Friday, May 17, 2024

కరోనా రిస్క్‌ ప్రభావం తొలగిపోలేదు : బిల్‌గేట్స్‌..

వాషింగ్టన్, ప్ర‌భ‌న్యూస్ : కరోనా ప్రభావం పూర్తిగా తొలగిపోలేదనీ,ఇంతవరకూ ఉన్న వేరియంట్ల కన్నా తీవ్రమైనవి, ప్రభావవంతమైనవి అయిన కరోనా వేరియంట్సు ముంచుకుని రావచ్చనీ,అందుకు ప్రజలూ, ప్రభుత్వాలూ సిద్ధంగా ఉండాలని మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ హెచ్చరించారు. సాధారణ వేరియంట్ల కన్నా ప్రమాదకరమైనవి, తీవ్రమైనవి అయిన వేరియంట్ల ప్రభావం రానున్నదని ఆయన అన్నారు. తాను నిరాశా నిస్పృహలతోలేదా జనాన్ని భయపెట్టే ఉద్దేశ్యంతో ఈ విషయం చెప్పడం లేదనీ, ఇప్పటివరకూ మనం చూసిన వేరియంట్ల కంటే ఐదు శాతంప్రమాదకరమైన వేరియంట్లు విస్తరించే ప్రమాదం ఉందని బిల్‌గేట్స్‌ హెచ్చరించారు. ఈ కొత్త వేరియంట్లను ఎదుర్కోవడానికి ప్రజలు మానసికంగా సిద్ధం కావాలనీ, అలాగే తగిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వాలు సంసిద్ధం కావాలని ఆయన సూచించారు.

కరోనా కొత్తవేరియంట్ల ప్రమాదం గురించి శాస్త్రజ్ఞులు ప్రజలకు వివరంగా తెలియజేయాలనీ, ప్రభుత్వాలు కూడా ఈ వేరియంట్ల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలను హెచ్చరించడం,జాగ్రత్తలను సూచించడం వంటి చర్యలు తీసుకోవాలని బిల్‌గేట్స్‌ ఫైనాన్షియల్‌ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూచించారు. కాగా, బిల్‌ గేట్స్‌ కోవిడ్‌-19 గురించి 2015లోనే హెచ్చరించారు. ప్రపంచ దేశాలు అప్పట్లోనే జాగ్రత్త పడి ఉంటే పాండమిక్ వల్ల నష్టాన్ని తగ్గించి ఉండేవారమని బిల్‌గేట్స్‌ స్పష్టం చేశారు.ఇప్పటికైనా శాస్త్రజ్ఞులు, ప్రభుత్వాలు సమన్వయంతో ఈకొత్త వేరియంట్ల రిస్క్‌ నుంచి మానవాళిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. అలాగే, కరోనా రిస్క్ ప్రభావం నుంచి తప్పించుకోవడానికి పౌరులు కూడా తమ పరిధిలో జాగ్రత్తలను తీసుకోవాలనీ, కరోనా పూర్తిగా తొలగిపోయిందన్న అలసత్వం, నిర్లిప్తత పనికి రావని ఆయన హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement