Thursday, April 25, 2024

విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఇద్దరు సీఎంల కుట్ర.. బీజేపీ నేత‌ భానుప్రకాశ్ రెడ్డి ధ్వజం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొత్త నాటకానికి తెరతీశారని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగం అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ నేత, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన శుక్రవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మళ్లీ తెలంగాణను కలుపుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుచేసేందుకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ ముందుంటుంది అన్న సజ్జల ప్రకటన వెనుక తెలంగాణ సీఎం కే. చంద్రశేఖర రావు ఉన్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రోద్భలంతోనే సజ్జల ఈ తరహా వ్యాఖ్యలు చేశారని అన్నారు.

తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల నుంచి, కూతురు కవిత కేసులు, ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ ఈ తరహా ప్రకటనలు చేయిస్తున్నారని ఆరోపించారు. విద్వేషాలు రెచ్చగొట్టే ప్రకటనలు, వ్యాఖ్యలు తక్షణమే ఆపాలని ఇద్దరు ముఖ్యమంత్రులకు హితవు పలికారు.

మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న ఆరోపణలపైనా భానుప్రకాశ్ రెడ్డి స్పందించారు. మోడీ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదని, తెలంగాణలో తమ పార్టీ అధ్యక్షుడు బండిసంజయ్‌ను ఎదుర్కుంటే చాలని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్‌గా మారిందని, త్వరలో వీఆర్ఎస్ తీసుకోవడం ఖాయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ నెలకొందని, ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించలేని పరిస్థితి ఉందని అన్నారు. రాష్ట్రంలో అప్పులు విపరీతంగా పెరిగి, అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని అన్నారు. ఏపీ ఆర్థిక మంత్రి అప్పుల శాఖ మంత్రిగా మారారని భానుప్రకాశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెచ్చిన అప్పులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement