐపీఎల్‌ 2022ను మహారాష్ట్రలోని ముంబై, పుణ వేదికలుగా మొత్తం లీగ్‌ను నిర్వహించనున్నారు. దిగ్గజ ధోనీ సీఎస్కేకు అండగా ఉన్నా ఐపీఎల్‌ మెగావేలంలో టాప్‌ ఆల్‌రౌండర్‌ దీపక్‌ చాహర్‌ గాయంతో దూరమవడం, డుప్లెసిస్‌ ఆర్సీబీకి తరలిపోవడం, మొయిన్‌అలీ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడం చెన్నైజట్టును కలవరపరుస్తోంది. డిఫెండిగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న సీఎస్కేకు కేకేఆర్‌ నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది.

చెన్నై ఓపెనర్లుగా రుతురాజ్‌ గైక్వాడ్‌, కివీస్‌ స్టార్‌ బ్యాటర్‌ కాన్వే బరిలోకి దిగనున్నారు. వన్‌డౌన్‌లో రాబిన్‌ ఊతప్ప, తర్వాత అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, శివందూబె, ఏడోస్థానంలో ధోనీ ఫినిషర్‌గా క్రీజులోకి వచ్చే అవకాశం ఉంది. బ్రావో, మిల్నే, క్రిస్‌ జోర్డాన్‌లతోపాటు అండర్‌-19 ప్రపంచకప్‌లో మెరిసిన హంగార్గ్కకర్‌ అరంగేట్రం చేయనున్నాడు. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ వ్యవహరించనున్నాడు. 14వ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన కేకేఆర్‌ను ఈ ఏడాది ఛాంపియన్‌గా నిలపాలని శ్రేయస్‌ పట్టుదలగా ఉన్నాడు. చెన్నై జట్టు నాలుగుసార్లు టైటిల్‌ విజేతగా నిలిస్తే కోల్‌కతా రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. శ్రేయస్‌కు తోడుగా ఫించ్‌, నరైన్‌, రసెల్‌, కమిన్స్‌, నితీశ్‌రాణా, వరుణ్‌చక్రవర్తి, వెంకటేశ్‌ అయ్యర్‌ జట్టులో కీలకపాత్ర పోషించనున్నారు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌..

- Advertisement -

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సారథిగా వ్యవహరించనున్నాడు. 2016లో విజేతగా నిలిచిన ఆరెంజ్‌ ఆర్మీ ఆ తర్వాత మరోసారి టైటిల్‌ను సాధించలేకపోయింది. కేన్‌ సారథ్యంలోని ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టులో భువనేశ్వర్‌ కుమార్‌, నటరాజన్‌, రాహుల్‌ త్రిపాఠి, ప్రియంగార్గ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, కార్తీక్‌త్యాగి, రవికుమార్‌ సమర్థ్‌, అబ్దుల్‌ సమద్‌, అభిషేక్‌శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, శశాంక్‌సింగ్‌, విష్ణువినోద్‌, శ్రేయస్‌ గోపాల్‌, జగదీశ సబిత్‌, సౌరభ్‌ దూబె తదితర దేశీయ ఆటగాళ్లతోపాటు మార్క్‌రమ్‌, మార్కో జాన్సెన్‌, రొమారియో షెపర్డ్‌, నికోలస్‌ పూరన్‌, గ్లెన్‌ఫిలిప్స్‌ బరిలోకి దిగనున్నారు.

చెన్నై సూపర్‌కింగ్స్‌..

చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు పగ్గాలును ధోనీ టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు అందించడంతో 15వ సీజన్‌ కెప్టెన్‌గా జడేజా వ్యవహరించనున్నాడు. ధోనీ సారథ్యంలో సీఎస్కే 2010, 2011, 2018, 2021లో ట్రోఫీని ముద్దాడింది. జడేజా సేనలో ధోనీ, రుతురాజ్‌, రాయుడు, ఉతప్ప, నిశాంత్‌, సుబ్రాన్షు, జగదీశన్‌, భగత్‌, రాజ్‌వర్ధన్‌, దీపక్‌, ఆసీఫ్‌, ముకేశ్‌, ప్రశాంత్‌, సిమర్జిత్‌, తుషార్‌తోపాటు విదేశీ ఆటగాళ్లు కాన్వే, జోర్డాన్‌, ప్రిటోరియస్‌, బ్రావో, శాంట్నర్‌, మొయిన్‌అలీ, మిల్నే, తీక్షణ ఉన్నారు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌..

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు ఢిల్లి క్యాపిటల్స్‌ మాజీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మెగాలీగ్‌లో కోల్‌కతా 2012, 2014లో ఛాంపియన్‌గా నిలిచింది. తాజా సీజన్‌లో శ్రేయస్‌ సేనలో వెంకటేశ్‌ అయ్యర్‌, రహానె, నితీశ్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి, ఉమేశ్‌ యాదవ్‌, శివమ్‌ మావి, రింకుసింగ్‌, అనుకుల్‌ రాయ్‌, అభిజిత్‌ తోమర్‌, రమేశ్‌కుమార్‌, ప్రథమ్‌సింగ్‌, బాబా ఇంద్రజిత్‌, అమన్‌, అశోక్‌శర్మతోపాటు విదేశీ ఆటగాళ్లు రసెల్‌, నరైన్‌, కమిన్స్‌, ఫించ్‌, నబి, సామ్‌బిల్లింగ్స్‌, కరుణరత్నే, సౌథీ ఉన్నారు.

గుజరాత్‌ టైటాన్స్‌..

ఐపీఎల్‌ 2022లో కొత్తగా గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు అరంగేట్రం చేయనుంది. హార్దిక్‌పాండ్య గుజరాత్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. హార్దిక్‌కు తోడుగా శుభ్‌మన్‌ గిల్‌, సాహా, విజయ్‌శంకర్‌, గురుకీరత్‌, షమీ, దర్శన్‌, వరుణ్‌ అరోన్‌, ప్రదీప్‌, యశ్‌ దయాల్‌, సాయి సుదర్శన్‌, జయంత్‌ యాదవ్‌తోపాటు విదేశీ ఆటగాళ్లు రషీద్‌ఖాన్‌, డేవిడ్‌ మిల్లర్‌, డొమినిక్‌ డ్రేక్స్‌, అల్జారీ జోసెఫ్‌, రహ్మతుల్లా, మాథ్యూవేడ్‌, ఉన్నారు.

పంజాబ్‌ కింగ్స్‌..

పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా మయాంక్‌ అగర్వాల్‌ వ్యవహరించనున్నాడు. మయాంక్‌ సారథ్యంలో శిఖర్‌ధావన్‌, రాహుల్‌ చాహర్‌, సందీప్‌శర్మ, వైభవ్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌, రాజ్‌ అంగద్‌ బవా, రిషి ధావన్‌, షారుక్‌ఖాన్‌, అర్ష్‌దీప్‌సింగ్‌, బాల్‌తేజ్‌, ఇషాన్‌ పొరెల్‌, జితేశ్‌ శర్మ, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, అన్ష్‌ పటేల్‌, అధర్వ, ప్రేరక్‌ మన్కడ్‌, వృత్తిక్‌ చటర్జీతోపాటు విదేశీ ఆటగాళ్లు బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్‌, ఒడియన్‌ స్మిత్‌, నాథన్‌ ఎలిస్‌, భానుక రాజపక్స, బెన్నీ హోవెల్‌ ఉన్నారు. 2014లో పంజాబ్‌ జట్టు రన్నరప్‌గా నిలవడమే కింగ్స్‌ ఉత్తమ ప్రదర్శన.

లక్నో సూపర్‌జెయింట్స్‌..

ఐపీఎల్‌ తాజా సీజన్‌లో అరంగేట్రం చేయనున్న లక్నో సూపర్‌జెయింట్స్‌కు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రాహుల్‌ సారథ్యంలోని జట్టులో మనీశ్‌పాండే, వోహ్రా, ఆయుష్‌, దీపక్‌హుడా, కె గౌతమ్‌, కర్ణ్‌శర్మ, కృనాల్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, అవేశ్‌ఖాన్‌, మయాంక్‌యాదవ్‌, మోసిన్‌ఖాన్‌, రవిబిష్ణోయ్‌, షాబాజ్‌ నదీమ్‌తోపాటు విదేశీ ప్లేయర్స్‌ లూయిస్‌, డికాక్‌, మేయర్స్‌, స్టొయినిస్‌, చమీర, వుడ్‌ ఉన్నారు.

ఢిల్లి క్యాపిటల్స్‌..

ఢిల్లి క్యాపిటల్స్‌కు టీమిండియా యువ వికెట్‌కీపర్‌, బ్యాటర్‌ రిషభ్‌పంత్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. పంత్‌ కెప్టెన్సీలోనే ఢిల్లి జట్టులో పృథ్వీషా, కేఎస్‌ భరత్‌, అక్షర్‌పటేల్‌, అశ్విన్‌ హెబ్బర్‌, మన్‌దీప్‌సింగ్‌, కమలేష్‌ నాగర్‌కోటీ, లలిత్‌ యాదవ్‌, ప్రవీణ్‌ దూబె, రిపల్‌ పటేల్‌, సర్ఫరాజ్‌ఖాన్‌, విక్కీ, యశ్‌ధుల్‌, చేతన్‌ సకారియా, కుల్దిప్‌యాదవ్‌, శార్దూల్‌, ఖలీల్‌ అహ్మద్‌తోపాటు విదేశీ ఆటగాళ్లు డేవిడ్‌ వార్నర్‌, సీఫర్ట్‌, మిచెల్‌మార్ష్‌, ఎంగిడి, ముస్తాఫిజుర్‌ ఉన్నారు.

రాజస్థాన్‌ రాయల్స్‌..

రాజస్థాన్‌ రాయల్స్‌కు సంజూ శాంసన్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సంజూ సారథ్యంలోని ఆర్‌ఆర్‌ జట్టులో దేవ్‌దత్‌ పడిక్కల్‌, కరుణ్‌ నాయర్‌, యశస్వి జైశ్వాల్‌, ధ్రువ్‌, అనునయ్‌సింగ్‌, పరాగ్‌, శుభమ్‌, కరియప్ప, కుల్‌దీప్‌సేన్‌, నవదీప్‌సైనీ, ప్రసిధ్‌కృష్ణ, తేజస్‌, చాహల్‌తోపాటు విదేశీ ప్లేయర్స్‌ బట్లర్‌, డసెన్‌, హెట్‌మయర్‌, డారిల్‌ మిచెల్‌, నీషమ్‌, కౌల్టర్‌నైల్‌, మెకాయ్‌ బౌల్ట్‌ సభ్యులుగా ఉన్నారు. రాజస్థాన్‌ రాయల్స్‌ మెగాలీగ్‌ ఆరంభ సీజన్‌ 2008లో షేన్‌వార్న్‌ సారథ్యంలో విజేతగా నిలిచింది.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు..

కోహ్లీ కెప్టెన్‌గా వైదొలగడంతో ఐపీఎల్‌ తాజా సీజన్‌లో డుప్లెసిస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. డుప్లెసిస్‌కు అండగా కోహ్లీతోపాటు దినేశ్‌కార్తీక్‌, సిరాజ్‌, హర్షల్‌ పటేల్‌, సిద్ధార్థ్‌ కౌల్‌, లోమ్రర్‌, ఆకాశ్‌దీప్‌, అనుజ్‌రావత్‌, అనీశ్వర్‌ గౌతమ్‌, మిలింద్‌, షాబాజ్‌ అహ్మద్‌, కర్ణ్‌శర్మ, సిసోడియా తదితర దేశీయ ఆటగాళ్లుతోపాటు మ్యాక్స్‌వెల్‌, హసరంగ, ఫిన్‌అలెన్‌, బెరెల్‌డార్ఫ్‌, హేజిల్‌వుడ్‌, రూథర్‌ఫోర్డ్‌, డేవిడ్‌ విల్లి తదితరులు టైటిల్‌ కోసం పోరాడనున్నారు.

ముంబై ఇండియన్స్‌..

ఐపీఎల్‌ చరిత్రలో ముంబై ఇండియన్స్‌కు ప్రత్యేకస్థానం ఉంది. మెగాలీగ్‌ ఇప్పటివరకు అత్యధికంగా ముంబై జట్టు ఐదుసార్లు విజేతగా నిలిచింది. మరే జట్టుకు సాధ్యంకాని రికార్డు ఉన్న ముంబైజట్టుకు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌శర్మ సారథిగా వ్యవహరించనున్నాడు. హిట్‌మ్యాన్‌కు తోడుగా టీమిండియా వైస్‌ కెప్టెన్‌ బుమ్రా, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌,ఎం అశ్విన్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, మార్కండే, తిలక్‌వర్మ, సంజయ్‌ యాదవ్‌, అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌, అర్షద్‌ఖాన్‌, రమణ్‌దీప్‌సింగ్‌, రాహుల్‌ బుద్ధి, హృతిక్‌, అర్జున్‌ టెండూల్కర్‌, ఆర్యన్‌, కీరన్‌ పొలార్డ్‌, డేవాల్డ్‌ బ్రేవిస్‌, బాసిల్‌, జోఫ్రా ఆర్చర్‌, డానియల్‌ సామ్స, మిల్స్‌, టిమ్‌ డేవిడ్‌, మెరిడిత్‌, ఫాబియన్‌ జట్టులో ఉన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement